భారత జట్టు కోచ్ రేసులోకి కుంబ్లే
దరఖాస్తు చేసిన దిగ్గజ స్పిన్నర్
ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక వ్యవహారం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలి వరకు డెరైక్టర్‌గా చక్కటి విజయాలు అందించిన రవిశాస్త్రితో పాటు గతంలో కోచ్‌గా పని చేసిన సందీప్ పాటిల్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తుండగా... ఇప్పుడు దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకొచ్చాడు. బీసీసీఐకి దరఖాస్తు చేసిన 57 మందిలో కుంబ్లే పేరు కూడా ఉన్నట్లు తెలిసింది.
కుంబ్లే ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. 18 ఏళ్ల కెరీర్ తర్వాత 2008లో రిటైర్ అయిన కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లతో భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా పని చేసిన అనంతరం ముంబై ఇండియన్స్‌కు కూడా మెంటార్‌గా పని చేశాడు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన కుంబ్లే ఇప్పుడు జాతీయ జట్టుతో నేరుగా కలిసి పని చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు.
అధికారికంగా కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా కెరీర్ రికార్డే కుంబ్లే అతి పెద్ద బలంగా భావించవచ్చు. ధోని, కోహ్లిలతో కలిసి ఆడిన అనుభవం కూడా అతనికి కోచ్ ఎంపిక విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది.