కోహ్లి, హార్దిక్
ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్‌కు మరో గెలుపును తేలికగా తన ఖాతాలో జమ చేసుకునే అవకాశం. సంచలనాలు సృష్టిస్తుందనుకుంటే... కొంతైనా ప్రతిఘటించ లేకపోతున్న అఫ్గానిస్తాన్‌ను కుమ్మేసి పాయింట్లతో పాటు నెట్ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునే మార్గం. ఇప్పటిదాకా పేస్ బలమున్న ప్రత్యర్థులపై నెగ్గుతూ వచ్చిన కోహ్లి సేన... ఇప్పుడు స్పిన్ ప్రధాన అస్త్రమైన జట్టును ఎదుర్కోనుంది. ఇందులోనూ పైచేయి సాధిస్తే ఓ విధంగా పరిపూర్ణ సన్నాహంతో సెమీస్ రేసులో ముందుకెళ్లే వీలుంటుంది.
సౌతాంప్టన్: వరుసగా గట్టి ప్రత్యర్థుల పని పట్టి గెలుపు ఊపులో ఉన్న టీమిండియాకు... ఆ ఒత్తిడి నుంచి కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం. అఫ్గానిస్తాన్ రూపంలో బలహీన జట్టుతో శనివారం జరుగనున్న మ్యాచ్ ఇందుకు వీలు కల్పిస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఊహించినట్లే ఆడుతూ వస్తున్న కోహ్లి సేనకు... ఈ క్రమంలో పనిలో పనిగా ఒకరిద్దరు ఆటగాళ్లకు తగిన ప్రాక్టీస్ కల్పించేదిగానూ మారనుంది. మరోవైపు అనుకున్నట్లు రాణించలేకపోతున్న అఫ్గానిస్తాన్ పోరాటంతో పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. జోరు మీదున్న భారత్‌ను అడ్డుకోవడం వారికి ఎంతవరకు సాధ్యమో చూడాలి.
ఆ ఒక్క మార్పుతోనే!
భువనేశ్వర్ స్థానంలో మొహమ్మద్ షమీని తీసుకోవడం ఒక్కటే భారత్ తుది జట్టులో చేయనున్న మార్పుగా కనిపిస్తోంది. ఫిట్‌నెస్ జాగ్రత్తల దృష్ట్యా ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌ను ఆడించడం ఇబ్బందికరంగా భావిస్తే దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్‌లలో ఒకరికి స్థానం దక్కొ చ్చు. మిడిలార్డర్‌లో కేదార్ జాదవ్‌కు ఇంతవరకు బ్యాటింగ్ ప్రాక్టీస్ దక్కలేదు. మూడు మ్యాచ్‌ల్లో అతడు కేవలం 8 బంతులే ఎదుర్కొన్నాడు. మున్ముందు అవసరాలరీత్యా జాదవ్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ చేసే వీలుంది. ఓపెనర్ రోహిత్ రెండు సెంచరీలతో ఫామ్‌ను చాటగా, కెప్టెన్ కోహ్లి నుంచి శతకం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇకపై టోర్నీ అంతా పూర్తిస్థాయి ఓపెనర్‌గా బాధ్యత మోయాల్సిన నేపథ్యంలో అందుకు తగినట్లుగా సిద్ధమయ్యేందుకు కేఎల్ రాహుల్‌కు ఈ మ్యాచ్ సరైన వేదిక. బుమ్రా, షమీల పేస్‌ను ఎదుర్కొనడమే సవాలంటే... స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్‌లను కాచుకోవడం అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌కు శక్తికి మించిన పనే. పాక్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ వంటి బౌలర్ అర్ధంతరంగా వైదొలగినా, మన బౌలింగ్ వనరుల లోతును చాటుతూ హార్దిక్, విజయ్ కర్తవ్యాన్ని నెరవేర్చారు. భారీ స్కోరు సాధించి తద్వారా రన్‌రేట్‌ను మెరుగుపర్చుకునే వ్యూహంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపే వీలుంది.
కూన నిలుస్తుందా?
‘పరుగులు కాదు... 50 ఓవర్లు నిలిచి ఆడాలని బ్యాట్స్‌మెన్‌ను కోరుతున్నా.’ ...ఇది అఫ్గాన్ కెప్టె న్ గుల్బదిన్ నైబ్ మాట. హష్మతుల్లా షాహిది అర్ధ సెంచరీ కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఈ కోరిక నెరవేరింది. కానీ, మోర్గాన్ విధ్వంసంతో వారి ఆత్మవిశ్వాసంపై పెద్ద దెబ్బే పడింది. ముఖ్యంగా ఆ చేదు జ్ఞాపకాల నుంచి మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ తేరుకోకుంటే జట్టు ప్రదర్శన మరింత పడిపోవడం ఖాయం. ఇప్పటివరకు అతడిపై పైచేయి సాధించిన వారంతా లెఫ్ట్ హ్యాండర్లే. భారత జట్టులో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ లేకపోవడం రషీద్‌కు కొంత ఊరట. అయితే, అనవసర మార్పులు టీంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో ఉన్న రహ్మత్ షాకు తోడు నూర్ అలీ, కెప్టెన్ నైబ్ పరుగులు చేస్తేనే పోటీ ఇవ్వగలుగుతుంది.
ముఖాముఖి రికార్డు
రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు రెండు వన్డేలే జరిగాయి. అవి కూడా 2014, 2018 ఆసియా కప్‌లలో భాగంగానే కావడం గమనార్హం. వీటిలో భారత్ ఒక మ్యాచ్ నెగగ్గా... మరోటి ‘టై’ అయింది.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలమైనప్పటికీ కొంత భిన్నమైన పిచ్. మైదానం చిన్నది. ఆట పూర్తిగా సాగిన గత ఐదు వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 286 మాత్రమే. మే నెలలో ఇంగ్లండ్–పాకిస్తాన్ మధ్య జరిగిన వన్డేలో మాత్రం ఏకంగా 734 పరుగులు నమోదయ్యాయి. ప్రస్తుత కప్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 213 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 33.1 ఓవర్లలోనే ఛేదించింది. భారత్... దక్షిణాఫ్రికాపై తొలి మ్యాచ్‌ను ఇక్కడే ఆడింది. 228 పరుగుల లక్ష్యాన్ని మన జట్టు 47.3 ఓవర్లలో అందుకుంది. మ్యాచ్‌కు వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రాహుల్, రోహిత్, కోహ్లి (కెప్టెన్), విజయ్ శంకర్/దినేశ్ కార్తీక్/ రిషభ్ పంత్, ధోని, జాదవ్, హార్దిక్, కుల్దీప్, చహల్, షమీ, బుమ్రా.
అఫ్గానిస్తాన్: నూర్ అలీ, గుల్బదిన్ నైబ్ (కెప్టెన్), రహ్మత్ షా, హష్మతుల్లా, అస్గర్, నబీ, రషీద్ ఖాన్, ఇక్రమ్, ఆఫ్తాబ్ ఆలమ్, దౌలత్, ముజీబ్.
ప్రపంచకప్‌లో నేడు
వెస్టిండీస్ X న్యూజిలాండ్
సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–3లో ప్రత్యక్ష ప్రసారం
నబీ, రషీద్, షమీ, బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment