ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన బాబర్.. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 4000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. ప్రపంచ క్రికెట్‌లో కేవలం ఇద్దరే ఇద్దరు ఈ మైలురాయిని తాకారు. బాబర్‌కు ముందు విరాట్ కోహ్లి మాత్రమే 4000 టీ20 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ టాప్‌లో ఉండగా.. బాబర్ రెండో స్థానంలో నిలిచాడు. విరాట్ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేయగా.. బాబర్ 119 టీ20ల్లో 4023 పరుగులు చేశాడు. ఈ జాబితాలో విరాట్, బాబర్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ 151 టీ20ల్లో 3974 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. ప్రస్తుత తరం ఆటగాళ్లలో విరాట్, బాబర్, రోహిత్ తర్వాత పాల్ స్టిర్లింగ్ (3589), మహ్మద్ రిజ్వాన్ (3203), జోస్ బట్లర్ (3050), కేన్ విలియమ్సన్ (2547) టాప్-10లో ఉన్నారు.
ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఓవల్ వేదికగా నిన్న జరిగిన నాలుగో టీ20లో పాక్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఆదిల్ రషీద్ (4-0-27-2), లివింగ్‌స్టోన్ (3-1-17-2), మార్క్ వుడ్ (4-0-35-2) పాక్‌ను దెబ్బకొట్టారు. పాక్ ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజమ్ (36), ఉస్మాన్ ఖాన్ (38) ఓ మోస్తరుగా రాణించగా.. మొహమ్మద్ రిజ్వాన్ (23), ఇఫ్తికార్ అహ్మద్ (21), నసీం షా (16) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (45), జోస్ బట్లర్ (39) దూకుడుగా ఆడటంతో 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. విల్ జాక్స్ (20), జానీ బెయిర్‌స్టో (28 నాటౌట్), హ్యారీ బ్రూక్ (17 నాటౌట్) ఇంగ్లండ్ గెలుపుకు తమవంతు సహకారాన్నందించారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్‌కు మూడు వికెట్లు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment