ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్‌

Published Tue, May 7 2024 2:16 PM

Truth Behind Dhoni No9 Decision Out Harbhajan Irfan Made To Eat Words

‍పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై క్రీడా వర్గాల్లో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ తదితరులు ధోని నిర్ణయాన్ని తప్పుబడుతూ ఘాటు విమర్శలు చేశారు.

జట్టుకు అవసరమైనపుడు ధోని బ్యాటింగ్‌ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ భజ్జీ వ్యాఖ్యానించాడు. ధోని ఇలాంటి తప్పు చేస్తాడని అసలు ఊహించలేదంటూ కామెంట్‌ చేశాడు. అతడికి బదులు జట్టులో మరో అదనపు పేసర్‌ను తీసుకోవాలని సూచించాడు.

మరోవైపు.. ఇర్ఫాన్‌ పఠాన్‌ సైతం.. 42 ఏళ్ల పైబడినా బ్యాటింగ్‌ చేయగల సత్తా ధోనికి ఉందని.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కనీసం 4-5 ఓవర్ల పాటు తలా క్రీజులో ఉండాలని సలహా ఇచ్చాడు.

ఇదిలా ఉంటే.. పంజాబ్‌తో అంతకు ముందు మ్యాచ్‌లోనూ ధోని డారిల్‌ మిచెల్‌తో కలిసి పరుగు తీసేందుకు వెనుకాడగా.. అదృష్టవశాత్తూ అతడు రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడిపోగా.. ధోని తీరుపై విమర్శలు వచ్చాయి.

ఈ రెండు సందర్భాల్లోనూ ధోనిని తప్పుబట్టిన వాళ్లకు అతడి అభిమానులు చురకలు అంటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోని ఇలా చేయడానికి ఇదే కారణమంటూ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.

మోకాలి గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న ధోని.. వికెట్‌ కీపర్‌గా సేవలు అందించే క్రమంలో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడన్నది దాని సారాంశం.

ఇందుకు సంబంధించి సీఎస్‌కే వర్గాలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మేము మా ద్వితీయ శ్రేణి జట్టుతోనే ఎక్కువగా ఆడుతున్నాం. ధోనిని విమర్శించే వాళ్లకు అతడు చేస్తున్న త్యాగాల గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు.

జట్టు కోసం అతడు ఎంతగానో పరితపిస్తాడు. మోకాలి నొప్పి వేధిస్తున్నా అవసరమైనపుడు బ్యాటింగ్‌ చేస్తున్నాడు’’ అని పేర్కొన్నాయి.‌ కాగా ఐపీఎల్‌-2024లో కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించిన ధోని.. ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

ఇప్పటికే అదనపు వికెట్‌ కీపర్‌ డెవాన్‌ కాన్వే జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో ధోనినే కీపింగ్‌ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. అయితే, మోకాలి నొప్పి తీవ్రం కాకుండా చూసుకునేందుకే బ్యాటింగ్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. 

కాగా ఈ సీజన్‌లో సీఎస్‌కే ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్‌లలో సీఎస్‌కే ఆరు గెలిచి పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మూడు మ్యాచ్‌లలో గెలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.

 
Advertisement
 
Advertisement