
చాంపియన్స్ ట్రోఫీ భద్రతపై పునస్సమీక్ష
మాంచెస్టర్‌లో పేలుడు అనంతరం ఐసీసీ
దుబాయ్: వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ, మహిళల ప్రపంచకప్ భద్రతా ఏర్పాట్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మరోసారి సమీక్ష చేయనుంది. మాంచెస్టర్‌లో సోమవారం జరిగిన పేలుడులో 22 మంది మరణించారు. దీంతో ఐసీసీ కూడా అలర్ట్ అయ్యింది. అయితే మ్యాచ్‌లు జరిగే వేదికల్లో మాంచెస్టర్ లేకపోయినప్పటికీ ఎలాంటి పొరపాట్లకు తావీయకూడదని నిర్ణయించుకుంది. ‘మా టోర్నమెంట్ భద్రతా డైరెక్టరేట్ సలహా ప్రకారం ఈ రెండు టోర్నమెంట్లకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. రానున్న రోజుల్లో అధికారులతో కలిసి రక్షణ ఏర్పాట్లపై సమీక్షిస్తాం. మాంచెస్టర్ దాడుల్లో మృతి చెందిన వారికి సానుభూతి తెలుపుతున్నాం’ అని ఐసీసీ పేర్కొంది. జూన్ 1 నుంచి 18 వరకు చాంపియన్స్ ట్రోఫీ... జూన్ 24 నుంచి జూలై 23 వరకు మహిళల ప్రపంచకప్ ఇంగ్లండ్‌లోనే జరగనున్నాయి.