కివీ'పోటు'
ఎవరైనా అనుకున్నారా... భారత జట్టు ఇంత ఘోరంగా ఓడిపోతుందని.
ఎవరైనా కలగన్నారా... సొంతగడ్డపై పులులు పిల్లుల్లా మారతారని
ఎవరైనా ఊహించగలరా... న్యూజిలాండ్ స్పిన్నర్లు ఇంత మాయ చేయగలరని.
వాళ్లేమీ దిగ్గజాలు కాదు... అనుభవం అంతకన్నా లేదు. కానీ మాయ చేశారు.
అలా ఇలా కాదు... భారత్‌ను తమ స్పిన్ ఉచ్చులో బిగించి గింగరాలు తిప్పించారు.
ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డట్లు... స్పిన్ వికెట్‌పై చెలరేగాల్సిన భారత్ బొక్కబోర్లా పడింది.
సొంతగడ్డపై టైటిల్ ఫేవరెట్‌గా ప్రపంచకప్‌ను మొదలుపెట్టిన ధోనిసేన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మనోళ్ల దూకుడుకు కేరింతలు కొట్టాల్సిన స్టేడియం... చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దంగా మారింది. కోటి ఆశలతో టీవీలకు అతుక్కున్న కోట్లాది మంది భారతీయులు దారుణంగా నిరాశచెందారు.కివీ‘పోటు’కు ధోనిసేన ఉక్కిరిబిక్కిరయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఘోర పరాజయంతో టి20 ప్రపంచకప్‌ను ప్రారంభించింది.
♦ భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
♦ స్పిన్ ఉచ్చులో చిక్కిన ధోనిసేన
♦ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాన్‌ట్నర్
నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి: స్పిన్ వేయడంలో బలం ఉంటే సరిపోదు... అదే స్పిన్‌ను బాగా ఆడే సమర్థత కూడా ఉండాలి... లేకపోతే ఫలితం ఇలాగే ఉంటుంది. సింగిల్స్ తీసుకుంటూ చివరి వరకూ ఆడినా గెలిచే మ్యాచ్‌లో భారత్ తమ బలహీనతను బయటపెట్టింది. బ్యాట్స్‌మెన్ ఘోర వైఫల్యంతో టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఏకంగా 47 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కోరీ అండర్సన్ (42 బంతుల్లో 34; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. అనంతరం భారత్ 18.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. ధోని (30 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్), కోహ్లి (27 బంతుల్లో 23; 2 ఫోర్లు) తప్ప ఎవరూ కనీసం పోరాడలేదు. కివీస్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సాన్‌ట్నర్ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, ఇష్ సోధికి 3 వికెట్లు దక్కాయి. శనివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో భారత్ జట్టు పాకిస్తాన్‌తో తలపడుతుంది.
అండర్సన్ మినహా...
పవర్‌ప్లేలో న్యూజిలాండ్ చేసిన పరుగులు 33. ఇందులో తొలి ఓవర్లో కొట్టిన రెండు సిక్సర్లను మినహాయిస్తే మిగిలిన 22 బంతుల్లో ఆ జట్టు చేసింది 21 పరుగులే! దీన్ని బట్టి భారత బౌలర్లు ప్రత్యర్థిని ఎంతగా నియంత్రించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నెహ్రా, బుమ్రా కట్టి పడేయడంతో ఆ జట్టు ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. మ్యాచ్ తొలి బంతిని సిక్సర్ బాదిన గప్టిల్ (6) రెండో బంతికే వెనుదిరగ్గా, నాలుగో బంతిని భారీ సిక్సర్ కొట్టి మున్రో (7) తర్వాతి ఓవర్‌కే వెనుదిరిగాడు. విలియమ్సన్ (16 బంతుల్లో 8) భారమైన ఇన్నింగ్స్‌కు ముగింపు పలికిన రైనా...
కొద్ది సేపటికి అద్భుతమైన ఫీల్డింగ్‌తో టేలర్ (10)ను కూడా రనౌట్‌గా వెనక్కి పంపాడు. మరో వైపు అండర్సన్‌ను భారీ షాట్లు ఆడకుండా ప్రత్యేక వ్యూహంతో బౌలర్లు లెగ్‌స్టంప్‌పై బంతులు విసిరి కట్టడి చేశారు. దూకుడుగా ఆడేందుకు పదే పదే ప్రయత్నించి విఫలమైన అండర్సన్ చివరకు బుమ్రా యార్కర్‌కు బౌల్డయ్యాడు. చివర్లో రోంచీ (11 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త ధాటిగా ఆడటంతో కివీస్ పోరాడే స్కోరు చేసింది.
అంతా అనూహ్యం
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌కు షాక్ మీద షాక్ తగిలింది. కివీస్ కూడా భారత్‌లాగే స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే నాథన్ మెకల్లమ్... ధావన్ (1)ను అవుట్ చేయగా, మూడో ఓవర్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ సాన్‌ట్నర్ చెలరేగాడు. భారీ షాట్ ఆడబోయి ముందుకొచ్చిన రోహిత్ (5) స్టంపవుట్ కాగా, రైనా (1) కూడా అనుసరించాడు. ఇక కోహ్లి ఉన్నాడు కదా...చింత లేదు అనుకుంటే ఈ సారి లెగ్‌స్పిన్నర్ సోధి వంతు. తన తొలి బంతికే అతను విరాట్ పని పట్టడంతో భారత్ పరిస్థితి మరింత దిగజారింది. ఒక వైపు ధోని పోరాడటం మినహా మన బ్యాట్స్‌మెన్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 4 ఫోర్లు, 1 సిక్స్ మాత్రమే ఉన్నాయి. మరో 11 బంతులకు ముందే జట్టు కథ ముగిసిపోవడం విశేషం.స్కోరు వివరాలు:-
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 6; విలియమ్సన్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 8; మున్రో (సి) పాండ్యా (బి) నెహ్రా 7; అండర్సన్ (బి) బుమ్రా 34; టేలర్ (రనౌట్) 10; సాన్‌ట్నర్ (సి) ధోని (బి) జడేజా 18; ఇలియట్ (రనౌట్) 9; రోంచీ (నాటౌట్) 21; మెకల్లమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 126.
వికెట్ల పతనం: 1-6; 2-13; 3-35; 4-61; 5-89; 6-98; 7-114.
బౌలింగ్: అశ్విన్ 4-0-32-1; నెహ్రా 3-1-20-1; బుమ్రా 4-0-15-1; రైనా 4-0-16-1; జడేజా 4-0-26-1; పాండ్యా 1-0-10-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) రోంచీ (బి) సాన్‌ట్నర్ 5; ధావన్ (ఎల్బీ) (బి) మెకల్లమ్ 1; కోహ్లి (సి) రోంచీ (బి) సోధి 23; రైనా (సి) గప్టిల్ (బి) సాన్‌ట్నర్ 1; యువరాజ్ (సి) అండ్ (బి) మెకల్లమ్ 4; ధోని (సి) మెకల్లమ్ (బి) సాన్‌ట్నర్ 30; పాండ్యా (ఎల్బీ) (బి) సాన్‌ట్నర్ 1; జడేజా (సి) అండ్ (బి) సోధి 0; అశ్విన్ (స్టంప్డ్) రోంచీ (బి) సోధి 10; నెహ్రా (బి) మిల్నే 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.1 ఓవర్లలో ఆలౌట్) 79.
వికెట్ల పతనం: 1-5; 2-10; 3-12; 4-26; 5-39; 6-42; 7-43; 8-73; 9-79; 10-79.
బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 3-0-15-2; అండర్సన్ 3-0-18-0; సాన్‌ట్నర్ 4-0-11-4; ఇలియట్ 2-0-9-0; ఆడమ్ మిల్నే 2.1-0-8-1; సోధి 4-0-18-3.
2.. టి20 ప్రపంచకప్‌లో ఆతిథ్య జట్టు తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇది రెండోసారి. 2009లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడింది.
5.. పొట్టి ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌తో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ ఓడింది.
79.. భారత్‌లో ఏ టి20 మ్యాచ్‌లోనైనా నమోదైన అత్యల్ప స్కోరు ఇదే.
9.. భారత్‌పై ఓ టి20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లు తొమ్మిది వికెట్లు తీయడం ఇదే ప్రథమం.
ఇదేం పిచ్ బాబోయ్..!
భారత్, న్యూజిలాండ్‌ల మధ్య తొలి మ్యాచ్‌లో పిచ్ దారుణంగా ఉంది. టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆఖరి సెషన్‌లో కూడా ఇంత దారుణంగా స్పిన్ తిరగదు. దక్షిణాఫ్రికాతో టెస్టు మూడో రోజే ముగిసిన తర్వాత ఐసీసీ నుంచి విదర్భ క్రికెట్ సంఘానికి చీవాట్లు పడ్డాయి. అయినా బీసీసీఐ అధ్యక్షుడి సొంత సంఘం విదర్భ తీరు మారలేదు. ‘బ్యాటింగ్ పిచ్‌లు తయారు చేయాలని ఐసీసీ నుంచి ఆదేశం వచ్చింది’ అని చెప్పిన క్యూరేటర్ ఈ మ్యాచ్ తర్వాత తనని తాను ఎలా సమర్థించుకుంటారో చూడాలి. టి20 మ్యాచ్ అంటేనే పరుగుల వినోదం. ఇక ప్రపంచకప్ అంటే అభిమానుల అంచనాలు భారీగా ఉంటాయి. ఇలాంటి పిచ్‌లపై టోర్నీ నిర్వహిస్తే అభిమానులకు ఏమాత్రం వినోదం దక్కదు.