ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టుల్లో సెంచరీలు మోత మోగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన సెకెండ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ రూట్ సెంచరీలతో మెరిశాడు.
తద్వారా ఇంగ్లండ్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్(34) చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డువైపు రూట్ అడుగులు వేస్తున్నాడు. లండన్ వేదికగా శ్రీలంకతో జరగనున్న మూడో టెస్టుకు అతడు సిద్దమవుతున్నాడు.
విరాట్ వర్సెస్ రూట్.. ఎవరు బెస్ట్?
అయితే తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లు పాల్గోన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరికి ఓ కఠినమైన ప్రశ్న ఎదురైంది. విరాట్ కోహ్లి వర్సెస్ జో రూట్.. ఇద్దరిలో ఎవరూ అత్యుత్తమ టెస్టు క్రికెటర్? అన్న ప్రశ్నను హోస్ట్ అడిగాడు.
వెంటనే వాన్ అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్‌గా జో రూట్‌ను ఎంచుకున్నాడు. కానీ గిల్లీ మాత్రం అందుకు అంగీకరించలేదు. విరాట్ కోహ్లినే టెస్టుల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని ఈ ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ అదిరిపోయే సమాధానమిచ్చాడు.
"రూట్ ఇంగ్లండ్‌లో అత్యుత్తమ ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వదేశంలో రూట్ గణాంకాలు చూస్తేనే ఆర్ధమవుతోంది. అతడు సాధించిన సెంచరీలలో సగానిని పైనా ఇంగ్లండ్‌లో చేసినవే. కానీ విరాట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా మెరుగ్గా రాణించగలడు. విరాట్ కోహ్లి పెర్త్‌లో ఆడిన ఇన్నింగ్స్ నాకు ఇప్పటికి బాగా గుర్తుంది.
పెర్త్ మైదానంలో నేను చూసిన అత్యుత్తమ సెంచరీలలో విరాట్ నాక్ ఒకటి. అది కూడా అతడు పెర్త్‌లో తన మొదటి మ్యాచ్‌లోనే కావడం విశేషం. అందుకే నా దృష్టిలో కోహ్లినే బెస్ట్ టెస్టు బ్యాటర్" అని గిల్లీ క్లబ్ ప్రైరీ ఫైర్ పోడ్‌కాస్ట్‌లోపేర్కొన్నాడు.
అయితే గిల్‌క్రిస్ట్ దెబ్బకు వాన్ తోకముడిచాడు. ఆస్ట్రేలియాలో విరాట్ బెస్ట్ అని, కానీ వేరే చోట రూటే అత్యుత్తమ టెస్టు బ్యాటర్ అని వాన్ చెప్పుకొచ్చాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లినే అత్యుత్తమ బ్యాటర్ అని వాన్, గిల్లీ ఇద్దరూ అంగీకరించడం గమనార్హం.
గణాంకాల్లో రూట్.. అక్కడ మాత్రం విరాట్
కాగా టెస్టుల్లో రూట్ గణాంకాలతో పోలిస్తే విరాట్ కాస్త వెనకబడ్డాడనే చెప్పకోవాలి. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు 113 టెస్టులు ఆడి.. 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి ఆస్ట్రేలియా గడ్డపై 6 టెస్టు సెంచరీలు చేయడం గమనార్హం.
విదేశీ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరిటే ఉంది. ఇక రూట్ విషయానికి వస్తే.. 145 టెస్టులు ఆడి 12377 పరగులు చేశడు. అతడి ఇన్నింగ్స్‌లలో 34 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే ఆసీస్ గడ్డపై రూట్ ఇప్పటివరకు కనీసం ఒక్క టెస్టు సెంచరీ చేయలేదు. అతడి సాధించిన సెంచరీలలో 20కు పైగా ఇంగ్లండ్‌లో సాధించినవే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment