ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.
ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్‌కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్‌కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.
న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్‌తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
ఇదిలా ఉంటే, క్రైస్ట్‌చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment