
కుంబ్లే-కోహ్లీ కాంబినేషన్ సూపర్
ముంబై: భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్గా అనిల్ కుంబ్లేను నియమించడాన్ని ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ఆడం గిల్క్రిస్ట్ ప్రశంసించాడు. అనిల్ కుంబ్లే, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కాంబినేషన్లో టీమిండియా విదేశీగడ్డపై టెస్టు క్రికెట్ రికార్డును మెరుగుపరుచుకుంటుందని, ఇప్పటికే ఆ సంకేతాలు వెలువడ్డాయని అన్నాడు.
కుంబ్లే గౌరవనీయ క్రికెటర్గా భారత జట్టును సరైన దిశలో నడిపిస్తాడని గిల్క్రిస్ట్ చెప్పాడు. కుంబ్లే, కోహ్లీ కాంబినేషన్ బాగా పనిచేస్తుందని చెప్పడానికి.. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా సాధించిన విజయమే నిదర్శనమని అన్నాడు. హెడ్ కోచ్గా కుంబ్లే నియమితుడయ్యాక, కోహ్లీ సారథ్యంలో టీమిండియా టెస్టు సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ గడ్డపై భారత్ ఆ జట్టును ఓడించడంతో పాటు మళ్లీ నెంబర్ వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది.
కోహ్లీకి మూడు ఫార్మాట్లలో జట్టు పగ్గాలు అప్పగించి ఒత్తిడి పెంచరాదని గిల్క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. 'పరిమిత ఓవర్ల కెప్టెన్గా ధోనీ ఉన్నాడు. కెప్టెన్గా అతన్ని తొలగించడానికి ఏ కారణం లేదు' అని అన్నాడు.