మహేంద్ర సింగ్ ధోని (PC: BCCI/IPL)
‘‘లేదు.. నేను ధోనితో మాట్లాడటం లేదు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడినపుడు.. అప్పుడప్పుడు ఆట గురించి మాట్లాడుకునేవాళ్లం. అయితే, ధోనితో మనసు విప్పి మాట్లాడి పదేళ్లకు పైగానే అయింది. ఇందుకు నా దగ్గర ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు.
ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు
బహుశా ధోని దగ్గర రీజన్ ఉండవచ్చు. అయితే, ఆ కారణం ఏమిటో నాకు మాత్రం తెలియదు. సీఎస్‌కేతో ఉన్నపుడు కూడా మైదానంలో మాత్రం అప్పుడప్పుడు మాట్లాడేవాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు ఎప్పుడూ నా గదికి వచ్చేవాడు కాదు. నేను కూడా అతడి గదికి వెళ్లేవాడిని కాదు.
ధోని పట్ల నాకెలాంటి వ్యతిరేక భావం లేదు. కానీ అతడికి నా మీద ఏదైనా కోపం ఉందేమో! ఒకవేళ అదే నిజమైతే అతడు ఆ విషయం గురించి నాతో మాట్లాడవచ్చు. నేనెప్పుడూ అతడికి కనీసం కాల్ కూడా చేయలేదు. ఎందుకంటే.. నేను ఫోన్ చేసినపుడు లిఫ్ట్ చేసి మాట్లాడితేనే మరోసారి ఫోన్ చేయాలనిపిస్తుంది.
అలాంటి వాళ్లతో నేనెందుకు మాట్లాడాలి?
లేదంటే.. అటువంటి వాళ్లను నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే బంధం అనేది రెండువైపులా ఉండాలి. మనం ఎదుటివారికి గౌరవం ఇస్తేనే.. మనకు కూడా గౌరవం దక్కుతుంది. నేను రెండుసార్లు ఫోన్ చేసినా.. అటువైపు నుంచి స్పందన లేకపోతే.. నేనెందుకు అలాంటి వ్యక్తితో మాట్లాడతా!’’ అంటూ టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మూడు ఐసీసీ టైటిళ్లు గెలిచిన మహేంద్ర సింగ్ ధోనితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ మేర వ్యాఖ్యలు చేశాడు. తామిద్దరి మధ్య మాటలులేక దశాబ్దకాలం గడిచిందన్నాడు భజ్జీ. తాను మాట్లాడేందుకు ప్రయత్నించినా ధోని నుంచి స్పందన లేకపోవడంతో తాను కూడా అతడికి దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు భజ్జీ తెలిపాడు.
అదంతా నిజమే
కాగా ధోని- భజ్జీ మధ్య విభేదాలున్నాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా క్రికెట్‌నెక్స్ట్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్ అదంతా నిజమేనని ధ్రువీకరించాడు. కాగా 2007లో ధోని సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో.. అదే విధంగా.. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన టీమిండియాలోనూ హర్భజన్ సింగ్ సభ్యుడు.
అంతేకాదు.. 2018 నుంచి 2020 వరకు ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున భజ్జీ ఆడటం గమనార్హం. అయితే, వీరిద్దరి బంధం బీటలు వారడానికి గల కారణంపై మాత్రం స్పష్టత లేదు.
చదవండి: Asia Cup 2024: టీమిండియా ఓపెనర్ల ఊచకోత.. సెమీ ఫైనల్లో భారత్
Comments
Please login to add a commentAdd a comment