
బర్మింగ్‌హామ్ వేదికగా టీమిండియాతో జరిగిన రీ షెడ్యూల్డ్ టెస్ట్‌లో అజేయ శతకం బాది ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్నందించిన జో రూట్ ప్రస్తుత తరం టెస్ట్ క్రికెటర్లలో అత్యుత్తముడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గత రెండున్నరేళ్లుగా అతని గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. టీమిండియాతో జరిగిన 5 మ్యాచ్‌ల పటౌడీ ట్రోఫీలో 4 సెంచరీల సాయంతో 737 పరుగులు బాదిన రూట్.. గత 24 టెస్ట్‌ల్లో 11 సెంచరీలు, 28 అర్ధసెంచరీల సాయంతో 3000 పైచిలుకు పరుగులు సాధించి రికార్డుల మోత మోగిస్తున్నాడు.
గత కొంతకాలంగా మంచినీళ్ల ప్రాయంగా పరుగులు సాధిస్తున్న రూట్.. శతక్కొట్టుడు విషయంలో తన రూటే సపరేటు అని చాటాడు. ప్రస్తుత తరంలో తనకు పోటీగా చెప్పబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్‌లు కెరీర్ దుర్భర దశను ఎదుర్కొంటుండగా.. రూట్ వారి కళ్లెదుటే కెరీర్ అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. కోహ్లి, స్మిత్‌లు ఒక్కో పరుగు రాబట్టేందుకు నానా అవస్థ పడుతుంటే.. రూట్ మాత్రం పరుగుల వరద పారిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కోహ్లి టెస్ట్‌ల్లో సెంచరీ సాధించి దాదాపు మూడేళ్లవుతుంటే.. రూట్ ఈ మధ్యకాలంలో ఏకంగా 11 సెంచరీ బాదాడు.
మరోవైపు స్మిత్ సైతం ఏడాదిన్నరగా సెంచరీ మార్కు అందుకోలేక సతమతమవుతున్నాడు. కోహ్లి టెస్ట్‌ల్లో 27వ సెంచరీ నమోదు చేసే సమయానికి 17 సెంచరీలు మాత్రమే చేసిన రూట్.. కోహ్లిని అక్కడే పెట్టి తాను మాత్రం సెంచరీ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కోహ్లి, స్మిత్‌లు 27 టెస్ట్ శతకాలతో సమానంగా ఉంటే తాజాగా టీమిండియాపై సెంచరీతో రూట్ (28 సెంచరీలు) వారిద్దరిని అధిగమించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం 16వ స్థానంలో ఉన్న రూట్.. మరో మూడేళ్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్ట్ సెంచరీల (51) రికార్డును సులువుగా అధిగమించే అవకాశం ఉంది.
చదవండి: IND VS ENG 5th Test: కోహ్లి, స్మిత్‌లను దాటేసిన రూట్
Comments
Please login to add a commentAdd a comment