ధర్మశాల: క్రికెట్ అభిమానుల కోసం మరో ఆదివారం అసలైన వినోదానికి రంగం సిద్ధమైంది. ప్రపంచకప్‌లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న జట్లు నేడు జరిగే పోరులో ముఖాముఖీ తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో నేడు న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది.
సొంతగడ్డపై సమష్టి ప్రదర్శనతో టీమిండియా చెలరేగిపోతుండగా...ఫేవరెట్‌లుగా భావించిన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను వెనక్కి నెట్టి గత రన్నరప్ న్యూజిలాండ్ ముందుకు దూసుకొచ్చింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకునేందుకు జరిగే ఈ పోరులో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం.
పాండ్యా స్థానంలో ఎవరు?
జోరు మీదున్న భారత్‌కు గత మ్యాచ్ తర్వాత అనూహ్య సమస్య వచ్చింది. గాయపడిన హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో అతని స్థానంలో ఎవరిని ఎంచుకుంటారనేది కీలకంగా మారింది. పిచ్ పరిస్థితిని బట్టి చూస్తే నేరుగా షమీకి అవకాశం దక్కవచ్చు. అయితే బ్యాటింగ్ బలహీనంగా మారే అవకాశం ఉంది. దాంతో సూర్యకుమార్ లేదా ఇషాన్ కిషన్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది.
అలా చేస్తే శార్దుల్ ఠాకూర్ పూర్తి స్థాయిలో ఐదో బౌలర్‌గా తన బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంటుంది. భారత బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉండటం సానుకూలాశం. రోహిత్, కోహ్లి, గిల్, రాహుల్ అద్భుత ఆటతో కొనసాగిపోతున్నారు. రోహిత్, కోహ్లి దూకుడు భారత్‌కు మరో సారి గెలుపు అవకాశాలు సృష్టించగలదు. ఇప్పటి వరకు టీమిండియాకు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌కు పరీక్షించే అవకాశం రాలేదు.
కానీ కివీస్ బౌలర్లు చెలరేగితే వారు కూడా సత్తా చాటాల్సి ఉంటుంది. బుమ్రా, సిరాజ్‌లతో పేస్ బౌలింగ్ పదునుగా ఉంది. కుల్దీప్‌ను ఒక్క ప్రత్యర్థి కూడా సమర్థంగా ఎదుర్కోలేకపోయాడు. జడేజా స్పిన్ కూడా కివీస్‌ను కట్టడి చేయగలదు.
అదే జట్టుతో...
మొదటినుంచీ కివీస్ నమ్ముకున్న సమష్టితత్వమే ఆ జట్టును గెలిపిస్తోంది. గత నాలుగు మ్యాచ్‌లలో కూడా అది కనిపించింది. ఒకరు విఫలమైతే మరొకరు ఆ బాధ్యతను తీసుకుంటున్నారు. అందుకే న్యూజిలాండ్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. విలియమ్సన్, సౌతీ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కూ దూరమయ్యాడు.
కాన్వే, యంగ్ శుభారంభాలు అందిస్తుండగా రచిన్, లాథమ్ దానిని కొనసాగిస్తున్నారు. ఫిలిప్స్, చాప్‌మన్ మెరుపులు జట్టుకు భారీ స్కోరు అందిస్తున్నాయి. ఇక పేస్ బౌలింగ్ దళం చాలా పదునుగా ఉంది. బౌల్ట్, హెన్రీలను ఎదుర్కోవడం భారత్‌కు అంత సులువు కాదు. వీరితో పాటు ఫెర్గూసన్, సాన్‌ట్నర్ కూడా సత్తా చాటగలరు.
పిచ్, వాతావరణం
పిచ్‌పై కాస్త పచ్చిక ఉంటుంది. స్వింగ్, బౌన్స్‌కు మంచి అనుకూలం. పేసర్లకు సానుకూలాంశం. బ్యాటర్లు నిలదొక్కుకుంటే పరుగులు రావచ్చు. మ్యాచ్ రోజు చల్లటి వాతావరణం ఉంటుంది. వర్షసూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్ ), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, జడేజా, శార్దుల్, షమీ, బుమ్రా, కుల్దీప్, సిరాజ్.
న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, ఫిలిప్స్, చాప్‌మన్, సాన్‌ట్నర్, హెన్రీ, ఫెర్గూసన్, బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment