విండీస్‌నూ ఊదేశారు | India beat West Indies by 125 runs | Sakshi
Sakshi News home page

విండీస్‌నూ ఊదేశారు

Published Fri, Jun 28 2019 4:44 AM | Last Updated on Fri, Jun 28 2019 8:45 AM

India beat West Indies by 125 runs - Sakshi

వరల్డ్‌కప్‌ వేటలో ఎదురు లేకుండా సాగుతున్న భారత బృందం మరో జట్టుపై తమ ప్రతాపం ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైనా, అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శనతో చెలరేగి ఐదో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది. తిరుగులేని ఆటతో టోర్నీలో ఓటమెరుగని జట్టుగా తమ స్థాయిని చూపిస్తూ దాదాపుగా సెమీఫైనల్‌ స్థానాన్ని ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కోహ్లి కీలక ఇన్నింగ్స్‌తో పాటు చివర్లో ధోని మెరుపులు భారత్‌ను ఆదుకోగా, బౌలింగ్‌లో షమీ, బుమ్రాల సూపర్‌ ప్రదర్శన ఘన విజయాన్ని అందించాయి.

టీమిండియాకు ఎంతో కొంత పోటీనివ్వగలదని భావించిన వెస్టిండీస్‌ కూనల స్థాయి బ్యాటింగ్‌ ప్రదర్శనతో పరాజయాన్ని ఆహ్వానించింది. మెరుగైన బౌలింగ్‌తో కోహ్లి సేనను నిరోధించగలిగిన ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించడంలో మాత్రం పేలవ ప్రదర్శన కనబర్చింది. ఫలితంగా ప్రపంచ కప్‌లో సెమీస్‌ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన మూడో జట్టుగా నిలిచింది. ఇక అజేయ భారత్‌ తదుపరి లక్ష్యం ఆదివారం ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించడమే!  


మాంచెస్టర్‌: విశ్వ వేదికలో భారత్‌ మళ్లీ తమ సత్తా చాటింది. ఆరో లీగ్‌ మ్యాచ్‌లో ఐదో విజయం సాధించి మరింత పైకి దూసుకుపోయింది. గురువారం ఇక్కడి ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 125 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి (82 బంతుల్లో 72; 8 ఫోర్లు), ఎమ్మెస్‌ ధోని (61 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేయగా... కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (38 బంతుల్లో 46; 5 ఫోర్లు) రాణించారు. అనంతరం వెస్టిండీస్‌ 34.2 ఓవర్లలో 143 పరుగులకే ఆలౌటైంది. సునీల్‌ ఆంబ్రిస్‌ (31)దే అత్యధిక స్కోరు. పేసర్లు షమీ (4/16), బుమ్రా (2/9), స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ (2/39) ప్రత్యర్థిని దెబ్బతీశారు.  

రాణించిన రాహుల్, పాండ్యా
విండీస్‌ పేసర్లు కాట్రెల్, రోచ్‌ పదునుగా బౌలింగ్‌ చేయడంతో ఆరంభంలో భారత ఓపెనర్లు రోహిత్‌ (18), రాహుల్‌ జాగ్రత్తగా ఆడారు. ఐదో ఓవర్‌ మూడో బంతికి గానీ తొలి బౌండరీ రాలేదు. రోచ్‌ వేసిన ఆరో ఓవర్లో రోహిత్‌ భారీ సిక్స్, రాహుల్‌ ఫోర్‌ కొట్టగా, అదే ఓవర్‌ చివరి బంతికి రోహిత్‌ వెనుదిరిగాడు. రాహుల్‌ అర్ధసెంచరీకి చేరువలో రోచ్‌ వేసిన బంతికి క్లీన్‌బౌల్డయ్యాడు. కోహ్లి, రాహుల్‌ రెండో వికెట్‌కు 69 పరుగులు జోడించారు. నాలుగో స్థానంలో మరో అవకాశం అందుకున్న విజయ్‌ శంకర్‌ (14) ఈసారి కూడా దానిని వాడుకోలేకపోయాడు.

హోల్డర్‌ బౌలింగ్‌లోనే మూడు ఫోర్లు కొట్టిన అతను... రోచ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. శంకర్‌ ఔటైన తీరు కోహ్లికి కూడా అసహనం తెప్పించింది. అతను తన చేతికి ఉన్న గ్లవ్స్‌ను విసిరి కొట్టాడు. రోచ్‌ తర్వాతి ఓవర్లో జాదవ్‌ (7) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అంపైర్‌ తిరస్కరించడంతో రివ్యూ చేసిన విండీస్‌ ఫలితం సాధించింది. కోహ్లి ఔటయ్యాక పాండ్యా క్రీజ్‌లో ఉన్నంత సేపు దూకుడు కనబరుస్తూ బౌండరీలు బాదాడు. ఆరో వికెట్‌కు ధోని, పాండ్యా 70 పరుగులు జత చేశారు.  

విరాట్‌ ఎప్పటిలాగే...
పిచ్, పరిస్థితులు ఎలా ఉన్నా పరుగులు చేయకుండా కోహ్లిని ఎవరూ ఆపలేరు. గురువారం ఇదే జరిగింది. తనదైన శైలి బ్యాటింగ్‌ ప్రదర్శనతో కీలక అర్ధ సెంచరీ సాధించాడు. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న సమయంలో కోహ్లికి అదృష్టం కూడా కలిసొచ్చింది. థామస్‌ బౌలింగ్‌లో రాహుల్‌ పాయింట్‌ దిశగా కొట్టగా కోహ్లి సింగిల్‌ కోసం చాలా ముందుకు దూసుకొచ్చాడు. అయితే రాహుల్‌ వెనక్కి పంపించాడు. ఫీల్డర్‌ బంతిని అందుకోకపోవడంతో కెప్టెన్‌ బతికిపోయాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా సింగిల్‌ తీయడంతో (37 పరుగుల వద్ద) అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే 55 బంతుల్లో అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఆ తర్వాత రెండు ఫోర్లు కొట్టిన కోహ్లి చెత్త షాట్‌కు వెనుదిరిగాడు. హోల్డర్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి మిడ్‌వికెట్‌లో సునాయాస క్యాచ్‌ ఇచ్చాడు.  

హోల్డర్‌... సూపర్‌...
కోహ్లికి మెయిడిన్‌ ఓవర్‌ వేయడం అంటే మాటలు కాదు. కానీ విండీస్‌ కెప్టెన్‌ హోల్డర్‌ వేసిన 15వ ఓవర్లో కోహ్లి ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు. రాహుల్‌ ఎదుర్కొన్న అంతకు ముందు హోల్డర్‌ ఓవర్‌ కూడా మెయిడిన్‌గానే ముగిసింది. యార్కర్, బౌన్సర్‌ కూడా లేకుండా కేవలం కచ్చితత్వంతో బౌలింగ్‌ చేసిన హోల్డర్‌ ఏకంగా 46 డాట్‌ బంతులు సంధించడం మరో విశేషం.  

ధోని విఫలమయ్యాడా!  
61 బంతుల్లో 56 నాటౌట్‌... ఇందులో 3 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఎలా చూసినా ఇది మంచి స్కోరే. అయినా సరే ధోని ఆటతీరుపై మళ్లీ విమర్శలు వినిపించాయి. చివరి ఓవర్‌ మెరుపులను మినహాయిస్తే వన్డే క్రికెట్‌కు ఎంతో అవసరమైన ‘స్ట్రయిక్‌ రొటేటింగ్‌’ విషయంలో ధోని బాగా ఇబ్బంది పడటమే అందుకు కారణం. తాను ఎదుర్కొన్న నాలుగో బంతికి ఫోర్‌ కొట్టిన ధోని ఆ తర్వాత సింగిల్స్‌ తీయడానికి శ్రమించాడు. 8 పరుగుల వద్ద కీపర్‌ హోప్‌ అతి సునాయాస స్టంపింగ్‌ను వదిలేయడం ధోనికి కలిసొచ్చింది.

తొలి 40 బంతుల్లో అతను 20 పరుగులే చేయగలిగాడు. 37 వద్ద కూడా థామస్‌ రిటర్న్‌ క్యాచ్‌ వదిలేశాడు. అప్పటి వరకు 55 బంతుల్లో 40 పరుగుల వద్ద ఉన్న ఎమ్మెస్‌... థామస్‌ వేసిన ఆఖరి ఓవర్లో మాత్రం చెలరేగాడు. 2 భారీ సిక్సర్లు, ఒక ఫోర్‌ బాది 16 పరుగులు రాబట్టాడు. తొలి 5 ఓవర్లలో 34 పరుగులిచ్చిన అలెన్‌... తర్వాతి 5 ఓవర్లలో 18 పరుగులే ఇచ్చాడు. ఇందులో ధోనినే 19 బంతులు ఎదుర్కొన్నాడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్‌ విమర్శించాడు!

టపటపా...
వెస్టిండీస్‌ బ్యాటింగ్‌ బలగాన్ని బట్టి చూస్తే 269 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ టీమిండియా అద్భుత బౌలింగ్‌ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్‌నుంచే  కట్టిపడేసిన మన బౌలర్లు ప్రత్యర్థి కోలుకునే అవకాశం ఇవ్వకుండా వికెట్లు పడగొట్టారు. షమీ బౌలింగ్‌లో తీవ్రంగా ఇబ్బంది పడిన గేల్‌ (6) చివరకు అసహనంతో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగడంతో విండీస్‌ పతనం మొదలైంది. ఆ వెంటనే షమీ అద్భుత బంతి హోప్‌ (5) వికెట్లను గిరాటేసింది.

ఈ దశలో ఆంబ్రిస్, పూరన్‌ (28; 2 ఫోర్లు) మూడో వికెట్‌కు 55 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే ఆంబ్రిస్‌ను పాండ్యా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న తర్వాత విండీస్‌ పతనం వేగంగా సాగింది. 36 పరుగుల వ్యవధిలో ఆ జట్టు నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయింది. హెట్‌మైర్‌ (18), హోల్డర్‌ (6), బ్రాత్‌వైట్‌ (1) విఫలం కావడంతో ఆ జట్టు పరాజయం దిశగా సాగింది. మరో 15.4 ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్‌ ఆలౌటైంది.

రోహిత్‌ ఔటా, కాదా!
ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విషయంలో థర్డ్‌ అంపైర్‌ ఇచ్చిన నిర్ణయం కూడా సందేహాస్పదంగా కనిపించింది. రోచ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ ఆడిన బంతి కీపర్‌ చేతుల్లో పడింది. విండీస్‌ అప్పీల్‌ చేయగా అంపైర్‌ తిరస్కరించాడు. దీనిపై విండీస్‌ రివ్యూ కోరింది. రీప్లేలో స్నికోలో కనిపించిన స్పైక్‌ను బట్టి థర్డ్‌ అంపైర్‌ మైకేల్‌ గాఫ్‌ ఔట్‌గా ప్రకటించాడు. అయితే బంతి బ్యాట్‌కంటే ప్యాడ్‌కు తగిలినప్పుడు స్నికో స్పందించినట్లుగా, బంతికి బ్యాట్‌కు మధ్య కొంత ఖాళీ ఉన్నట్లు కూడా అనిపించింది. దీనిపై పూర్తి స్పష్టత లేకపోయినా అంపైర్‌ మాత్రం తన నిర్ణయాన్ని భారత్‌కు ప్రతికూలంగా వెల్లడించారు. దాంతో రోహిత్‌ నిరాశగా వెనుదిరిగాడు.  




స్కోరు వివరాలు

భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (బి) హోల్డర్‌ 48; రోహిత్‌ (సి) హోప్‌ (బి) రోచ్‌ 18; కోహ్లి (సి) (సబ్‌) డారెన్‌ బ్రేవో (బి) హోల్డర్‌ 72; విజయ్‌ శంకర్‌ (సి) హోప్‌ (బి) రోచ్‌ 14; జాదవ్‌ (సి) హోప్‌ (బి) రోచ్‌ 7; ధోని (నాటౌట్‌) 56; పాండ్యా (సి) అలెన్‌ (బి) కాట్రెల్‌ 46; షమీ (సి) హోప్‌ (బి) కాట్రెల్‌ 0; కుల్దీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం 50 ఓవర్లలో 7 వికెట్లకు) 268.

వికెట్ల పతనం: 1–29, 2–98, 3–126, 4–140, 5–180, 6–250, 7–252.  

బౌలింగ్‌:కాట్రెల్‌ 10–0–50–2, రోచ్‌ 10–0–36–3, థామస్‌ 7–0–63–0, అలెన్‌ 10–0–52–0, హోల్డర్‌ 10–2–33–2, బ్రాత్‌వైట్‌ 3–0–33–0.  

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) జాదవ్‌ (బి) షమీ 6; ఆంబ్రిస్‌ (ఎల్బీ) (బి) పాండ్యా 31; హోప్‌ (బి) షమీ 5; పూరన్‌ (సి) షమీ (బి) కుల్దీప్‌ 28; హెట్‌మైర్‌ (సి) రాహుల్‌ (బి) షమీ 18; హోల్డర్‌ (సి) జాదవ్‌ (బి) చహల్‌ 6; బ్రాత్‌వైట్‌ (సి) ధోని (బి) బుమ్రా 1; అలెన్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 0; రోచ్‌ (నాటౌట్‌) 14; కాట్రెల్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 10; థామస్‌ (సి) రోహిత్‌ (బి) షమీ 6; ఎక్స్‌ట్రాలు 18, మొత్తం (34.2 ఓవర్లలో ఆలౌట్‌) 143.  

వికెట్ల పతనం: 1–10, 2–16, 3–71, 4–80, 5–98, 6–107, 7–107, 8–112, 9–124, 10–143.   

బౌలింగ్‌: షమీ 6.2–0–16–4, బుమ్రా 6–1–9–2, పాండ్యా 5–0–28–1, కుల్దీప్‌ 9–1–35–1, జాదవ్‌ 1–0–4–0, చహల్‌ 7–0–39–2.    

అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్‌లలో కలిపి) వేగవంతంగా 20 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. కోహ్లి ఈ మైలురాయిని 417 ఇన్నింగ్స్‌లో చేరుకున్నాడు. సచిన్, లారా (453 ఇన్నింగ్స్‌ చొప్పున) పేరిట ఉన్న రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.   

గేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement