సన్నాహాలు లేకపోతేనేమి... | WTC final should be a best-of-three affair in the long run | Sakshi
Sakshi News home page

సన్నాహాలు లేకపోతేనేమి...

Published Thu, Jun 3 2021 4:37 AM | Last Updated on Thu, Jun 3 2021 4:37 AM

WTC final should be a best-of-three affair in the long run - Sakshi

స్వదేశంలో రెండు వారాల క్వారంటైన్‌... ఇంగ్లండ్‌ చేరిన తర్వాత మరో పది రోజుల క్వారంటైన్‌... హోటల్‌ గదుల్లో గడపడం మినహా సాధనకు అవకాశమే లేదు... భిన్నమైన వాతావరణంలో ఆడబోయే ఆరు టెస్టులకు ముందు కనీసం ఒక్క వార్మప్‌ మ్యాచ్‌ కూడా లేదు. క్వారంటైన్‌ ముగిసిన తర్వాత అసలు ఆటకు ముందు ఎన్ని ప్రాక్టీస్‌ సెషన్లకు అవకాశం లభిస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కరోనా నేపథ్యంలో ఆంక్షల నడుమ కీలకపోరుకు ముందు భారత జట్టుకు సరైన సన్నాహాలే లేవు. అయితే ఇది తమకు సమస్య కాదని భారత కెప్టెన్‌ కోహ్లి చెబుతున్నాడు. గతంలో ఇంతకంటే ప్రతికూల పరిస్థితులను అధిగమించి విజయాలు సాధించామని కోహ్లి గుర్తు చేశాడు
.   
ముంబై: న్యూజిలాండ్‌తో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌... సుమారు మూడున్నర నెలల పాటు సాగే ఈ పర్యటన కోసం భారత క్రికెట్‌ జట్టు ప్రత్యేక విమానంలో బయలుదేరింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తొలిసారి జరుగుతుండగా... 2018 తర్వాత ఇంగ్లండ్‌లో టీమిండియా టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌కు వెళ్లే ముందు బుధవారం జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మీడియా సమావేశంలో మాట్లాడారు.  

ఈ పర్యటన కోసం మేం సరిగా సన్నద్ధం కాలేదనే అంశం గురించి ఎలాంటి ఆందోళన లేదు. సిరీస్‌ ప్రారంభానికి కేవలం మూడు రోజుల ముందు ప్రత్యర్థి దేశంలో అడుగు పెట్టిన సందర్భాలు గతంలో ఉన్నాయి. అలా వెళ్లి కూడా సిరీస్‌లో హోరాహోరీగా తలపడ్డాం. కాబట్టి ఇదంతా మాకు తెలుసు. ఇంగ్లండ్‌లో మొదటిసారి ఆడటం లేదు. అక్కడి పరిస్థితుల గురించి బాగా తెలుసు. పరిస్థితులు ఎలా ఉన్నా సరైన మానసిక దృక్పథంతో మైదానంలోకి అడుగు పెట్టడం ముఖ్యం. లేదంటే తొలి బంతికే అవుట్‌ కావచ్చు లేదా వికెట్లు తీయడం అసాధ్యంగా మారిపోవచ్చు.

మ్యాచ్‌కు ముందు నాలుగు ప్రాక్టీస్‌ సెషన్లకు మాత్రమే అవకాశం లభించినా ఫిర్యాదు వినిపించం. ఎందుకంటే ఒక జట్టుగా మేం ఏం చేయగలమో మాకు బాగా తెలుసు. సీనియర్‌ లేదా ‘ఎ’ జట్టు సభ్యులుగా అందరికీ ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. టెస్టు క్రికెట్‌ బాగా ఆడితే పరిస్థితులు పెద్ద సమస్య కాదు. ఆస్ట్రేలియా గడ్డపై అంతా వారికి అనుకూలంగా ఉంటే మేం గెలవలేదా. మాకన్నా ముందు న్యూజిలాండ్‌ అక్కడ టెస్టులు ఆడుతోంది కాబట్టి వారికి అనుకూలత ఉందంటే నేను నమ్మను. అలా గనక భావిస్తే మేం ఇక్కడి నుంచి విమానం ఎక్కడమే అనవసరం. నా దృష్టిలో ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయి.

బయో బబుల్‌ ఆటగాళ్లపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే దేశపు రెండు జట్లు ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల ఆడటం తప్పనిసరిగా మారిపోవచ్చేమో. మైదానంలో తీవ్రమైన ఒత్తిడి మధ్య ఆడి వచ్చిన తర్వాత హోటల్‌ గదికే పరిమితం కావడం, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండిపోవడం మానసికంగా చాలా ఇబ్బందికరం. ఆటకు దూరంగా కొద్దిసేపు ప్రశాంతంగా గడిపి కొత్త ఉత్సాహంతో రావడం అసాధ్యంగా మారింది. ఈ జట్టుకు గొప్పగా తీర్చిదిద్దడంలో మేం ఎంతో శ్రమించాం. అలాంటిది మానసిక సమస్యలతో ఆటగాళ్లు కుప్పకూలిపోవడం లాంటివి చూడలేం. నేను మానసికంగా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి కొంత విరామం కావాలని ఆటగాడు అడిగితే మేనేజ్‌మెంట్‌ సానుకూలంగా స్పందించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నా.
                
–కోహ్లి, భారత కెప్టెన్‌

మున్ముందు వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ను ‘బెస్టాఫ్‌ త్రీ’ విధానంలో మూడు టెస్టుల సిరీస్‌గా నిర్వహిస్తే బాగుంటుందని నా సూచన. ఒక జట్టు రెండున్నరేళ్ల శ్రమ ఫలితం తర్వాత అలా చేయడమే సరైన విధానం. దానికి అనుగుణంగా ఎఫ్‌టీపీ సిద్ధం చేయాలి. ప్రస్తుతానికి మాత్రం ఏకైక టెస్టులోనే పోరాటం. ఒకవేళ ఓడినా మేం ఇప్పటివరకు సాధించినదాని విలువ తగ్గిపోదు. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఇక్కడికి వచ్చారు. రాత్రికి రాత్రే ఈ టీమ్‌ గొప్పగా మారిపోలేదు. మొదటిసారి జరుగుతోంది కాబట్టి ఈ ఫైనల్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. మీ అసలు సత్తా టెస్టులే పరీక్ష పెడతాయి కాబట్టి ఈ మ్యాచ్‌ స్థాయి చాలా పెద్దది. క్వారంటైన్‌ నిబంధనలు ఆటగాళ్ల పరిస్థితిని ఇంకా కఠినంగా మారుస్తున్నాయి. తక్కువ వ్యవధిలో ఆరు టెస్టులు ఆడాల్సి రావడం సాధారణ విషయం కాదు. ఎంతో ఫిట్‌గా ఉన్నవారికి కూడా మానసికంగా విరామం అవసరం. ఆటలో విఫలమైన రోజు వస్తే ఇక కోలుకోవడం చాలా కష్టంగా మారిపోతుంది. కరోనా వల్ల ఇప్పుడు భారత్‌నుంచి రెండు జట్లు ఒకేసారి వేర్వేరు చోట్ల ఆడబోతున్నాయి. అయితే మున్ముందు టి20 క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు, ఎక్కువ జట్లు ఆడేందుకు దీనిని కొనసాగించాల్సి రావచ్చు కూడా.     
–రవిశాస్త్రి, హెడ్‌ కోచ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement