
‘చాంపియన్స్’ తర్వాతే కుంబ్లేపై నిర్ణయం
చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే సహా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే
న్యూఢిల్లీ: చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే సహా భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిని కొనసాగించడంపై చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాతే బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది. కోచ్‌గా కుంబ్లే ఏడాది కాంట్రాక్ట్ వచ్చే జూన్‌తో ముగుస్తుంది. ‘గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం కోచ్‌గా కుంబ్లేకు చాంపియన్స్ ట్రోఫీనే ఆఖరి టోర్నీ అవుతుంది. అయితే ఆయనను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు. టోర్నీ ముగిసిన తర్వాత జరిగే బోర్డు సర్వసభ్య సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటాం.
అయినా ఈ విషయంలో సీఓఏ అనుమతి కూడా తప్పనిసరి’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. భారత కోచ్‌గా గత ఏడాది కాలంలో కుంబ్లే అద్భుత ఫలితాలు సాధించారు. మరోవైపు సెలక్షన్ కమిటీలో ముగ్గురే సభ్యులు ఉండటం పట్ల వస్తున్న సమస్యలను కొన్ని రాష్ట్ర సంఘాలు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.