ప్రతీ మ్యాచ్ గెలిస్తేనే టోర్నీలో నిలుస్తాం: కోహ్లీ
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీని నిలబెట్టుకుంటామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. తన నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు నేడు (బుధవారం) ఇంగ్లండ్‌కు పయనం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని జట్లు పటిష్టంగానే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించడం కలిసొచ్చే అంశం. ట్రోఫీలో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీలు మాతో ఉండటం జట్టుకు అదనపు బలం.
వన్డే ర్యాంకింగ్స్ లో టాప్-8లో ఉన్న జట్లు ట్రోఫీలో ఆడుతాయి. గ్రూప్ లో అగ్రస్థానంలో ఉంటేనే టోర్నీలో నిలుస్తాం. జూన్ 4న పాకిస్తాన్ తో తొలి మ్యాచ్ ఆడబోతున్నాం. గత టోర్నీలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అశ్విన్, జడేజా బాగా ఆడారు' అని కోహ్లీ ప్రశంసించాడు. ఈ టోర్నీని తేలికగా తీసుకునే ఉద్దేశమే లేదని, తమ విజయాలను పాకిస్తాన్ తోనే మొదలుపెడతామని భారత కెప్టెన్ ధీమా వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ తీవ్ర ఒత్తిడిలో బరిలోకి దిగుతుంది. ఎంఎస్ ధోనీ నేతృత్వంలో 2013లో ఇంగ్లండ్ లోనే జరిగిన ట్రోఫీలో ఇంగ్లండ్ పైనే 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది.