champion trophy 2017
-
‘ఆ ఫైనల్ ఫలితాన్ని రిపీట్ చేద్దాం’
మాంచెస్టర్: ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌లో చాంపియన్ ట్రోఫీ ఫలితాన్ని రిపీట్ చేయాలని పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ సూచించాడు. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ ఆదివారం జరగనుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సందర్భంగా వకార్ యూనిస్ మీడియాతో మాట్లాడాడు. పాక్ ఈ మెగా టోర్నీలో ముందుకు వెళ్లాలంటే ఆటగాళ్లు ఏ ప్లస్ ప్రదర్శన చేయాలన్నాడు. ముఖ్యంగా ఆరంభంలో వికెట్లు చేజార్చుకోకూడదని పేర్కొన్నాడు. వికెట్లు చేజార్చుకుంటే భారీ స్కోర్ సాధించలేమని.. ఇక ఛేదనలో అయితే జట్టుపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపాడు. మాలిక్ ఎందుకు? టీమిండియాతో మ్యాచ్‌కు ఐదుగురు స్పెషలిస్టు బౌలర్లతో బరిలోకి దిగాలని వకర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఐదో బౌలర్ ముఖ్యంగా స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ఆ మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు హఫీజ్, మాలిక్‌లు స్పిన్ బౌలింగ్ చేసినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయారన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రాయ్, రూట్ వికెట్లను తీసని షాదాబ్ ఖాన్‌ను టీమిండియాతో జరగబోయే మ్యాచ్‌కు తీసుకోవాలన్నాడు. అవసరమైతే మాలిక్‌ను పక్కకు పెట్టాలన్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమవుతున్న మాలిక్ జట్టులో ఎందుకు అని వకార్ ప్రశ్నించాడు. -
కోహ్లి,యువీ, నేను అందుకే నవ్వుకున్నాం
-
కోహ్లి, నేను అందుకే నవ్వుకున్నాం: పాక్ క్రికెటర్
ఇస్లామాబాద్: చాంపియన్ ట్రోఫీ-2017 ఫైనల్ అనంతరం బహుమతి ప్రధానోత్సవంలో టీమిండియా- పాకిస్తాన్ ఆటగాళ్లు నవ్వులు చిందించుకున్న విషయం తెలిసిందే. అయితే ఘోర ఓటమి అనంతరం ఏ మాత్రం బాధ లేకుండా టీమిండియా ఆటగాళ్లు నవ్వుకోవడం పట్ల అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఆ నవ్వుల వెనకాల గల కారణాలను పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షోయాబ్ మాలిక్ వివరించాడు. తాజాగా స్థానిక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఆనాటి విషయాలను నెమరువేసుకున్నాడు. ఓ మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన క్యాచ్‌ను స్పిన్నర్ సయీద్ ఆజ్మల్, మాలిక్‌లు ఫన్నీగా డ్రాప్ చేశారు. చాంపియన్ ట్రోఫిలో విండీస్‌తో మ్యాచ్ సందర్భంగా క్రిస్ గేల్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అందుకునేందుకు అజ్మల్, మాలిక్‌లు ప్రయత్నించారు. అయితే మాలిక్ అందుకుంటాడని ఆజ్మల్, ఆజ్మల్ అందుకుంటాడని మాలిక్‌లు చివరి క్షణంలో క్యాచ్‌ను వదిలేశారు. అయితే క్యాచ్ డ్రాప్ అనంతరం ఆజ్మల్తో మాలిక్.. ‘నువ్వు నీ స్థానంలో ఉంటే క్యాచ్‌ను సులభంగా అందుకునే వాడివి కదా.. ఎందుకు పొజీషన్ ఛేంజ్ అయ్యావు?. అప్పుడు ఆజ్మల్ సమాధానమిస్తూ నువ్వు క్యాచ్ మిస్ చేస్తే బంతి నేలపై పడకుండా త్వరగా అందుకుందామని అనుకున్నాను’ అంటూ ఆజ్మల్ ఫన్నీగా సమాధానమిచ్చాడని మాలిక్ వివరించాడు. ఇదే విషయాన్ని టీమిండియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలకు చెబితే తెగ నవ్వారని ఆనాటి సంఘటనను వివరించాడు. అయితే పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్ ట్రోఫీ పైనల్లో టీమిండియా 180 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది
ఛాంపియన్ ట్రోఫిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు బ్యాట్‌తో మెరిశారు. ధావన్ 125 పరుగులు, 128 బంతుల్లో చేశాడు. 322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్ డిక్వెల్(7) వికెట్‌ను కోల్పోయింది. కుశాల్ మెండీస్(89), గుణతిలకలు(76)లు నిలకడగా ఆడి విజయంవైపు అడుగులు పడేలా చేశారు. టీమ్ ఇండియాకు బలం అనుకున్న బౌలింగ్ విఫలం చెందడంతోతో మ్యాచ్ చేయి జారిపోయింది. ఏడు వికెట్ల తేడాతో లంకేయులు ఇండియాపై విజయం సాధించారు. -
చాంపియన్స్ ట్రోఫికి జో ‘రూట్‘
లండన్: చాంపియన్ ట్రోఫిలో భాగంగా బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్ మోన్ జోరూట్ సెంచరీ సాధించి టోర్నిలో ఇంగ్లండ్ విజయాలకు రూట్ వేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హెల్స్లు అర్ధ సెంచరీలు సాధించడంతో బంగ్లాపై సునాయసంగా విజయం సాధించింది. 306 పరుగుల లక్ష్య చేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్(1) నిరాశపర్చగా మరో ఓపెనర్ అలెక్స్ హెల్స్, జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. సెంచరి మిస్ చేసుకున్న అలెక్స్(86 బంతుల్లో11 ఫోర్లు, 2 సిక్సర్లతో 95) పరుగులు చేసి షబ్బీర్ రెహ్మాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో ఇంగ్లండ్ విజయం సులువైంది. జోరూట్ 115 బంతుల్లో శతకం సాధించగా, మోర్గాన్ 45 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం రెచ్చిపోయి ఆడిన వీరిద్దరూ 47.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించారు. జోరూట్ 133(129 బంతులు 11 ఫోర్లు, ఒక సిక్స్), మోర్గాన్ 75(61 బంతులు, 8 ఫోర్లు, 2 సిక్సులు) అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(128;142 బంతుల్లో 12 ఫోర్లు 3 సిక్సర్లు), ముష్ఫికర్ రహీమ్(79;72 బంతుల్లో 8 ఫోర్లు) లు బాధ్యాతయుతంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరును ఇంగ్లండ్ ముందుంచారు. -
ధోనీ గురించి అలా వాగలేదు: భజ్జీ
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేశారా, లేక గొప్ప ఆటగాడని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారా, నిన్ను ఎందుకు ఎంపిక చేయలేదు అన్న ఇంటర్వ్యూ ప్రశ్నకు హర్భజన్ సింగ్ ఇచ్చిన సమాధానంతోనే అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై భజ్జీ సీరియస్‌గా స్పందించాడు. 'ధోనీ టీమిండియాకు ఎంతో చేశాడు. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగానూ అద్బుతాలు చేసి చూపించాడు. భారత్‌కు ప్రపంచకప్‌లు అందించాడు. అతడికి ఫామ్‌తో సంబంధంలేదు. తనను ఎందుకు ఎంపిక చేయలేదో.. భారత క్రికెట్ సెలక్టర్లు దీనికి సమాధానం ఇవ్వగలరని' ఓ వీడియోను హర్భజన్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. 'ధోనీ నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గొప్ప ఆటగాడు కూడా. చాంపియన్స్ ట్రోఫీకి ధోనీ ఎంపికపై నేనెప్పుడూ ప్రశ్నించలేదు. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు. వాస్తవానికి ధోనీ విషయాన్ని ప్రస్తావించాను కానీ, అతడిని ఎందుకు జట్టులోకి తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేయలేదు. 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగస్వామిని. ధోనీ విషయంలో ఆలోచించినట్లే, సెలక్టర్లు తనను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉండే బాగుండేది. నా విషయంలో కాస్త ఉదాసీనతగా వ్యహరించారని' మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించాడు. తప్పుడు కథనాలతో తనపై దుష్ప్రచారం చేసి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని, దయచేసి ఈ వివాదానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ట్వీట్లలో విజ్ఞప్తి చేశాడు. 2/3 MSD is a dear friend &a great player, I never doubted his selection so please don't quote me on things which I never said against him — Harbhajan Turbanator (@harbhajan_singh) 26 May 2017 -
ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో ప్రదర్శనను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. జూన్ లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కంగుతినడం ప్రత్యర్ధి జట్ల వంతు అవుతుందన్నాడు. అలా చేస్తే ఎవరి గోతిని వారే తీసుకున్నట్లేనని హితవు పలికాడు. 'కోహ్లీ ఎప్పటికీ కళాత్మక ఆటగాడు. ఐపీఎల్ లో అతడు విఫలమైన మాట వాస్తవమే. కానీ అది ఆ టోర్నీకి మాత్రమే పరిమితమని గుర్తుంచుకోవాలి. కోహ్లీ లాంటి బ్యాట్స్ మెన్ ను ఎక్కువ రోజులు కట్టడి చేయడం ఏ బౌలర్ కు సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ వైఫల్యంతో ఉన్న కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో అద్బుతాలు సృష్టిస్తాడు. కానీ ఇంగ్లండ్ లో ఆడాలంటే నిలకడ కొనసాగించాలి. అప్పుడే పరుగులు రాబట్టడం సులువు. ఐపీఎల్ లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఫామ్ కొనసాగించడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడతాయని' వెటరన్ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు. -
గెలిచే అవకాశాలు మాకే ఎక్కువ: స్టీవ్ స్మిత్
ఇంగ్లండ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫిని గెలిచే అవకాశాలు తమకే ఉన్నాయని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఐపీఎల్‌తో గత రెండు నెలలుగా భారత్‌లో ఉండటం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ టోర్నమెంట్‌ను అస్వాదించామని స్మిత్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్‌కు అనువైన ప్రదేశమని, ఇక్కడ ఆటగాళ్ల సత్తా బయటకు వస్తుందని చెప్పాడు. గత కొద్ది రోజులుగా మేము తీరిక లేకుండా గడిపామని అయినా శారీరకంగా, మానసికంగా దృడంగా ఉన్నామని పేర్కొన్నాడు. రెండు సంత్సరాలకోసారి జరిగే ఈ ట్రోఫి మాకు చాల ముఖ్యమైనదని, మా విజయాలకు కొంత బ్రేక్ వచ్చినా.. ఇప్పుడు టైటిల్ లక్ష్యంగా ఆడుతామని స్మిత్ చెప్పుకొచ్చాడు. ప్రతి సీజన్ లో ఆస్ట్రేలియా గట్టి పోటినిచ్చిందని గుర్తు చేశాడు. చాంపియన్స్ ట్రోఫిలో మాకు మంచి రికార్డు ఉంది. దీన్ని ఇలానే కోనగిస్తామని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గెలుపే మాకు కావలి దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేస్తారని దాని పైనే మా దృష్టంతా ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఈ సీరిస్‌కు ముందు భారత్‌తో టెస్టు సిరీస్, ఐపీఎల్ మినహా వన్డేలు ఆడలేదని, ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ చివరిదన్నాడు. ఈ సిరీస్ లో 2-0 ఓడిపోయిన దీని ప్రభావం మా పై ఉండదని, చాంపియన్స్ ట్రోఫికి ముందే జరిగే వార్మప్ మ్యాచ్‌లను ఉపయోగించుకుంటామన్నాడు. ఆస్ట్రేలియాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, ఇక్కడ ఇంతకు ముందు రాణించిన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని, కచ్చితంగా టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నిలో పాల్గొనె జట్లు అన్ని బలంగా ఉన్నాయని, మంచి క్రికెట్ జరుగుతుందని అభిప్రాయపడ్డాడు. -
సచిన్‌తో కలిసి ‘సచిన్’ను...
-
ప్రపంచకప్ కంటే కఠినం!
♦ కోలుకునే అవకాశం ఉండదు ♦ చాంపియన్స్ ట్రోఫీపై కోహ్లి ♦ టైటిల్ నిలబెట్టుకుంటామన్న కెప్టెన్ ♦ ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు నాలుగేళ్ల క్రితం యువ భారత్ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో అజేయ ఆటతీరుతో విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లోనూ కనీస పోటీ కూడా ఎదుర్కోకుండా ఐదుగురు ప్రత్యర్థులను అలవోకగా ఓడించి టోర్నీలో తమ సత్తా చాటింది. ఇప్పుడు ఆ ఐసీసీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు మరో సారథి నేతృత్వంలో టీమిండియా సన్నద్ధమైంది. నాటి జట్టులోని సభ్యుల్లో ఎక్కువ మంది ఈసారి కూడా భాగం కాగా... అదే ప్రదర్శనను పునరావృతం చేసే లక్ష్యంతో మళ్లీ ఇంగ్లండ్‌కు భారత్ బయల్దేరింది. ముంబై: వన్డే వరల్డ్ కప్‌తో పోలిస్తే చాంపియన్స్ ట్రోఫీలోనే పోటీ తీవ్రంగా ఉంటుందని భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. డిఫెండింగ్ చాంపియన్ అనే ముద్రతో ఒత్తిడి పెంచుకోకుండా ఆడి విజయం సాధిస్తామని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీ కోసం భారత బృందం బుధవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో జట్టు విజయావకాశాలపై కోహ్లి మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే... చాంపియన్స్ ట్రోఫీలో పోటీపై... ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్‌కప్ కంటే కూడా ఇది కఠినం. ఎందుకంటే అక్కడ పొరపాటున వెనుకబడ్డా లీగ్ దశలో కోలుకునేందుకు మళ్లీ అవకాశం ఉంటుంది. కానీ ఈ టోర్నీలో స్వల్ప వ్యవధిలో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు తలపడతాయి. తొలి మ్యాచ్ నుంచి అత్యుత్తమ ఆటతీరు చూపించాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా ముందుకెళ్లడం కష్టం. డిఫెండింగ్ చాంపియన్ కావడంపై... మేం టైటిల్‌ను నిలబెట్టుకోవడం కోసం వెళుతున్నాం అనే ఆలోచననే ముందుగా తొలగించాల్సి ఉంది. 2013లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాం కాబట్టి అంత మంచి విజయం దక్కింది. కొత్త ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, రోహిత్ శర్మ అద్భుతంగా రాణించడం, రవీంద్ర జడేజా, అశ్విన్‌ల బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్ గత టోర్నీలో మమ్మల్ని చాంపియన్‌గా నిలబెట్టాయి. జట్టులో ఇప్పుడు కొందరు మారినా మా ఆలోచనా విధానంలో మార్పు లేదు. టెస్టుల్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాం. సిరీస్ గెలిచాక కూడా అలసత్వం ప్రదర్శించలేదు. ఇప్పుడు అదే దూకుడును వన్డేలకు వర్తింపజేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ధోని, యువరాజ్‌లపై... వాళ్లిద్దరూ జట్టుకు మూలస్థంభాల్లాంటివారు. ధోని, యువీల అనుభవాన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోగలను. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి, మ్యాచ్ ఎలా గెలవాలి, కష్టాల్లో జట్టును ఎలా ఆదుకోవాలో వారికి బాగా తెలుసు. మిడిలార్డర్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ వారు స్వేచ్ఛగా ఆడగలరు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అది కనిపించింది. వారి ఆలోచనా ధోరణి జట్టుకు మేలు చేస్తుంది. టోర్నీకి సన్నాహకంగా ఐపీఎల్... ఈ రెండు ఫార్మాట్లు పూర్తిగా వేరు. వన్డే, టి20 మధ్య పోలిక అనవసరం. అయితే ఏదో రూపంలో మైదానంలో ఆడుతున్న అనుభవం మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండేందుకు మాత్రం పనికొస్తుంది. ఐపీఎల్లో కూడా పోటీ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కొంటాం కాబట్టి బాగా ఆడితే ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. నా వరకు తాజా ఐపీఎల్ ఎన్నో పాఠాలు నేర్పించింది. ప్రతీ మ్యాచ్‌లో మనం అనుకున్నవన్నీ చేయలేమని, మానవమాత్రులకు కొన్ని పరిమితులు ఉంటాయని అర్థమైంది. కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది కూడా. వైఫల్యాల వల్ల కెప్టెన్ చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై... బంతిని ఎదుర్కొనేటప్పుడు ఎదుట ఉన్న నాన్‌స్ట్రైకర్ గురించే ఆలోచన రాదు. అలాంటప్పుడు మన అదుపులో లేని, మైదానం బయట జరిగే విషయాల గురించి ఏమని ఆలోచించగలం. క్రికెటర్లుగా మాకు ఇష్టమైన ఆట ఆడటమే మా పని. భారత్, పాక్ మ్యాచ్‌పై అంచనాలు, ఉత్కంఠ ఎప్పుడూ ఉండేవే. అభిమానులకు అది చాలా కీలకమైనది కావచ్చు. కానీ మా దృష్టిలో అన్ని మ్యాచ్‌లలాంటిదే. మేమేమీ మొదటిసారి తలపడటం లేదు. ప్రత్యర్థి విషయంలో మా ఆలోచనలు, సన్నాహాల విషయంలో తేడా ఉండదు. అది ఏ జట్టయినా ఒకటే. ప్రత్యేకంగా ఈ మ్యాచ్ కోసం స్ఫూర్తి పొందాల్సిన అవసరం కూడా లేదు. గెలవాలనే తపన ఉంటే సరిపోతుంది తప్ప మరీ ఉద్వేగపడిపోకూడదు. వైఫల్యాన్ని జీవన్మరణ సమస్యగా ఎందుకు చూస్తారు? విరాట్ కోహ్లి అద్భుత కెరీర్లో 2014 ఇంగ్లండ్ పర్యటన ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ టూర్ మొత్తం అతను ఘోరమైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత కోహ్లి ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌కు వెళుతున్నాడు. నాటి గాయాలు మానే విధంగా లెక్క సరి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు విరాట్ ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు కానీ చుట్టూ ఉన్న వాతావరణం మా ప్రదర్శనను జీవన్మరణ సమస్యగా మార్చేస్తుంది. ముఖ్యంగా ఉపఖండపు క్రికెటర్లకు ఈ పరిస్థితి ఎదురవుతుంది. నేను భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ అదే విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ విషయం నాకు అస్సలు అర్థం కాదు. నాకు సంబంధించి నేను ఏదో సాధించి చూపాలనేదాన్ని నమ్మను. ప్రపంచంలో ఏ మూలన ఆడినా భారత జట్టును గెలిపించడమే ఏకైక లక్ష్యం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. -
పాక్ ఆధిపత్యానికి కోహ్లీ చెక్ పెడతాడా!
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి మొదలు కానున్న చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ బరిలోకి దిగుతుంది. ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ లలో దాయాది పాకిస్తాన్ పై ప్రతిసారి భారత్ విజయదుందుబి మోగించినా.. ఈ ట్రోఫీలో మాత్రం వారిదే పైచేయి.ఇప్పటివరకూ మూడుసార్లు భారత్-పాక్ తలపడగా రెండు మ్యాచ్ లు పాక్ నెగ్గగా, చివరగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు తొలి విజయం సాధించింది. ఇప్పటివరకూ వన్డే ప్రపంచ కప్ లలో 6-0తో, ట్వంటీ 20 వరల్డ్ కప్ లో 5-0తో పాక్ పై భారత్ తమ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ట్రోఫీలో మాత్రం 2-1తో పాక్ కు మెరుగైన రికార్డు ఉంది. అందులోనూ ఈసారి కోహ్లీ సేన తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ తో తలపడనుంది. జూన్ 4న జరిగే మ్యాచ్ లో పాక్ పై నెగ్గి ధోనీ బాటలోనే కోహ్లీ భారత్ కు విజయాన్ని అందిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది. 2004లో తొలి ఓటమి నాలుగు గ్రూప్‌ల ఫార్మాట్ లో కెన్యాపై గెలిచినా, పాకిస్తాన్ చేతిలో ఓడటంతో భారత్ సెమీస్ చేరలేకపోయింది. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం రాహుల్ ద్రావిడ్(67) ఒక్కడే రాణించడంతో 50 ఓవర్లలో 200 పరుగులు చేసింది. షోయబ్ అక్తర్, నవీద్ ఉల్ హసన్ చెరో 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీయగా, బ్యాటింగ్ లో మహ్మద్ యూసఫ్ చెలరేగడంతో పాక్ 3 వికెట్ల తేడాతో ఐసీసీ నిర్వహించే ఓ టోర్నీలో భారత్ పై నెగ్గింది. 2009లోనూ అదే ఫలితం 2008లోనే పాకిస్తాన్లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదికను దక్షిణాఫ్రికాకు మార్చినా అదే ఫలితం ఎదురైంది. పాకిస్తాన్ చేతిలో ఓడటం, ఆపై వర్షంతో ఆసీస్ మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. షోయబ్ మాలిక్ సెంచరీ(128), మహ్మద్ యూసఫ్ హాఫ్ సెంచరీ (87)లతో భారత బౌలర్లపై పైచేయి సాధించడంతో పాక్ 302 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ లోనూ రాహుల్ ద్రావిడ్ హాఫ్ సెంచరీ (76) రాణించాడు. పాక్ ఆధిపత్యానికి ధోనీ సేన చెక్ ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో మూడో ప్రయత్నంలో పాక్ పై నెగ్గింది. గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్లను జట్టు వరుసగా ఓడించింది. పాక్ పై తొలిసారి మ్యాచ్ ఓడిన ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో 165 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19.1 ఓవర్లలో 102 పరుగులు చేసిన భారత్ మరో 17 బంతులుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20–20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌పై 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది. 2017- ఇప్పుడు ఏం జరగనుందో..! దాయాదులు భారత్-పాక్ లు నాలుగో పర్యాయం ఈ ట్రోఫీలో తలపడనున్నాయి. 1-2తో పాకిస్తాన్ పై ఉన్న గెలుపోటముల రికార్డును మెరుగు పరుచుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ట్రోఫీలో పాల్గొనేందుకు నేడు టీమిండియా, ఇంగ్లండ్ కు పయనం కానుంది. జూన్ 4న భారత్ తమ తొలి మ్యాచ్ లోనే పాక్ ను తలపడనున్నందున ఈ మ్యాచ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాం: కోహ్లీ
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తన నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు నేడు (బుధవారం) ఇంగ్లండ్‌కు పయనం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు పటిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించడం కలిసొచ్చే అంశం. ట్రోఫీలో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు మాతో ఉండటం జట్టుకు అదనపు బలం. వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉన్న జట్లు ట్రోఫీలో ఆడుతాయి. గ్రూప్ లో అగ్రస్థానంలో ఉంటేనే టోర్నీలో నిలుస్తాం. జూన్ 4న పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. గత టోర్నీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అశ్విన్, జడేజా బాగా ఆడారు' అని కోహ్లీ ప్రశంసించాడు. ఈ టోర్నీని తేలికగా తీసుకునే ఉద్దేశమే లేదని, తమ విజయాలను పాకిస్తాన్ తోనే మొదలుపెడతామని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతుంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో 2013లో ఇంగ్లండ్ లోనే జరిగిన ట్రోఫీలో ఇంగ్లండ్ పైనే 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది. -
ఇండియాపై నా సత్తా చూపిస్తా: పాక్ క్రికెటర్
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీలో బద్ధ విరోధి భారత్‌పై తన సత్తా ఏంటో చాటేందుకు సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ క్రికెటర్ హారిస్ సోహైల్ తెలిపాడు. ఉమర్ అక్మల్ ఫిట్నెస్ టెస్టులో ఫెయిలవ్వడంతో అతని స్థానంలో పాకిస్థాన్ జట్టులోకి సోహైల్ వచ్చాడు. అన్‌ఫిట్ అని తేలడంతో అక్మల్‌ను ఇంగ్లండ్ నుంచి అర్ధంతరంగా వెనుకకు పిలిపించిన సంగతి తెలిసిందే. అనంతరం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టుల్లో అతను ఫెయిలవ్వడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీ సన్నాహాల్లో భాగంగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పాక్ జట్టు ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. 2015 మేలో జింబాబ్వే పర్యటనలో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 28 ఏళ్ల సోహైల్ తిరిగి జాతీయ జట్టులోకి అడుగుపెట్టడంతో సంతోషం వ్యక్తం చేశాడు. ‘జట్టు విజయం కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను. ప్రతి ఆటగాడు కూడా భారత్‌పై బాగా ఆడాలని కోరుకుంటాడు. భారత్‌తో మ్యాచ్‌లో నాకు ఆడేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా నా ఉత్తమ ఆటతీరు చూపేందుకు ప్రయత్నిస్తా’ అని సోహైల్ ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రికతో చెప్పాడు. చాంపీయన్స్ ట్రోఫీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జూన్ 4న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్ తలపడుతుండటంతో ఇప్పుడు ఇరుదేశాల్లోని క్రికెట్ ప్రేమికుల దృష్టి మ్యాచ్‌పైనే నెలకొని ఉంది. -
భారత జట్టు బలం వారే!
హైదరాబాద్: డిఫెండింగ్ చాంపియన్స్‌గా మినీ వరల్డ్ కప్ ( ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి) బరిలోకి దిగుతున్న భారత జట్టుకు కెప్టెన్ కోహ్లీ, పటిష్టమైన పేస్ విభాగం, ఫామ్ లో ఉన్న ఆల్ రౌండర్లు బలం కానున్నారు. ఇప్పటికే వన్డే లో మూడో ర్యాంకులో ఉన్న భారత జట్టు ఇంగ్లండ్ వేదికగా దిగ్గజ జట్లతో పోటి పడనుంది. తొలి మ్యాచ్ దాయదీ దేశమైన పాకిస్థాన్ తో వేల్స్ మైదానంలో ఆడనుంది. ఇక జట్టు బలాలు, బలహీనతలు పరిశీలిస్తే.. కోహ్లీ కెప్టెన్సీ జట్టుకు బలం చేకూరనుంది. కోహ్లీ నాయకత్వంలో భారత్ 20 మ్యాచ్‌లు ఆడగా 16 నెగ్గింది. కోహ్లీ మరోసారి రెచ్చిపోయి ఆడితే జట్టు సులువుగా భారీ స్కోర్లు చేయగలదు. ఇక ఇంగ్లండ్ గడ్డపై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. ఇక్కడ 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ ఒక సెంచరీతో 424 పరుగులు చేశాడు. ఈ అనుభవం జట్టుకు కలిసిరానుంది. ఇక ఐపీఎల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ చాంపియన్స్ ట్రోఫిలో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఇక గత సీజన్ లో భారత్‌కు టైటిల్ అందించిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సలహాలు కూడా జట్టుకు లాభం చేకూర్చునున్నాయి. ఇక ఐపీఎల్ లో మైమరిపించిన ధోని కీపింగ్ కూడా జట్టుకు కలిసొచ్చే అంశమే. పటిష్టమైన ఫేస్ విభాగం ఛాంపియన్స్ ట్రోఫికి ఎంపికైన పేస్ బౌలర్లందరూ ఐపీఎల్ అసాధారణ ప్రతిభ కనబర్చిన వారు కావడం జట్టు కలిసొచ్చే అంశం. భువనేశ్వర్ కుమార్ (26) వికెట్లతో టాప్ లో నిలవగా, జస్ప్రిత్ బూమ్రా (20), ఉమేశ్ యాదవ్ (17) లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా బుమ్రా రాణించడం జట్టుకు అదనపు బలం. అదనపు బలంగా ఆల్ రౌండర్లు జట్టుకు ఎంపికైన ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యాలు ఫామ్ కూడా జట్టుకు అదనపు బలంగా చెప్పవచ్చు. ఇక రవీంద్ర జడేజా ఆసీస్ టెస్టు సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ లోనే జరిగిన గత చాంపియన్స్ ట్రోఫిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన జడ్డూ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోశించాడు. ఇక యువ ఆల్ రౌండర్ పాండ్యా ఐపీఎల్లో తన సత్తా చాటాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని దూకుడు అందరిని ఆకట్టుకుంది. బలహీనతలు ఆల్ రౌండర్ అశ్విన్, పేసర్ మహ్మద్ షమీ ఫిట్‌నెస్‌ల పై అనుమానాలు నెలకొన్నాయి. గాయంతో ఈ సీజన్ ఐపీఎల్ మొత్తానికి దూరమైన అశ్విన్ ధర్మశాల టెస్టు అనంతరం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ లో పాల్గొనకపోవడం భారత్‌ను కొంత కలవరపెడ్తుంది. ఇక షమీ ఐపీఎల్ లో రాణించకపోవడం కూడా జట్టుకు ఇబ్బందిగా మారింది. ఢిల్లీ తరుపున 8 మ్యాచ్‌లు ఆడిన షమీ కేవలం 5 వికెట్ల తీసి పరుగులు బాగా ఇచ్చాడు. మన దిగ్గజ బ్యాట్స్‌మెన్ నిలకడలేని ఫామ్ కూడా జట్టుకు కలవరపెట్టె విషయమే. ఐపీఎల్లో భారత్ బ్యాట్స్ మెన్ ఏ ఒక్కరు టాప్‌లో నిలవలేకపోయారు. -
చాంపియన్స్ ట్రోఫీ భద్రతపై పునస్సమీక్ష
మాంచెస్టర్‌లో పేలుడు అనంతరం ఐసీసీ దుబాయ్: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ, మహిళల ప్రపంచకప్ భద్రతా ఏర్పాట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి సమీక్ష చేయనుంది. మాంచెస్టర్‌లో సోమవారం జరిగిన పేలుడులో 22 మంది మరణించారు. దీంతో ఐసీసీ కూడా అలర్ట్ అయ్యింది. అయితే మ్యాచ్‌లు జరిగే వేదికల్లో మాంచెస్టర్ లేకపోయినప్పటికీ ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదని నిర్ణయించుకుంది. ‘మా టోర్నమెంట్ భద్రతా డైరెక్టరేట్ సలహా ప్రకారం ఈ రెండు టోర్నమెంట్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అధికారులతో కలిసి రక్షణ ఏర్పాట్లపై సమీక్షిస్తాం. మాంచెస్టర్ దాడుల్లో మృతి చెందిన వారికి సానుభూతి తెలుపుతున్నాం’ అని ఐసీసీ పేర్కొంది. జూన్ 1 నుంచి 18 వరకు చాంపియన్స్ ట్రోఫీ... జూన్ 24 నుంచి జూలై 23 వరకు మహిళల ప్రపంచకప్ ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి. -
మనీశ్ పాండే స్థానంలో దినేశ్ కార్తీక్
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో ఒక మార్పు జరిగింది. ఐపీఎల్లో గాయపడిన మనీశ్ పాండే స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. భారత్ తరఫున కార్తీక్ ఆఖరిసారిగా 2014 మార్చిలో వన్డే ఆడాడు. 2016–17 సీజన్లో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కార్తీక్ 9 మ్యాచ్‌లలో 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సహా 607 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచి తమిళనాడు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే కారణంగా అతనికి వన్డేల్లో మళ్లీ చోటు దక్కింది. -
'చాంపియన్స్ ' ప్రైజ్ మనీ భారీగా పెంపు
దుబాయ్: వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీగా పెంచింది. ఈ టోర్నీ ప్రైజ్ మనీని 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.29 కోట్లు)కు పెంచింది. 2013లో జరిగిన టోర్నీతో పోలిస్తే ఇది 5 లక్షల డాలర్లు (రూ.3.20 కోట్లు) ఎక్కువ కావడం విశేషం. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు (రూ.14 కోట్లు) అందనుంది. రన్నరప్ జట్టుకు 1.1 మిలియన్ డాలర్లు (రూ.7.06 కోట్లు), సెమీఫైనల్స్‌కు చేరిన మిగతా రెండు జట్లకు 4 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2.89 కోట్లు) చొప్పున అందుతాయి. ఇక ప్రతీ గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 90 వేల డాలర్ల (రూ.58 లక్షలు) చొప్పున, ఆఖరి స్థానంలో నిలిచిన జట్టుకు 60 వేల డాలర్ల (రూ.38 లక్షలు) చొప్పున దక్కుతాయి. -
‘చాంపియన్స్’ తర్వాతే కుంబ్లేపై నిర్ణయం
న్యూఢిల్లీ: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే సహా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోచ్‌గా కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్ వచ్చే జూన్‌తో ముగుస్తుంది. ‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్‌గా కుంబ్లేకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం. అయినా ఈ విషయంలో సీఓఏ అనుమతి కూడా తప్పనిసరి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత కోచ్‌గా గత ఏడాది కాలంలో కుంబ్లే అద్భుత ఫలితాలు సాధించారు. మరోవైపు సెలక్షన్ కమిటీలో ముగ్గురే సభ్యులు ఉండటం పట్ల వస్తున్న సమస్యలను కొన్ని రాష్ట్ర సంఘాలు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
చాంపియన్స్‌ట్రోఫీలో సత్తాచాటుతా: యువరాజ్
దుబాయ్: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్.. కప్పును తిరిగి దక్కించుకోవడంలో అర్ధవంతమైన పాత్రను పోషించగలనని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తిరిగి వన్డే జట్టులోకి తాను ఎంపికవడం ఆనందం కలిగించిందని పేర్కొన్న యువీ.. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. టోర్నీలో ఆడే ప్రతీజట్టు చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుందని వ్యాఖ్యానించాడు. తాము ఉన్న గ్రూప్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉందని, అయితే వరుసగా రెండోసారి టోర్నీ నెగ్గేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. గతంలో ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను సాధించింది. అలాగే టోర్నీ వేదికైన బ్రిటన్ తమకు సొంతగడ్డలాంటిదని తెలిపాడు. చాలామంది అభిమానుల మద్దతు లభిస్తుందని పేర్కొన్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో యూవీ ఆడతుండడం విశేషం. కెన్యా (2002)లో జరిగిన టోర్నీలో అరంగేట్రం చేసిన యువీ.. 2006 వరకు వరుసగా ఈ టోర్నీల్లో పాల్గొన్నాడు. అయితే 2009, 2013 టోర్నీల్లో యూవీ ఈ టోర్నీలో చోటు దక్కలేదు. -
జట్టులోకి రోహిత్, షమీ
చాంపియన్స్‌ట్రోఫీకి టీమిండియా జట్టు ప్రకటన న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత వన్డే జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లి నేతృత్వంలోని 15 మంది ఆటగాళ్ల బృం దాన్ని సోమవారం జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జూన్ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు పాల్గొంటుండగా డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత జట్టు బరిలోకి దిగబోతోంది. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడిన జట్టునే దాదాపుగా ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ ప్యానెల్ ఎంపిక చేసింది. ఆ సిరీస్‌లో ఆడని రోహిత్ శర్మ, పేసర్ మొహమ్మద్ షమీ గాయాల నుంచి కోలుకోవడంతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియాలో 2015లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్ అనంతరం షమీ ఇప్పటిదాకా వన్డేల్లో ఆడలేదు. గతేడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో రోహిత్ గాయం కారణంగా తప్పుకున్నాడు. నలుగురు పేసర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు జట్టులో ఉండేలా చూశారు. భారత జట్టు తొలి మ్యాచ్‌ను 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడనుంది. ‘కుల్దీప్ గురించి చర్చించాం’ మనీష్ పాండేను అదనపు బ్యాట్స్‌మన్‌గా తీసుకోవడంతో పాటు కుల్దీప్ యాదవ్‌పై సెలక్షన్ కమిటీ లో తీవ్రంగా చర్చ జరిగిందని ఎమ్మెస్కే తెలిపారు. ‘కుల్దీప్ జట్టులో ఉంటే కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు. అయితే యువరాజ్, కేదార్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలరు. అందుకే అతడిని స్టాండ్‌బైగా ఉంచాల్సి వచ్చింది. ఇక దేశవాళీ పరంగా ఐపీఎల్ అద్భుత టోర్నీ అయినా వన్డే జట్టులో ఎంపికకు అందులోని ప్రతిభను పరిగణలోకి తీసుకోలేము. ఇంగ్లండ్ వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని గత ఏడాది కాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాం. గత నాలుగు నెలల నుంచి టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. అందుకే ఒకటి, రెండు స్థానాల్లో మార్పు తప్ప అదే జట్టును ప్రకటించాం’ అని ప్రసాద్ వివరించారు. చర్చకు రాని గంభీర్ పేరు ఐపీఎల్లో ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన చేస్తున్న గౌతం గంభీర్‌ను చాంపియన్స్ ట్రోఫీలో తీసుకుంటారని ఆశించినా సెలక్టర్లు పట్టించుకోలేదు. అతడి పేరు కనీసం చర్చకు కూడా రాలేకపోయింది. సీనియర్ ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు కూడా నిరాశే ఎదురైంది. గంభీర్ గురించి అడిగిన ప్రశ్నకు ‘రోహిత్, ధావన్ ఓపెనర్లుగా.. రహానే బ్యాకప్ ఓపెనర్‌గా ఉంటారు’ అని ప్రసాద్ తేల్చి చెప్పారు. అయితే గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన స్పిన్నర్ అశ్విన్ పేరును ఎందుకు పరిగణలోకి తీసుకున్నారని ప్రశ్నించగా.. అతడి గాయంపై ఎలాంటి ఆందోళన లేదని, అతడికి విశ్రాంతి ఇవ్వాలన్న తమ కోరిను పుణే జట్టు గౌరవించిందని గుర్తుచేశారు. జడేజాకు కూడా కావాలనే బ్రేక్ ఇచ్చామని అన్నారు. గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేశ్ రైనా మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ అతడిని స్టాండ్‌బైగా ఉంచారు. తనతో పాటు యువ ఆటగాడు రిషబ్ పంత్, శార్ధుల్ ఠాకూర్, దినేశ్ కార్తీక్, కుల్దీప్ కూడా ఉన్నారు. వీరందరికి కూడా వీసాలు ఇస్తామని, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తారని ఎమ్మెస్కే తెలిపారు. ధోనియే అత్యుత్తమం భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని క్రికెట్ భవిష్యత్‌పై ఊహాగానాలను సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టివేశారు. ప్రపంచ క్రికెట్లో తనే అత్యుత్తమ వికెట్‌కీపర్ అని కొనియాడారు. యువ కీపర్ రిషబ్ పంత్‌ను భవిష్యత్ తారగా పేర్కొన్నారు. ధోని ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్ ఆందోళనే తప్ప కీపర్‌గా తనెప్పుడూ పొరపాట్లు చేయలేదని గుర్తుచేశారు. అతడి అపార అనుభవం కోహ్లికి ఉపయోగపడుతుందని అన్నారు. జట్టు: కోహ్లి (కెప్టెన్), రహానే, ధావన్, ధోని, రోహిత్, యువరాజ్, హార్దిక్ పాండ్య, కేదార్ జాదవ్, అశ్విన్, జడేజా, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, మనీష్ పాండే, బుమ్రా, షమీ. స్టాండ్‌బై: కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, శార్దుల్ ఠాకూర్, రైనా. -
చాంపియన్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 15మంది సభ్యులతో జట్టును సోమవారం ఖరారు చేసింది. వైస్ కెప్టెన్‌గా రహానే, సెకండ్ కీపర్‌గా కేదార్ జాదవ్, ధోని, హార్థిక్ పాండే, అశ్విన్, మహ్మద్ షమి, యువరాజ్ సింగ్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్‌లకు చోటు దక్కింది. అలాగే గాయాల నుంచి కోలుకున్న రోహిత్, షమీకి స్థానం దక్కగా హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌కు నిరాశే ఎదురైంది. వారికి జట్టులో స్థానం దక్కలేదు. ఇక రిజర్వ్ ఆటగాళ్లుగా రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, సురైనా రైనా కొనసాగనున్నారు.. కాగా వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో చాంపియన్స్ ట్రోఫీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బగిలోకి దిగనుంది. -
ఊపిరి పీల్చుకోండి... చాంపియన్ వస్తోంది
నేడు జట్టు ప్రకటన దాల్మియా మోడల్‌పై చర్చ న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనబోతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)ఈ మేరకు నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో ఆడే భారత జట్టును నేడు (సోమవారం) ప్రకటించనున్నారు. అలాగే ఐసీసీకి కూడా లీగల్ నోటీసును పంపే ఆలోచనను కూడా విరమించుకుంది. అంతా సీఓఏ కనుసన్నల్లోనే.. ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ విధానంలో తమకు భారీగా నష్టం చేకూరుతున్నందుకు టోర్నమెంట్ నుంచి తప్పుకుని తమ నిరసన తెలపాలని బీసీసీఐ సభ్యులు వాదించారు. అలాగే ఐసీసీకి లీగల్ నోటీసును కూడా పంపాలని బోర్డు భావించింది. అయితే అలా జరిగితే తాము సుప్రీం కోర్టుకు వెళతామని, జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సిందేనని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. దీంతో దిగివచ్చిన బోర్డు... ఎస్‌జీఎంలో మాట మార్చాల్సి వచ్చింది. టోర్నీని బహిష్కరిస్తే మరో ఎనిమిదేళ్లపాటు ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం లేకుం డా పోతుందని, అదే జరిగితే భారత క్రికెట్‌కు మంచి ది కాదని సూచించింది. దీంతో కమిటీ సూచనలను తు.చ తప్పకుండా పాటించి మమ అనిపించారు. ఐసీసీ హర్షం... చాంపియన్స్ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నందుకు ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఓ అద్భుత టోర్నీని చూడాలనుకుంటున్నారు. ఇక వారికి ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ ద్వారా కనులవిందు జరగబోతోంది’ అని ఐసీసీ పేర్కొంది. దాల్మియా మోడల్‌పై ఆలోచన... గతంలో జరిగిన చాంపియన్స్ లీగ్ టీ20 రద్దుతో ఖాళీగా ఉన్న ఆ స్లాట్ ద్వారా బోర్డు గణనీయంగా ఆదాయం సంపాదించవచ్చని 2015లో అప్పటి బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ‘ఆ టోర్నీ సెప్టెంబర్‌లో జరిగేది. అందుకే ప్రతీ ఏడాది సెప్టెంబర్‌లో భారత గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్ ఆడించాలని దాల్మియా తెలిపారు. అది టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఏదైనా కావచ్చు.. బ్రాడ్‌కాస్టర్స్ ఇచ్చే డబ్బుతో నిర్వహణ ఖర్చులు వెళ్లిపోతాయి. ఇలా ఐదేళ్లలో బోర్డు వెయ్యి కోట్లు సంపాదించవచ్చు. ప్రస్తుతం భారత జట్టు ఒక్కో మ్యాచ్‌కు రూ.43 కోట్లు పొందుతోంది. ప్రతీ సెప్టెంబర్‌లో చిన్నపాటి సిరీస్ ఆడినా ప్రసారకర్తలతో ఒప్పందం ద్వారా రూ.215 కోట్లు గడించవచ్చు. దీన్ని ఐదేళ్లకు వేసుకుంటే రూ.1075 కోట్లు అవుతుంది. ఇలా మనమే ఇంత సంపాదించుకునే అవకాశం ఉండగా ఐసీసీతో గొడవ ఎందుకు?’ అని ఓ రాష్ట్ర యూనిట్ అధికారి దాల్మియా మోడల్ గురించి వివరించారు. -
వెంటనే భారత జట్టును ప్రకటించండి
బీసీసీఐకి సీఓఏ ఆదేశం న్యూఢిల్లీ: నూతన ఆర్థిక విధానంపై తమ నిరసనను ప్రకటించేందుకు చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనకుండా ఉండాలని ఆలోచిస్తున్న బీసీసీఐకి నూతన పాలక కమిటీ (సీఓఏ) గట్టి షాకే ఇచ్చింది. తక్షణం చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును ప్రకటించాలని ఆదేశించింది. గతనెల 25 వరకు అన్ని జట్లను ప్రకటించేందుకు ఐసీసీ తుది గడువునిచ్చింది. అయితే ఐసీసీ తమ ఆదాయాన్ని 570 మిలియన్ డాలర్ల నుంచి 293 మిలియన్ డాలర్లకు తగ్గించడంతో కినుక వహించిన బోర్డు ఇప్పటిదాకా జట్టును ప్రకటించకుండా ఉంది. అయితే ఈ వ్యవహారంపై సీఓఏ సీరియస్‌గా స్పందించింది. ఏడు పాయింట్లతో కూడిన లేఖను బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరికి పంపించారు. జట్టును ప్రకటించకపోవడం భారత క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొంది. ‘ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కోసం గత నెల 25లోపే భారత జట్టును ప్రకటించాల్సిన విషయం మీకు తెలుసు. కానీ ఇప్పటిదాకా జట్టును వెల్లడించలేదు. వెంటనే సెలక్షన్ కమిటీని సమావేశపరిచి టీమిండియా జట్టును ప్రకటించండి. జట్టుపై ప్రస్తుత అనిశ్చితి వాతావరణాన్ని పడనీయకుండా చూడాలి. ఇప్పటికే చాలా గందరగోళ పరిస్థితులు జట్టు చుట్టూ నెలకొన్నాయి. ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా టీమిండియా ఉన్న విషయాన్ని ఆఫీస్ బేరర్లు దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఓఏ తమ లేఖలో ఘాటుగా స్పందించింది. అందరి సభ్యుల అంగీకారంతోనే ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ ఆధిపత్యం కొనసాగుతుందని, ఘర్షణ వాతావరణంతో కాదనే విషయాన్ని బోర్డు సభ్యులు మర్చిపోతున్నారని కమిటీ తెలిపింది. అయినా ఐసీసీతో ఇంకా చర్చించే అవకాశమున్నా లీగల్ నోటీసుల వరకు వెళ్లడమేమిటని ప్రశ్నించింది. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనాలి: మాజీలు మరోవైపు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు కచ్చితంగా పాల్గొనాల్సిందేనని 12 మంది మాజీ క్రికెటర్లు స్పష్టం చేశారు. ఈమేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో వెబ్సైట్ వీరి నుంచి అభిప్రాయాలను సేకరించింది. వీరిలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లతో పాటు జహీర్, గుండప్ప విశ్వనాథ్, సందీప్ పాటిల్, మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా, అగార్కర్, వెంకటేశ్ ప్రసాద్, సాబా కరీమ్, మురళీ కార్తీక్, దీప్‌దాస్ గుప్తా ఉన్నారు. 2013లో తాము గెలుచుకున్న చాంపియన్స్ ట్రోఫీని మరోసారి కాపాడుకోవాలని వీరంతా అభిప్రాయపడ్డారు. అయితే మే7న జరిగే బీసీసీఐ ఎస్‌జీఎంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. టీమిండియా జెర్సీ ఆవిష్కరణ ముంబై: భారత క్రికెట్ జట్టు జెర్సీ మారింది. ఇప్పటిదాకా స్టార్ ఇండియా లోగోతో ఉన్న జెర్సీ స్థానంలో తాజాగా కొత్త స్పాన్సరర్ చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో పేరు వచ్చి చేరింది. జూన్ 1 నుంచి జరిగే చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టు ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. గురువారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, రత్నాకర్ శెట్టి, ఎంవీ శ్రీధర్ పాల్గొన్నారు.