
లండన్: ఇంగ్లండ్ పర్యటనలో ఘోర పరాభవం మూటగట్టుకున్నా... టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ఈ సిరీస్‌కు ముందు 125 పాయింట్లతో టాప్‌లో ఉన్న భారత్ 1–4తో చిత్తుగా ఓడినా... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 115 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. సిరీస్‌కు ముందు 97 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ జట్టు 105 పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది.
సిరీస్‌లో 59.3 సగటుతో 593 పరుగులు చేసిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... బౌలింగ్‌లో ఇంగ్లండ్ పేసర్ అండర్సన్ కెరీర్ అత్యుత్తమ పాయింట్ల (903)తో టాప్‌లో నిలిచాడు. చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకాలు నమోదు చేసిన లోకేశ్ రాహుల్, రిషభ్ పంత్ తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. రాహుల్ 16 స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరగా... పంత్ ఏకంగా 63 స్థానాలు మెరుగుపరుచుకొని 111వ ర్యాంక్‌కు చేరాడు. కెరీర్ చివరి టెస్టులో రాణించిన ఇంగ్లండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్ పదో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్ నాలుగో స్థానానికి చేరాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు.
Comments
Please login to add a commentAdd a comment