WT20 WC Ind vs NZ: కివీస్‌ ముందు తలవంచారు | Indian womens team lost in the first match of T20 World Cup | Sakshi
Sakshi News home page

WT20 WC Ind vs NZ: కివీస్‌ ముందు తలవంచారు

Oct 5 2024 4:09 AM | Updated on Oct 5 2024 10:03 AM

Indian womens team lost in the first match of T20 World Cup

టి20 వరల్డ్‌ కప్‌ తొలి పోరులో భారత మహిళల జట్టు పరాజయం

58 పరుగులతో న్యూజిలాండ్‌ గెలుపు

హర్మన్‌ప్రీత్‌ బృందం సమష్టి వైఫల్యం

రేపు పాకిస్తాన్‌తో మ్యాచ్‌  

ప్రపంచకప్‌కు ముందు ఈ ఏడాది ఆడిన 13 మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌ ఒకటే గెలవగా... 17 మ్యాచ్‌ల్లో 11 గెలిచిన భారత్‌ ఫేవరెట్‌గా అడుగు పెట్టింది. కానీ అసలు సమయంలో మాత్రం టీమిండియా చేతులెత్తేసి టోర్నీని ఓటమితో మొదలు పెట్టింది. 

ముందుగా పేలవ బౌలింగ్‌తో కివీస్‌ మెరుగైన స్కోరు సాధించే అవకాశం కల్పించిన మన మహిళలు... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ పూర్తిగా తడబడ్డారు. టాప్‌–5 స్మృతి, హర్మన్, షఫాలీ, జెమీమా, రిచా సమష్టిగా విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు. 

దుబాయ్‌: తొలి వరల్డ్‌ కప్‌ గెలిచే లక్ష్యంతో ఉత్సాహంగా బరిలోకి దిగిన భారత మహిళల జట్టుకు తొలి పోరులోనే షాక్‌ తగిలింది. శుక్రవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 58 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 

కెప్టెన్‌ సోఫీ డివైన్‌ (36 బంతుల్లో 57 నాటౌట్‌; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా... ఓపెనర్లు జార్జియా ప్లిమ్మర్‌ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సుజీ బేట్స్‌ (24 బంతుల్లో 27; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం భారత్‌ 19 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌటైంది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ (15)దే అత్యధిక స్కోరు. రేపు తమ రెండో లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్‌ ఆడుతుంది.
  
రాణించిన ఓపెనర్లు 
న్యూజిలాండ్‌ ఓపెనర్లు ప్లిమ్మర్, బేట్స్‌ జట్టుకు ఘనమైన ఆరంభం అందించారు. పూజ వేసిన తొలి ఓవర్లో బేట్స్‌ రెండు ఫోర్లు కొట్టగా, దీప్తి ఓవర్లో ప్లిమ్మర్‌ ఫోర్, సిక్స్‌ బాదింది. అరుంధతి తొలి ఓవర్లో ప్లిమ్మర్‌ మరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 55 పరుగులకు చేరింది. 

ఇదే ఓవర్లో బేట్స్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కీపర్‌ రిచా వదిలేసింది. వీరిద్దరిని నిలువరించేందుకు ఇబ్బంది పడిన భారత బౌలర్లకు ఎట్టకేలకు ఎనిమిదో ఓవర్లో తొలి వికెట్‌ దక్కింది. మొదటి వికెట్‌కు 46 బంతుల్లో 67 పరుగులు జోడించిన ఓపెనర్లు ఒకే స్కోరు వద్ద వెనుదిరిగారు. 

ఆ తర్వాత అమేలియా కెర్‌ (13) ప్రభావం చూపలేదు కానీ డివైన్‌ దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. ఆశ శోభన, రేణుక ఓవర్లలో డివైన్‌ రెండేసి ఫోర్లు కొట్టగా... ఆమె, హ్యాలీడే (16) కలిసి దీప్తి ఓవర్లో మూడు ఫోర్లతో 16 పరుగులు రాబట్టారు. చివరి ఓవర్లో మరో ఫోర్‌తో డివైన్‌ 33 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.  

టపటపా... 
మ్యాచ్‌ గెలవాలంటే వరల్డ్‌ కప్‌ చరిత్రలో రెండో అత్యధిక ఛేదన రికార్డును నమోదు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన భారత్‌కు ఏదీ కలిసి రాలేదు. పవర్‌ప్లే ముగిసేలోపే జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. కార్సన్‌ తన తొలి రెండు ఓవర్లలో షఫాలీ వర్మ (2), స్మృతి మంధాన (12)లను వెనక్కి పంపించగా... మూడో స్థానంలో బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్‌ కూడా విఫలమైంది. 

అంపైర్‌ ఎల్బీ నిర్ణయాన్ని ఆమె సవాల్‌ చేసినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత జెమీమా (13) కూడా ప్రభావం చూపలేకపోయింది. 11వ ఓవర్‌ చివరికి బంతి రిచా ఘోష్‌ (12) రూపంలో  తమ ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఆ తర్వాత ఓటమి దిశగా సాగిపోయింది. 

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: బేట్స్‌ (సి) శ్రేయాంక (బి) అరుంధతి 27; ప్లిమ్మర్‌ (సి) స్మృతి (బి) శోభన 34; అమేలియా కెర్‌ (సి) పూజ (బి) రేణుక 13; డివైన్‌ (నాటౌట్‌) 57; హ్యాలీడే (సి) స్మృతి (బి) రేణుక 16; గ్రీన్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–67, 2–67, 3–99, 4–145. బౌలింగ్‌: పూజ వస్త్రకర్‌ 1–0–9–0, రేణుకా సింగ్‌ 4–0–27–2, దీప్తి శర్మ 4–0–45–0, అరుంధతి రెడ్డి 4–0–28–1, ఆశా శోభన 4–0–22–1, శ్రేయాంక పాటిల్‌ 3–0–25–0.  

భారత్‌ ఇన్నింగ్స్‌: స్మృతి (సి) గ్రీన్‌ (బి) కార్సన్‌ 12; షఫాలీ (సి అండ్‌ బి) కార్సన్‌ 2; హర్మన్‌ప్రీత్‌ (ఎల్బీ) (బి) రోజ్‌మేరీ 15; జెమీమా (సి) గ్రీన్‌ (బి) తహుహు 13; రిచా (సి) డివైన్‌ (బి) తహుహు 12; దీప్తి (సి) డివైన్‌ (బి) తహుహు 13; అరుంధతి (సి) బేట్స్‌ (బి) రోజ్‌మేరీ 1; పూజ (బి) కెర్‌ 8; శ్రేయాంక (సి) (సబ్‌) పెన్‌ఫోల్డ్‌ (బి) రోజ్‌మేరీ 7; శోభన (నాటౌట్‌) 6; రేణుక (సి) డివైన్‌ (బి) రోజ్‌మేరీ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్‌) 102. వికెట్ల పతనం: 1–11, 2–28, 3–42, 4–55, 5–70, 6–75, 7–88, 8–90, 9–102, 10–102. బౌలింగ్‌: జెస్‌ కెర్‌ 3–0–13–0, ఈడెన్‌ కార్సన్‌ 4–0–34–2, రోజ్‌మేరీ 4–0–19–4, అమేలియా కెర్‌ 4–0–19–1, తహుహు 4–0–15–3. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement