ధోని జట్టులో అవసరమా?: ‘తలా’పై సంచలన వ్యాఖ్యలు | CSK Better To Include A Fast Bowler Than Playing Dhoni: Harbhajan Singh | Sakshi
Sakshi News home page

‘ధోని చేసింది ముమ్మాటికీ తప్పే.. జట్టులో అతడు అవసరమా?’

Published Mon, May 6 2024 12:31 PM | Last Updated on Mon, May 6 2024 1:15 PM

ధోనిపై విమర్శలు (PC: BCCI)

ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ మహేంద్ర సింగ్‌ ధోని విషయంలో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. తొమ్మిదో స్థానంలో అతడు బ్యాటింగ్‌కు వచ్చిన నేపథ్యంలో మేనేజ్‌మెంట్‌తో పాటు ధోని నిర్ణయాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని బ్యాటింగ్‌ చేయడానికి సుముఖంగా లేనపుడు తుదిజట్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా తన టీ20 కెరీర్‌లో ధోని తొలిసారి తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.

పంజాబ్‌ కింగ్స్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌లో బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు మిచెల్‌ సాంట్నర్, శార్దూల్‌ ఠాకూర్‌ వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో బరిలోకి దిగగా.. వారి తర్వాత వచ్చిన ధోని గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

తుదిజట్టులో ధోని అవసరమా?
పంజాబ్‌ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. ఈ నేపథ్యంలో హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఎంఎస్‌ ధోని ఒకవేళ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలనుకుంటే.. అతడు అసలు ఆడనేకూడదు.

అలాంటపుడు ధోని బదులు తుదిజట్టులో మరో అదనపు ఫాస్ట్‌ బౌలర్‌ను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్నది ధోని స్వతహాగా తీసుకున్న నిర్ణయమే అయి ఉంటుంది.

అలా చేయడం ద్వారా తన జట్టును ప్రమాదంలోకి నెట్టాడు. ధోని కంటే ముందు శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌ రావడం ఏమిటి? ఠాకూర్‌ ఎప్పుడైనా హిట్టింగ్‌ ఆడాడా?

ధోని కావాలనే చేశాడు.. నాకైతే నచ్చలేదు
ధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరుగదు. కానీ ధోని ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పు చేశాడో అర్థం కావడం లేదు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేయాలన్న ధోని నిర్ణయం నాకైతే అస్సలు నచ్చలేదు’’ అని భజ్జీ కుండబద్దలు కొట్టాడు.

డెత్‌ ఓవర్లలో సీఎస్‌కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే ధోని కచ్చితంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్‌ సింగ్‌ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.

రవీంద్రుడి మాయాజాలం
 కాగా ధర్మశాల వేదికగా పంజాబ్‌తో ఆదివారం నాటి మ్యాచ్‌ సీఎస్‌కే 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43 పరుగులు, 3/20) వల్లే ఈ గెలుపు సాధ్యమైంది.‌‌‌‌ ఇక ఫినిషింగ్‌ స్టార్‌ ధోని ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 110 పరుగులు చేశాడు.

చదవండి: అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్‌ కామెంట్స్‌.. వసీం అక్రం కౌంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement