కోహ్లి గొప్పతనం బ్రిటన్‌ చూడబోతోంది! | Kohli greatness is going to see Britain | Sakshi
Sakshi News home page

కోహ్లి గొప్పతనం బ్రిటన్‌ చూడబోతోంది!

Published Mon, Jul 30 2018 1:17 AM | Last Updated on Tue, Jul 31 2018 11:14 AM

Kohli greatness is going to see Britain - Sakshi

భారత జట్టుకు కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రవి శాస్త్రి ‘దూకుడు’ మంత్రాన్నే పఠిస్తున్నారు. కెప్టెన్‌ కోహ్లి ఆలోచనా ధోరణి కూడా ఇదే కావడంతో టీమిండియా టెస్టుల్లోనూ ప్రతీసారి విజయం కోసమే శ్రమిస్తోంది. ఈ క్రమంలో ఓటమి ఎదురైనా ‘డ్రా’ కోసం ఆడే ప్రయత్నం చేయడం లేదు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో దక్కిన విజయం కూడా అలాంటిదే. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కూడా అదే శైలి ఆటను ప్రదర్శిస్తామని రవిశాస్త్రి చెబుతున్నాడు.

లండన్‌: గత కొన్నేళ్లుగా టెస్టు క్రికెట్‌లో వివిధ జట్లు విదేశీ గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయి. సొంత మైదానాల్లో అద్భుతంగా చెలరేగి ఆ తర్వాతి ప్రత్యర్థి వేదికలపై మాత్రం కుప్పకూలిపోతున్నాయి. శ్రీలంకలో దక్షిణాఫ్రికా పతనం దీనికి తాజా ఉదాహరణ. అయితే భారత జట్టుకు మాత్రం ఎక్కడైనా రాణించే సామర్థ్యం ఉందని జట్టు హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి నమ్ముతున్నాడు. 2014తో పోలిస్తే అద్భుత బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన విరాట్‌ కోహ్లి ఈసారి ఇంగ్లండ్‌పై లెక్క సరి చేస్తాడని కూడా అతను అంటున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత్‌ విజయావకాశాలకు సంబంధించి వేర్వేరు అంశాలపై రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే... 

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌పై... 
చెమ్స్‌ఫోర్డ్‌లో వార్మప్‌ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో సుదీర్ఘ సంభాషణ సాగింది. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో చూపించిన పోరాటపటిమను ఇక్కడ కూడా ప్రదర్శించాల్సి ఉందని చెప్పాను. ఇక్కడికి వచ్చాక టి20లు, వన్డేల్లో చూపిన ప్రదర్శన మాలో ఉత్సాహాన్ని పెంచింది. విదేశీ గడ్డపై కూడా అద్భుతంగా రాణించగల సత్తా భారత జట్టుకు ఉందని మేమందరం నమ్మతున్నాం. ఇంగ్లండ్‌తో గత రెండు సిరీస్‌లలో మేం 0–4తో, 1–3తో ఓడిపోయిన విషయం గుర్తుంది. కానీ ఈసారి కచ్చితంగా అంతకంటే మెరుగ్గా ఆడగలం. గతంలోనూ, ఇకపై కూడా మా జట్టు దూకుడైన శైలిలో, బెరుకు లేకుండా ఆడుతుందని మళ్లీ మళ్లీ చెబుతున్నాను. ఈ జట్టులోని సభ్యుల్లో చాలా మంది గత కొంత కాలంగా ఇంగ్లండ్‌ గడ్డపై ఏదో రూపంలో (ఇండియా ‘ఎ’, కౌంటీలు) క్రికెట్‌ ఆడుతున్నారు కాబట్టి కొత్తగా అనిపించడం లేదు.  

ప్రస్తుతం ఇక్కడి పరిస్థితులపై... 
నేను దీనిని పూర్తిగా అంగీకరించను. పిచ్‌లు, అవుట్‌ ఫీల్డ్, వాతావరణం అన్నీ భిన్నంగానే ఉన్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా దానికి తగినట్లుగా మమ్మల్ని మేం మార్చుకోవడమే కీలకం. వాతావరణం ఎలా ఉన్నా ఇంగ్లండ్‌లో బంతి స్వింగ్‌ కావడం ఖాయం. దక్షిణాఫ్రికా సిరీస్‌ నుంచి ఏం నేర్చుకున్నామనేదే ముఖ్యం.  

భారత బ్యాటింగ్‌పై... 
ఇంగ్లండ్‌లో తొలి 20–25 ఓవర్లు చాలా కీలకం. ఇబ్బంది లేకుండా పట్టుదలతో నిలబడగలిగితే శుభారంభం లభించినట్లే. ఎస్సెక్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌ దానిని చూపించాడు. ఆ తర్వాత జట్టును మిడిలార్డర్, లోయర్‌ ఆర్డర్‌ నడిపించగలవు. రాహుల్‌ను మూడో ఓపెనర్‌గా తీసుకున్నాం. అయితే టాప్‌–4లో అతను ఎక్కడైనా ఆడవచ్చు. పుజారా తాజా ఫామ్‌పై ఆందోళన లేదు. అతను ఒక్క ఇన్నింగ్స్‌ బాగా ఆడితే ఇక అడ్డుండదు. అతను ఎంత సేపు క్రీజ్‌లో ఉంటే జట్టుకు అంత మంచిది. అతను నెమ్మదిగా ఆడటం గురించి ఆందోళన లేదు. మేం అతడిని ఉసేన్‌ బోల్ట్‌లాగే పరుగెత్తమని చెప్పడం లేదు. తన బాధ్యత ఏమిటో పుజారాకు బాగా తెలుసు.  

కోహ్లి ఆటపై... 
నాలుగేళ్ల క్రితం కోహ్లి ఘోరంగా విఫలమయ్యాడని నేను అంగీకరిస్తాను. అయితే ఆ తర్వాత అతను ఏమిటో గణాంకాలే చెబుతున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి ఎదిగాడు. అన్ని దేశాల్లో అలవోకగా పరుగులు సాధించాడు. దేన్నైనా ఎదుర్కోగల సత్తా ఇప్పుడు అతనిలో ఉంది. అదే జోరును ప్రదర్శించాలని అతను పట్టుదలగా ఉన్నాడు. ఒక కోచ్‌గా అతని బ్యాటింగ్‌లో కొత్తగా మార్పులు చేయాల్సిన అవసరమేమీ నాకు కనిపించలేదు. సరిగ్గా చెప్పాలంటే కోహ్లి గొప్పతనం ఏమిటో బ్రిటన్‌ ప్రపంచం ఇప్పుడు చూడబోతోంది.  

పేసర్ల గాయాలపై... 
భువనేశ్వర్, బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉంటే వన్డేల్లో కూడా ఫలితం భిన్నంగా ఉండేది. వీరిద్దరు అన్ని టెస్టులకు కూడా ఫిట్‌గా ఉండాలని మేం కోరుకున్నాం కానీ అది జరగడం లేదు. అయినా సరే మా పేస్‌ బౌలింగ్‌లో వైవిధ్యం, పదును ఉంది. ఇషాంత్‌ ముందుండి నడిపించగలడు. దక్షిణాఫ్రికాతో చివరి టెస్టులో అతను చాలా బాగా బౌలింగ్‌ చేశాడు. 2014లో లార్డ్స్‌లో అతను అద్భుత బౌలింగ్‌తో గెలిపించిన విషయం మరచిపోవద్దు. ఉమేశ్‌ ఇప్పటి వరకు ఇంగ్లండ్‌లో ఆడకపోయినా అతనిపై మాకు నమ్మకం ఉంది. షమీ ఫిట్‌గా ఉన్నాడు. హార్దిక్‌ పేస్‌ కూడా జట్టుకు పనికొస్తుంది. ఇక ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్‌ కూడా చాలా కీలకం. పిచ్‌తో సంబంధం లేకుండా అతని అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది.  

కుల్దీప్, పంత్‌ల ఎంపికపై... 
స్పిన్నర్‌ కుల్దీప్‌ తుది జట్టులో ఉంటాడా లేదా అని చెప్పలేను కానీ వన్డేల్లో ప్రదర్శనతో అతను ఆకట్టుకున్నాడు. టెస్టుల్లోనూ తనను తాను నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్న అతను మున్ముందు మరింత మెరుగవుతాడు. పంత్‌ను ఎంపిక చేయడం సాహసోపేత నిర్ణయం అంటే నేనొప్పుకోను. కొత్త కీపర్‌ను తీర్చి దిద్దాల్సిన అవసరం ఉంది. కుర్రాడు, దూకుడుగా ఆడి మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. ఇటీవల ‘ఎ’ జట్టు తరఫున కూడా రాణించాడు. చురుకైన అలాంటి ఆటగాడికి అవకాశం ఇస్తే తప్పేంటి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement