ఒక్కరోజు చాలు... చరిత్ర మారిపోవడానికి... రికార్డులు బద్దలు కావడానికి... ఒక్కరోజు చాలు... అనామకులు అసాధ్యులుగా మారి అద్భుతాలు చేయడానికి... ఒక్కరోజు చాలు... హీరోలుగా కీర్తించబడినవారు జీరోలుగా మారిపోవడానికి... అభిమానులకు అంతులేని ఆనందం పంచేందుకు, ఎప్పటికీ మరచిపోలేని విషాదం మిగిల్చేందుకు కూడా ఆ ఒక్కరోజు చాలు... యాభై రెండేళ్ల క్రితం బుడిబుడి అడుగులు వేసిన ఒక్కరోజు ఆట 4657 సమరాల తర్వాత కాస్త అలసటకు లోనైనట్లుగా కనిపిస్తోంది.
తనకంటే 146 ఏళ్ల క్రితం పుట్టిన ఆట తన పెద్దరికపు హోదాను నిలబెట్టుకుంటూ ఇంకా సజీవంగా సాగిపోతుంటే... తనకంటే 34 ఏళ్లు చిన్నదైన ఆట కూడా రోజురోజుకీ ఎదిగిపోతూ ధూమ్‌ధామ్‌గా వెలిగిపోతుంటే ఒక్కరోజు ఆటకే కొంత కాలంగా చిక్కొచ్చి పడింది. ఇప్పుడు దానికి కొత్త ఊపిరి కావాలి... వినోదాన్ని అందించడంలో నేనూ ఎక్కడా వెనుకబడిపోను అన్నట్లుగా ఒక ఊపు రావాలి... అందుకే సరైన సమయం, వేదిక కావాలి. అలాంటి సమయం వచ్చేసింది... వన్డే క్రికెట్ గొప్పతనాన్ని చూపించేందుకు, ఈ ఫార్మాట్ ముద్ర చూపించేందుకు ప్రపంచకప్‌కంటే సరైన వేదిక లేదు... అవును, ఇట్ టేక్స్ వన్ డే!
నరాలు తెగే ఉత్కంఠతో ఫలితాన్ని అందించిన గత ప్రపంచకప్ తుది సమరం గుర్తుందా? నాలుగేళ్ల క్రితంనాటి ఆ జ్ఞాపకాలను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరచిపోలేరు. ఆపై రెండు పొట్టి ప్రపంచకప్‌లు, రెండు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ సమరాల తర్వాత నేనున్నానంటూ మళ్లీ వన్డే విశ్వక్రీడా సంబరం వచ్చేసింది... ఈ నాలుగేళ్ల వ్యవధిలో జట్లు మారాయి, ఆటగాళ్లు మారారు, నిబంధనలూ మారాయి... కానీ విశ్వవ్యాప్తంగా అభిమానుల ఆశలు, అంచనాలు మాత్రం మారలేదు.
మరోసారి వారి వినోదానికి భరోసానిస్తూ, గత పన్నెండు మెగా టోర్నీలకు ఏమాత్రం తగ్గకుండా ఈ వరల్డ్‌కప్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. పుష్కర కాలం తర్వాత ఆతిథ్యమిస్తున్న భారత్ సొంతగడ్డపై 12 ఏళ్ల క్రితం నాటి ప్రదర్శనను పునరావృతం చేసే లక్ష్యంతో అమితోత్సాహంతో సిద్ధమైంది. ఐదుసార్లు చాంపియన్ ఆ్రస్టేలియా ఖాతాలో ఆరో టైటిల్ చేరుతుందా? ఇంగ్లండ్ తమ జోరును ఇక్కడా నిలబెట్టుకుంటుందా? మూడు దశాబ్దాలుగా దక్కని ద్రాక్ష పాక్‌కు అందుతుందా అనేది ఆసక్తికరం. ఎప్పటిలాగే కివీస్, దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలు నిజమవుతాయా లేక ఇతర సంచలనాలు ఉంటాయా అనేది 46 రోజులు చర్చనీయాంశమే!
అహ్మదాబాద్: ఐసీసీ 13వ వన్డే వరల్డ్ కప్ సమరానికి సమయం వచ్చేసింది. గత టోర్నీ ఫైనలిస్ట్‌లు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య నేడు అహ్మదాబాద్‌లో జరిగే తొలి పోరుతో ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. నవంబర్ 19న ఇదే అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
ఈ క్రమంలో 48 లీగ్ మ్యాచ్‌లు, రెండు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి. 2011 తర్వాత భారత్ మరోసారి వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. గత రెండు టోర్నీల్లో సెమీస్ చేరిన టీమిండియా స్వదేశంలో ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. గత టోర్నీ ఫార్మాట్ తరహాలోనే బరిలో 10 జట్లు నిలిచాయి. ప్రతీ టీమ్ ఇతర తొమ్మిది జట్లతో తలపడుతుంది.
గ్రూప్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన టాప్–4 టీమ్‌లు సెమీఫైనల్ చేరతాయి. వరల్డ్ కప్ తొలి రెండు టోర్నీల్లో జగజ్జేతగా నిలిచి సుదీర్ఘ కాలం క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్ లేకుండా జరుగుతున్న తొలి వరల్డ్ కప్ ఇదే. ఈసారి ర్యాంకింగ్ ద్వారా ఎనిమిది జట్లు నేరుగా అర్హత సాధించగా... క్వాలిఫయింగ్ టోర్నీ ఆడి మాజీ విజేత శ్రీలంక, నెదర్లాండ్స్ అవకాశం దక్కించుకున్నాయి.
10 మ్యాచ్‌లు జరిగే వేదికల సంఖ్య. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, లక్నో, ధర్మశాల, పుణే, హైదరాబాద్ వేదికలుగా మ్యాచ్‌లు జరుగుతాయి. సెమీస్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదిక కానుండగా, ఫైనల్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లో మినహా మిగతా 9 వేదికల్లో భారత్ తమ మ్యాచ్‌లు ఆడుతుంది.
1 భారత్ తొలిసారి ఈ టోర్నీని పూర్తిస్థాయిలో నిర్వహిస్తోంది. 1987లో పాక్‌తో, 1996లో పాక్, శ్రీలంకలతో, 2011లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో కలిసి సంయుక్తంగా ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇచ్చింది.
రూ. 83 కోట్లు టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ. ఇందులో విజేతకు రూ. 33 కోట్లు, రన్నరప్‌కు రూ.16.50 కోట్లు అందిస్తారు.
51 టోర్నీలో మొత్తం మ్యాచ్‌ల సంఖ్య.
1 గత వరల్డ్‌కప్‌లోనూ, ఈసారి జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరిస్తున్న ఏకైక ఆటగాడు కేన్ విలియమ్సన్. మిగతా అన్న జట్లకూ సారథులు మారారు.
ఇంగ్లండ్ X న్యూజిలాండ్
2019 ఫైనలిస్ట్‌ల మధ్య టోర్నీ తొలి మ్యాచ్ జరుగుతుంది. 1996లో భారత్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్‌లోనూ ఈ రెండు జట్ల మధ్యే ఇదే అహ్మదాబాద్‌లో టోర్నీ తొలి మ్యాచ్ జరిగింది.
గత విజేతలు
ఆస్ట్రేలియా (5 సార్లు; 1987, 1999, 2003, 2007, 2015). భారత్ (2 సార్లు; 1983, 2011). వెస్టిండీస్ (2 సార్లు; 1975, 1979). పాకిస్తాన్ (1992). శ్రీలంక (1996). ఇంగ్లండ్ (2019).
Comments
Please login to add a commentAdd a comment