మహిళల టి20 ప్రపంచకప్‌లో నేడు భారత్ తొలి మ్యాచ్
న్యూజిలాండ్‌తో మొదటి పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
దుబాయ్: తొమ్మిదో ప్రయత్నంలోనైనా ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్ టైటిల్ వేటను నేడు ఆరంభించనుంది. తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది టి20 ప్రపంచకప్‌లలో భారత్ ఒక్కసారి మాత్రమే ఫైనల్ (2020లో) చేరి రన్నరప్‌గా నిలిచింది.
ఈసారి మాత్రం కొత్త చరిత్ర తిరగరాయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం పట్టుదలతో ఉంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుతో టీమిండియా తలపడనుంది. గత ఏడాది వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆ్రస్టేలియా చేతిలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియా ఈసారి కప్‌తో తిరిగి రావాలంటే శుభారంభం లభించాలి.
ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల టి20 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు విజయం సాధించగా... ఇప్పుడు అదే బాటలో తొలిసారి ‘విశ్వ కిరీటం’ దక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్ జట్టు తహతహలాడుతోంది. టి20 ఫార్మాట్‌లో ప్రపంచకప్ ప్రవేశ పెట్టినప్పటి (2009) నుంచి భారత జట్టులో కొనసాగుతున్న 35 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్... జట్టును ఎలా నడిపిస్తుందనేది ఆసక్తికరం.
టాపార్డర్ రాణిస్తేనే!
అంతర్జాతీయ స్థాయిలో గొప్ప విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టు ఐసీసీ టోర్నీల్లో మాత్రం గెలుపు గీత దాటలేకపోతోంది. ఒత్తిడిని ఎదుర్కోలేకపోవడం, ఆటలో కీలక దశలో పట్టు సడలించడం వంటి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇటీవల ఆసియా కప్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చిన టీమిండియా... శ్రీలంకతో ఫైనల్లో అనూహ్యంగా తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. దీంతో లోపాలను గుర్తించిన కోచింగ్ బృందం జట్టుకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించింది.
బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్లేయర్ల ఫిట్‌నెస్, ఫీల్డింగ్‌ను మరింత సానబెట్టింది. అదే సమయంలో మానసిక దృఢత్వం కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తోంది. గత ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధశతకాలు సాధించిన స్మృతి మంధాన ఆసియా కప్‌లో అదరగొట్టింది.
స్మతి అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. ఆమెతో పాటు మిగిలిన ప్లేయర్లు సత్తా చాటాల్సిన అవసరముంది. భారత్‌ను పోలి ఉండే దుబాయ్, షార్జా పిచ్‌లపై మన స్పిన్నర్ల ప్రదర్శన కీలకం కానుంది. దీప్తి శర్మపై భారీ అంచనాలు ఉండగా... శ్రేయాంక, ఆశ శోభన, రాధ కూడా రాణిస్తే జట్టుకు తిరుగుండదు.
సమతూకంగా న్యూజిలాండ్...
న్యూజిలాండ్ జట్టు అటు అనుభవజ్ఞులు ఇటు యంగ్ ప్లేయర్లతో సమతూకంతో ఉంది. కెపె్టన్ సోఫీ డివైన్, టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ సుజీ బేట్స్ (36 మ్యాచ్‌ల్లో 1066 పరుగులు), లీ తహుహూ, అమెలియా కెర్‌లతో కివీస్ జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో రెండుసార్లు (2009, 2010) రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు ఈసారైనా చాంపియన్‌గా అవతరించాలని భావిస్తోంది.
రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగనున్న ఈ టోరీ్నలో లీగ్ దశలో ప్రతి జట్టు గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో తలపడనుంది. దీంతో ప్రతి మ్యాచ్ కీలకమే కాగా... లీగ్ దశ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి.
గ్రూప్ ‘ఎ’లో భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ శ్రీలంక ఉన్నాయి. దుబాయ్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... పిచ్ స్పిన్నర్లకు సహకరించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్ అమెలియా కెర్ న్యూజిలాండ్ జట్టుకు కీలకం కానుంది.
తుది జట్లు (అంచనా)
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా, రిచా ఘోష్, హేమలత, దీప్తి శర్మ, పూజ వస్త్రకర్, రేణుక, రాధ యాదవ్, ఆశ శోభన.
న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, అమెలియా కెర్, బ్రూక్ హ్యాలీడే, మ్యాడీ గ్రీన్, ఇజీ గేజ్, కాస్పెరెక్, జెస్ కెర్, లీ తహుహూ, ఈడెన్ కార్సన్, రోస్‌మేరీ మైర్.
4 న్యూజిలాండ్ జట్టుతో భారత్ ఇప్పటి వరకు 13 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచింది. 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇక టి20 ప్రపంచకప్‌లో రెండు జట్లు నాలుగుసార్లు తలపడ్డాయి. చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచాయి. గత రెండు ప్రపంచకప్‌లలో న్యూజిలాండ్‌పై భారతే గెలిచింది.
4/4 భారత జట్టు ఆడిన ఎనిమిది ప్రపంచకప్‌లలో తొలి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తర్వాతి నాలుగింటిలో ఆడిన తొలి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేసింది. తొమ్మిదోసారి ఎలాంటి ఫలితం వస్తుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment