ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది | India play the Champions Trophy | Sakshi
Sakshi News home page

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది

Published Mon, May 8 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది

నేడు జట్టు ప్రకటన      
దాల్మియా మోడల్‌పై చర్చ


న్యూఢిల్లీ:  ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొనబోతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)ఈ మేరకు నిర్ణయించింది. వచ్చే నెల 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో ఆడే భారత జట్టును నేడు (సోమవారం) ప్రకటించనున్నారు. అలాగే ఐసీసీకి కూడా లీగల్‌ నోటీసును పంపే ఆలోచనను కూడా విరమించుకుంది.  

అంతా సీఓఏ కనుసన్నల్లోనే..
ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ విధానంలో తమకు భారీగా నష్టం చేకూరుతున్నందుకు టోర్నమెంట్‌ నుంచి తప్పుకుని తమ నిరసన తెలపాలని బీసీసీఐ సభ్యులు వాదించారు. అలాగే ఐసీసీకి లీగల్‌ నోటీసును కూడా పంపాలని బోర్డు భావించింది. అయితే అలా జరిగితే తాము సుప్రీం కోర్టుకు వెళతామని, జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాల్సిందేనని నూతన పరిపాలక కమిటీ (సీఓఏ) హెచ్చరించింది. దీంతో దిగివచ్చిన బోర్డు... ఎస్‌జీఎంలో మాట మార్చాల్సి వచ్చింది. టోర్నీని బహిష్కరిస్తే మరో ఎనిమిదేళ్లపాటు ఐసీసీ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం లేకుం డా పోతుందని, అదే జరిగితే భారత క్రికెట్‌కు మంచి ది కాదని సూచించింది. దీంతో కమిటీ సూచనలను తు.చ తప్పకుండా పాటించి మమ అనిపించారు.

ఐసీసీ హర్షం...
చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నందుకు ఐసీసీ హర్షం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్‌ అభిమానులు ఓ అద్భుత టోర్నీని చూడాలనుకుంటున్నారు. ఇక వారికి ఇప్పుడు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ ద్వారా కనులవిందు జరగబోతోంది’ అని ఐసీసీ పేర్కొంది.

దాల్మియా మోడల్‌పై ఆలోచన...
గతంలో జరిగిన చాంపియన్స్‌ లీగ్‌ టీ20 రద్దుతో ఖాళీగా ఉన్న ఆ స్లాట్‌ ద్వారా బోర్డు గణనీయంగా ఆదాయం సంపాదించవచ్చని 2015లో అప్పటి బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్‌ దాల్మియా ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. ‘ఆ టోర్నీ సెప్టెంబర్‌లో జరిగేది. అందుకే ప్రతీ ఏడాది సెప్టెంబర్‌లో భారత గడ్డపై ఓ ద్వైపాక్షిక సిరీస్‌ ఆడించాలని దాల్మియా తెలిపారు. అది టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌ ఏదైనా కావచ్చు.. బ్రాడ్‌కాస్టర్స్‌ ఇచ్చే డబ్బుతో నిర్వహణ ఖర్చులు వెళ్లిపోతాయి. ఇలా ఐదేళ్లలో బోర్డు వెయ్యి కోట్లు సంపాదించవచ్చు. ప్రస్తుతం భారత జట్టు ఒక్కో మ్యాచ్‌కు రూ.43 కోట్లు పొందుతోంది.

ప్రతీ సెప్టెంబర్‌లో చిన్నపాటి సిరీస్‌ ఆడినా ప్రసారకర్తలతో ఒప్పందం ద్వారా రూ.215 కోట్లు గడించవచ్చు. దీన్ని ఐదేళ్లకు వేసుకుంటే రూ.1075 కోట్లు అవుతుంది. ఇలా మనమే ఇంత సంపాదించుకునే అవకాశం ఉండగా ఐసీసీతో గొడవ ఎందుకు?’ అని ఓ రాష్ట్ర యూనిట్‌ అధికారి దాల్మియా మోడల్‌ గురించి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement