ప్రపంచకప్‌ కంటే కఠినం! | Virat Kohli-led Indian cricket team all set for ICC Champions Trophy in England, see pics | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ కంటే కఠినం!

Published Thu, May 25 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

ప్రపంచకప్‌ కంటే కఠినం!

ప్రపంచకప్‌ కంటే కఠినం!

కోలుకునే అవకాశం ఉండదు
చాంపియన్స్‌ ట్రోఫీపై కోహ్లి
టైటిల్‌ నిలబెట్టుకుంటామన్న కెప్టెన్‌
ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు


నాలుగేళ్ల క్రితం యువ భారత్‌ జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో అజేయ ఆటతీరుతో విజేతగా నిలిచింది. ఒక్క మ్యాచ్‌లోనూ కనీస పోటీ కూడా ఎదుర్కోకుండా ఐదుగురు ప్రత్యర్థులను అలవోకగా ఓడించి టోర్నీలో తమ సత్తా చాటింది. ఇప్పుడు ఆ ఐసీసీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు మరో సారథి నేతృత్వంలో టీమిండియా సన్నద్ధమైంది. నాటి జట్టులోని సభ్యుల్లో ఎక్కువ మంది ఈసారి కూడా భాగం కాగా... అదే ప్రదర్శనను పునరావృతం చేసే లక్ష్యంతో మళ్లీ ఇంగ్లండ్‌కు భారత్‌ బయల్దేరింది.  

ముంబై: వన్డే వరల్డ్‌ కప్‌తో పోలిస్తే చాంపియన్స్‌ ట్రోఫీలోనే పోటీ తీవ్రంగా ఉంటుందని భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అనే ముద్రతో ఒత్తిడి పెంచుకోకుండా ఆడి విజయం సాధిస్తామని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. జూన్‌ 1 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీ కోసం భారత బృందం బుధవారం ఇంగ్లండ్‌కు పయనమైంది. ఈ నేపథ్యంలో జట్టు విజయావకాశాలపై కోహ్లి మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే...

చాంపియన్స్‌ ట్రోఫీలో పోటీపై...
ఒక్క మాటలో చెప్పాలంటే వరల్డ్‌కప్‌ కంటే కూడా ఇది కఠినం. ఎందుకంటే అక్కడ పొరపాటున వెనుకబడ్డా లీగ్‌ దశలో కోలుకునేందుకు మళ్లీ అవకాశం ఉంటుంది. కానీ ఈ టోర్నీలో స్వల్ప వ్యవధిలో ఎనిమిది అగ్రశ్రేణి జట్లు తలపడతాయి. తొలి మ్యాచ్‌ నుంచి అత్యుత్తమ ఆటతీరు చూపించాలి. అందులో ఏమాత్రం తేడా వచ్చినా ముందుకెళ్లడం కష్టం.

డిఫెండింగ్‌ చాంపియన్‌ కావడంపై...
మేం టైటిల్‌ను నిలబెట్టుకోవడం కోసం వెళుతున్నాం అనే ఆలోచననే ముందుగా తొలగించాల్సి ఉంది. 2013లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆటను ఆస్వాదించాం కాబట్టి అంత మంచి విజయం దక్కింది. కొత్త ఓపెనింగ్‌ జోడి శిఖర్‌ ధావన్, రోహిత్‌ శర్మ అద్భుతంగా రాణించడం, రవీంద్ర జడేజా, అశ్విన్‌ల బౌలింగ్, చక్కటి ఫీల్డింగ్‌ గత టోర్నీలో మమ్మల్ని చాంపియన్‌గా నిలబెట్టాయి. జట్టులో ఇప్పుడు కొందరు మారినా మా ఆలోచనా విధానంలో మార్పు లేదు. టెస్టుల్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాం. సిరీస్‌ గెలిచాక కూడా అలసత్వం ప్రదర్శించలేదు. ఇప్పుడు అదే దూకుడును వన్డేలకు వర్తింపజేస్తే కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి.

ధోని, యువరాజ్‌లపై...
వాళ్లిద్దరూ జట్టుకు మూలస్థంభాల్లాంటివారు. ధోని, యువీల అనుభవాన్ని నేను ఎలాగైనా ఉపయోగించుకోగలను. ఇన్నింగ్స్‌ను ఎలా నిర్మించాలి, మ్యాచ్‌ ఎలా గెలవాలి, కష్టాల్లో జట్టును ఎలా ఆదుకోవాలో వారికి బాగా తెలుసు. మిడిలార్డర్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తూ వారు స్వేచ్ఛగా ఆడగలరు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అది కనిపించింది. వారి ఆలోచనా ధోరణి జట్టుకు మేలు చేస్తుంది.

టోర్నీకి సన్నాహకంగా ఐపీఎల్‌...
ఈ రెండు ఫార్మాట్‌లు పూర్తిగా వేరు. వన్డే, టి20 మధ్య పోలిక అనవసరం. అయితే ఏదో రూపంలో మైదానంలో ఆడుతున్న అనుభవం మ్యాచ్‌లకు సిద్ధంగా ఉండేందుకు మాత్రం పనికొస్తుంది. ఐపీఎల్‌లో కూడా పోటీ ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లను ఎదుర్కొంటాం కాబట్టి బాగా ఆడితే ఆత్మవిశ్వాసం పెరిగేందుకు దోహదం చేస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించదు. నా వరకు తాజా ఐపీఎల్‌ ఎన్నో పాఠాలు నేర్పించింది. ప్రతీ మ్యాచ్‌లో మనం అనుకున్నవన్నీ చేయలేమని, మానవమాత్రులకు కొన్ని పరిమితులు ఉంటాయని అర్థమైంది. కొన్నిసార్లు వెనక్కి తగ్గాల్సి వచ్చింది కూడా. వైఫల్యాల వల్ల కెప్టెన్‌ చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై...
బంతిని ఎదుర్కొనేటప్పుడు ఎదుట ఉన్న నాన్‌స్ట్రైకర్‌ గురించే ఆలోచన రాదు. అలాంటప్పుడు మన అదుపులో లేని, మైదానం బయట జరిగే విషయాల గురించి ఏమని ఆలోచించగలం. క్రికెటర్లుగా మాకు ఇష్టమైన ఆట ఆడటమే మా పని. భారత్, పాక్‌ మ్యాచ్‌పై అంచనాలు, ఉత్కంఠ ఎప్పుడూ ఉండేవే. అభిమానులకు అది చాలా కీలకమైనది కావచ్చు. కానీ మా దృష్టిలో అన్ని మ్యాచ్‌లలాంటిదే. మేమేమీ మొదటిసారి తలపడటం లేదు.  ప్రత్యర్థి విషయంలో మా ఆలోచనలు, సన్నాహాల విషయంలో తేడా ఉండదు. అది ఏ జట్టయినా ఒకటే. ప్రత్యేకంగా ఈ మ్యాచ్‌ కోసం స్ఫూర్తి పొందాల్సిన అవసరం కూడా లేదు. గెలవాలనే తపన ఉంటే సరిపోతుంది తప్ప మరీ ఉద్వేగపడిపోకూడదు.

వైఫల్యాన్ని జీవన్మరణ సమస్యగా ఎందుకు చూస్తారు?
విరాట్‌ కోహ్లి అద్భుత కెరీర్‌లో 2014 ఇంగ్లండ్‌ పర్యటన ఒక మచ్చగా మిగిలిపోయింది. ఈ టూర్‌ మొత్తం అతను ఘోరమైన ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత కోహ్లి ఇప్పుడు మళ్లీ ఇంగ్లండ్‌కు వెళుతున్నాడు. నాటి గాయాలు మానే విధంగా లెక్క సరి చేస్తారా అని అడిగిన ప్రశ్నకు విరాట్‌ ఘాటుగా సమాధానమిచ్చాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మా మనసులో అలాంటి ఆలోచనలు ఏమీ ఉండవు కానీ చుట్టూ ఉన్న వాతావరణం మా ప్రదర్శనను జీవన్మరణ సమస్యగా మార్చేస్తుంది.

ముఖ్యంగా ఉపఖండపు క్రికెటర్లకు ఈ పరిస్థితి ఎదురవుతుంది. నేను భారత్‌లో విఫలమైతే ఎవరూ పట్టించుకోరు గానీ అదే విదేశాల్లో విఫలమైతే మెడపై కత్తి వేలాడుతూ ఉంటుంది. ఈ విషయం నాకు అస్సలు అర్థం కాదు. నాకు సంబంధించి నేను ఏదో సాధించి చూపాలనేదాన్ని నమ్మను. ప్రపంచంలో ఏ మూలన ఆడినా భారత జట్టును గెలిపించడమే ఏకైక  లక్ష్యం’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement