'చాంపియన్స్ ' ప్రైజ్ మనీ భారీగా పెంపు
దుబాయ్: వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీగా పెంచింది. ఈ టోర్నీ ప్రైజ్ మనీని 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.29 కోట్లు)కు పెంచింది. 2013లో జరిగిన టోర్నీతో పోలిస్తే ఇది 5 లక్షల డాలర్లు (రూ.3.20 కోట్లు) ఎక్కువ కావడం విశేషం. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు (రూ.14 కోట్లు) అందనుంది.
రన్నరప్ జట్టుకు 1.1 మిలియన్ డాలర్లు (రూ.7.06 కోట్లు), సెమీఫైనల్స్‌కు చేరిన మిగతా రెండు జట్లకు 4 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2.89 కోట్లు) చొప్పున అందుతాయి. ఇక ప్రతీ గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 90 వేల డాలర్ల (రూ.58 లక్షలు) చొప్పున, ఆఖరి స్థానంలో నిలిచిన జట్టుకు 60 వేల డాలర్ల (రూ.38 లక్షలు) చొప్పున దక్కుతాయి.