ధోనీ గురించి అలా వాగలేదు: భజ్జీ
ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేశారా, లేక గొప్ప ఆటగాడని చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేశారా, నిన్ను ఎందుకు ఎంపిక చేయలేదు అన్న ఇంటర్వ్యూ ప్రశ్నకు హర్భజన్ సింగ్ ఇచ్చిన సమాధానంతోనే అతడిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై భజ్జీ సీరియస్‌గా స్పందించాడు. 'ధోనీ టీమిండియాకు ఎంతో చేశాడు. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగానూ అద్బుతాలు చేసి చూపించాడు. భారత్‌కు ప్రపంచకప్‌లు అందించాడు. అతడికి ఫామ్‌తో సంబంధంలేదు. తనను ఎందుకు ఎంపిక చేయలేదో.. భారత క్రికెట్ సెలక్టర్లు దీనికి సమాధానం ఇవ్వగలరని' ఓ వీడియోను హర్భజన్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు.
'ధోనీ నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గొప్ప ఆటగాడు కూడా. చాంపియన్స్ ట్రోఫీకి ధోనీ ఎంపికపై నేనెప్పుడూ ప్రశ్నించలేదు. దయచేసి నాపై దుష్ప్రచారం చేయవద్దు. వాస్తవానికి ధోనీ విషయాన్ని ప్రస్తావించాను కానీ, అతడిని ఎందుకు జట్టులోకి తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేయలేదు. 19 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగస్వామిని. ధోనీ విషయంలో ఆలోచించినట్లే, సెలక్టర్లు తనను చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసి ఉండే బాగుండేది. నా విషయంలో కాస్త ఉదాసీనతగా వ్యహరించారని' మాత్రమే తాను చెప్పినట్లు వెల్లడించాడు. తప్పుడు కథనాలతో తనపై దుష్ప్రచారం చేసి ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేస్తున్నారని, దయచేసి ఈ వివాదానికి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాలని ట్వీట్లలో విజ్ఞప్తి చేశాడు.
2/3 MSD is a dear friend &a great player, I never doubted his selection so please don't quote me on things which I never said against him
— Harbhajan Turbanator (@harbhajan_singh) 26 May 2017