వెంటనే భారత జట్టును ప్రకటించండి | Announce the Indian team immediately | Sakshi
Sakshi News home page

వెంటనే భారత జట్టును ప్రకటించండి

Published Fri, May 5 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 10:24 AM

వెంటనే భారత జట్టును ప్రకటించండి

వెంటనే భారత జట్టును ప్రకటించండి

బీసీసీఐకి సీఓఏ ఆదేశం

న్యూఢిల్లీ: నూతన ఆర్థిక విధానంపై తమ నిరసనను ప్రకటించేందుకు చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనకుండా ఉండాలని ఆలోచిస్తున్న బీసీసీఐకి నూతన పాలక కమిటీ (సీఓఏ) గట్టి షాకే ఇచ్చింది. తక్షణం చాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును ప్రకటించాలని ఆదేశించింది. గతనెల 25 వరకు అన్ని జట్లను ప్రకటించేందుకు ఐసీసీ తుది గడువునిచ్చింది. అయితే ఐసీసీ తమ ఆదాయాన్ని 570 మిలియన్‌ డాలర్ల నుంచి 293 మిలియన్‌ డాలర్లకు తగ్గించడంతో కినుక వహించిన బోర్డు ఇప్పటిదాకా జట్టును ప్రకటించకుండా ఉంది. అయితే ఈ వ్యవహారంపై సీఓఏ సీరియస్‌గా స్పందించింది.

ఏడు పాయింట్లతో కూడిన లేఖను బోర్డు సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరికి పంపించారు. జట్టును ప్రకటించకపోవడం భారత క్రికెట్‌ ప్రతిష్టను దెబ్బతీస్తుందని పేర్కొంది. ‘ఈ ఏడాది చాంపియన్స్‌ ట్రోఫీ కోసం గత నెల 25లోపే భారత జట్టును ప్రకటించాల్సిన విషయం మీకు తెలుసు. కానీ ఇప్పటిదాకా జట్టును వెల్లడించలేదు. వెంటనే సెలక్షన్‌ కమిటీని సమావేశపరిచి టీమిండియా జట్టును ప్రకటించండి. జట్టుపై ప్రస్తుత అనిశ్చితి వాతావరణాన్ని పడనీయకుండా చూడాలి. ఇప్పటికే చాలా గందరగోళ పరిస్థితులు జట్టు చుట్టూ నెలకొన్నాయి. ప్రపంచంలోనే ఉత్తమ జట్టుగా టీమిండియా ఉన్న విషయాన్ని ఆఫీస్‌ బేరర్లు దృష్టిలో ఉంచుకోవాలి’ అని సీఓఏ తమ లేఖలో ఘాటుగా స్పందించింది. అందరి సభ్యుల అంగీకారంతోనే ప్రపంచ క్రికెట్‌లో బీసీసీఐ ఆధిపత్యం కొనసాగుతుందని, ఘర్షణ వాతావరణంతో కాదనే విషయాన్ని బోర్డు సభ్యులు మర్చిపోతున్నారని కమిటీ తెలిపింది. అయినా ఐసీసీతో ఇంకా చర్చించే అవకాశమున్నా లీగల్‌ నోటీసుల వరకు వెళ్లడమేమిటని ప్రశ్నించింది.

చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ పాల్గొనాలి: మాజీలు
మరోవైపు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు కచ్చితంగా పాల్గొనాల్సిందేనని 12 మంది మాజీ క్రికెటర్లు స్పష్టం చేశారు. ఈమేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌ వీరి నుంచి అభిప్రాయాలను సేకరించింది. వీరిలో సచిన్‌ టెండూల్కర్, రాహుల్‌ ద్రవిడ్‌లతో పాటు జహీర్, గుండప్ప విశ్వనాథ్, సందీప్‌ పాటిల్, మంజ్రేకర్, ఆకాశ్‌ చోప్రా, అగార్కర్, వెంకటేశ్‌ ప్రసాద్, సాబా కరీమ్, మురళీ కార్తీక్, దీప్‌దాస్‌ గుప్తా ఉన్నారు. 2013లో తాము గెలుచుకున్న చాంపియన్స్‌ ట్రోఫీని మరోసారి కాపాడుకోవాలని వీరంతా అభిప్రాయపడ్డారు. అయితే మే7న జరిగే బీసీసీఐ ఎస్‌జీఎంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

టీమిండియా జెర్సీ ఆవిష్కరణ
ముంబై: భారత క్రికెట్‌ జట్టు జెర్సీ మారింది. ఇప్పటిదాకా స్టార్‌ ఇండియా లోగోతో ఉన్న జెర్సీ స్థానంలో తాజాగా కొత్త స్పాన్సరర్‌ చైనీస్‌ మొబైల్‌ కంపెనీ ఒప్పో పేరు వచ్చి చేరింది. జూన్‌ 1 నుంచి జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే జట్టు ఈ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. గురువారం జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ, రత్నాకర్‌ శెట్టి, ఎంవీ శ్రీధర్‌ పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement