నేటి నుంచి మహిళల టి20 ప్రపంచకప్ టోర్నీ
బరిలో మొత్తం 10 జట్లు ∙మరోసారి ఫేవరెట్‌గా ఆస్ట్రేలియా
ఆశల పల్లకిలో భారత్ ∙తొలి రోజు రెండు మ్యాచ్‌లు
స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ధనాధన్ ఫార్మాట్‌లో విశ్వ కిరీటం కోసం మహిళల క్రికెట్ జట్లు మహా సమరానికి సిద్ధమయ్యాయి. టి20ల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఆస్ట్రేలియా... అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్‌ను ఈసారైనా సొంతం చేసుకునేందుకు భారత్... రెండోసారి విశ్వవిజేతగా నిలిచేందుకు ఇంగ్లండ్, వెస్టిండీస్... అంచనాలను తలకిందులు చేసి సంచలనం సృష్టించాలనే లక్ష్యంతో న్యూజిలాండ్... నేటి నుంచి మొదలయ్యే టి20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నాయి.
18 రోజుల పాటు సాగనున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. గత ఏడాది దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్‌కప్‌లో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైన టీమిండియా... ఈసారి అస్త్రశ్రస్తాలతో సిద్ధమైంది. సుదీర్ఘ విరామం తర్వాత భారత పురుషుల జట్టు ఇటీవల టి20 ప్రపంచకప్ నెగ్గగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా అలాంటి ఆటతీరుతోనే అదరగొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు!
దుబాయ్: క్రీడాభిమానులను అలరించేందుకు మహిళల టి20 ప్రపంచకప్ రూపంలో మరో మెగా ఈవెంట్‌కు నేడు తెర లేవనుంది. ఆరోసారి ట్రోఫీ చేజిక్కించుకున్న ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా... తొలిసారి ‘విశ్వ విజేత’ హోదా దక్కించుకోవాలని భారత మహిళల జట్టు పట్టుదలతో ఉంది.
ఇప్పటి వరకు జరిగిన 8 ప్రపంచకప్‌లలోనూ పాల్గొన్న టీమిండియా ఒక్కసారి (2020లో) రన్నరప్‌గా నిలిచింది. ప్రతిసారిలాగే ఈసారి కూడా భారత జట్టు భారీ అంచనాలతో బరిలో దిగనుంది. షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్‌నకు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా... ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి నెలకొనడంతో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మార్చారు.
పోటీల్లో భాగంగా గురువారం తొలి రోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి పోరులో స్కాట్లాండ్‌తో బంగ్లాదేశ్... రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో శ్రీలంక తలపడతాయి. శుక్రవారం న్యూజిలాండ్‌తో పోరుతో హర్మన్‌ప్రీత్ బృందం టైటిల్ వేట ప్రారంభించనుంది.
ఎదురులేని ఆ్రస్టేలియా
2009లో తొలిసారి మహిళల టి20 ప్రపంచకప్ నిర్వహించారు. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిదిసార్లు ఈ టోర్నీ జరిగింది. ఆ్రస్టేలియా రికార్డు స్థాయిలో ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023లో) విజేతగా నిలిచింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో స్టార్ ప్లేయర్లు అందుబాటులో ఉండటం... చివరి బంతి వరకు ఓటమిని ఒప్పుకోని తత్వం ఆస్ట్రేలియా జట్టును మిగిలిన వాటికంటే భిన్నంగా నిలిపింది.
ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆ్రస్టేలియాపై అడపా దడపా విజయాలు సాధించిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ వంటి జట్లు... వరల్డ్ కప్‌లో మాత్రం ఆసీస్ ముందు నిలువలేకపోతున్నాయి. గత టోర్నీలో ఆ్రస్టేలియా జట్టుకు మెగ్‌లానింగ్ సారథ్యం వహించగా... తాజా టోరీ్నలో అలీసా హీలీ జట్టును నడిపించనుంది.
ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, ఎలీస్ పెరీ, బెత్ మూనీ వంటి ప్లేయర్లతో ఆ్రస్టేలియా దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరంతా కలిసి కట్టుగా కదం తొక్కితే ఆసీస్ మరోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంకలతో కలిసి ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’లో ఉంది.
ఇంగ్లండ్ మెరిపించేనా?
తొలి మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లండ్ ఆ తర్వాత మరోసారి చాంపియన్ కాలేకపోయింది. మరో మూడుసార్లు (2012, 2014, 2018లో) ఫైనల్‌కు చేరినా... ఆ్రస్టేలియా అడ్డంకిని అధిగమించ లేకపోయింది. సోఫీ ఎకెల్‌స్టోన్, కెప్టెన్ హీతర్ నైట్, అలీస్ కాప్సీ, అమీ జోన్స్, నటాలియా బ్రంట్, డానీ వ్యాట్‌తో కూడిన ఇంగ్లండ్ జట్టు తమదైన రోజున ఎంతటి మేటి ప్రత్యర్థినైనా మట్టికరిపించగలదు.
బంగ్లాదేశ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌తో కలిసి ఇంగ్లండ్ గ్రూప్ ‘బి’లో పోటీపడనుంది. ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేకపోయిన దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలని చూస్తోంది. 2009, 2010లలో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక ఇటీవల మహిళల ఆసియాకప్‌లో భారత జట్టుకు షాక్ ఇచ్చి చాంపియన్‌గా అవతరించిన శ్రీలంక సంచలన ప్రదర్శన కొనసాగించాలని భావిస్తోంది.
హర్మన్ సేన సాధించేనా?
అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడైన విజయాలు సాధిస్తున్న భారత మహిళల జట్టుకు ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షలాగే ఊరిస్తోంది. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న టీమిండియా... మెగా టోర్నీల్లో విజేతగా నిలవలేకపోతోంది. గత ఎనిమిది టోర్నీల్లోనూ పాల్గొన్న భారత్ కేవలం ఒక్కసారి (2020లో) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. భారత్‌ను పోలి ఉన్న యూఏఈలో టోర్నీ జరుగుతుండటం భారత్‌కు సానుకూలాంశం.
ఇప్పటి వరకు జరిగిన ఎనిమిది ప్రపంచకప్‌లలోనూ ఆడిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అంచనాల ఒత్తిడి అధికంగా ఉంది. వైస్ కెపె్టన్ స్మృతి మంధానతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తి శర్మ సమష్టిగా సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన ఆసియాకప్ ఫైనల్లో ఓటమి అనంతరం ప్రత్యేక శిబిరంలో ఫీల్డింగ్, ఫిట్‌నెస్‌పై మరింత సాధన చేసిన హర్మన్ ప్రీత్ బృందం ఈ టోర్నీ ఎలాంటి ప్రదర్శన చేస్తుందో వేచి చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment