2019 జూన్ 9–10... మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానం... భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ మ్యాచ్... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడంతో తర్వాతి రోజు ఆట కొనసాగగా, చివరకు 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులతో న్యూజిలాండ్ ముగించింది.
ఎలా చూసినా ఇది టీమిండియా ఛేదించదగ్గ స్కోరే. అయితే 5 పరుగులకే రోహిత్, కోహ్లి, రాహుల్ వెనుదిరగడంతో పేలవ ఆరంభం లభించగా... ఒకదశలో జట్టు 92/6తో ఓటమికి చేరువైంది. జడేజా 59 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో ఎదురుదాడి చేయడంతో గెలుపుపై ఆశలు రేగాయి. అయితే కివీస్ తమ బౌలింగ్‌తో మళ్లీ మ్యాచ్‌ను అదుపులోకి తెచ్చుకుంది.
14 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితిలో జడేజా వెనుదిరగ్గా... మరో మూడు బంతుల తర్వాత ధోని రనౌట్ భారత అభిమానుల గుండె పగిలేలా చేసింది. అయితే ఏ దశలోనూ దూకుడు చూపించని, అభిమానులు కూడా నివ్వెరపోయేలా సాగిన ధోని ఇన్నింగ్సే (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) ఓటమికి కారణాల్లో ఒకటనేది వాస్తవం!
ధైర్యవంతులకే అదృష్టం కూడా అండగా నిలుస్తుంది. మేం ఇప్పుడు పూర్తి నమ్మకంతో, ధైర్యంతో బరిలోకి దిగుతున్నాం. ఇలాంటప్పుడే కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి. టోర్నీలో తొలి ఐదు మ్యాచ్‌లలో మేం లక్ష్యాన్ని ఛేదించగా, తర్వాతి నాలుగు మ్యాచ్‌లలో ముందుగా బ్యాటింగ్ చేశాం. కాబట్టి అన్ని రకాలుగా మమ్మల్ని మేం పరీక్షించుకున్నట్లే. వాటితో పోలిస్తే ఈ మ్యాచ్ ప్రాధాన్యత ఏమిటో మాకు తెలుసు. అయినా సరే మేం ఏమీ కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎలా ఆడామో అలా ఆడితే చాలు. ఒత్తిడి కొత్త కాదు.
ప్రపంచకప్‌లో సెమీస్ అయినా లీగ్ మ్యాచ్ అయినా ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. భారత క్రికెటర్లపై ఇది మరీ ఎక్కువ. ఆటగాళ్లంతా ఆ స్థితిని దాటుకునే వచ్చారు కాబట్టి బాగా ఆడటమే అన్నింటికంటే ముఖ్యం. న్యూజిలాండ్ ఎంతో తెలివైన, క్రమశిక్షణ కలిగిన జట్టు. ప్రత్యర్థిని బాగా అర్థం చేసుకొని తమ వ్యూహాలు సిద్ధం చేసుకుంటారు.
1983లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ప్రస్తుత జట్టులోని సగం మంది పుట్టనే లేదు. 2011లో సగం మంది క్రికెట్ మొదలు పెట్టలేదు. కాబట్టి ఈ జట్టు సభ్యులంతా గతం గురించి కాకుండా వర్తమానంపై, తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. గతంలో నాకౌట్ మ్యాచ్‌లలో, నాలుగేళ్ల క్రితం ఏం జరిగిందనేది కూడా మాకు అనవసరం. –మీడియా సమావేశంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ
భారత్‌తో మ్యాచ్ మాకు పెద్ద సవాల్ అనేది వాస్తవం. ఆ టీమ్ చాలా బాగా ఆడుతోంది. అయితే టోvలో ప్రతీ మ్యాచ్ భిన్నమైందే. తమదైన రోజున ఏ జట్టయినా ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. జట్టు బలంతో పాటు అప్పటి పరిస్థితులు, వాటి ప్రభావం కూడా అందుకు కారణమవుతాయి. లీగ్‌లో ఎంత కష్టపడి ఇక్కడికి వచ్చామన్నది ముఖ్యం కాదు. నాకౌట్ దశను మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సిందే.
వరుసగా గత రెండు వరల్డ్ కప్‌లలో మేం ఫైనల్ చేరినా మమ్మల్ని ఇంకా అండర్‌డాగ్స్‌గానే చూస్తుంటారు. మేం వీటికి అలవాటుపడిపోయాం కాబట్టి ఇబ్బందేమీ లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తే ఇక్కడా గెలవగలం కాబట్టి ఏదైనా జరగొచ్చు. 2019లాగే ఈసారి కూడా మైదానంలో అంతా భారత అభిమానులే ఉంటారు. మాకు మద్దతు పలకకపోయినా ఆ వాతావరణం మాత్రం చాలా బాగుంటుంది. మా జట్టులో చాలా మందికి ఇది అలవాటే. అయినా భారత గడ్డపై భారత్‌తో సెమీస్‌లో తలపడటమే ఎంతో ప్రత్యేకం. – కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment