పాక్ ఆధిపత్యానికి కోహ్లీ చెక్ పెడతాడా!
న్యూఢిల్లీ: జూన్ 1 నుంచి మొదలు కానున్న చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ బరిలోకి దిగుతుంది. ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్ లలో దాయాది పాకిస్తాన్ పై ప్రతిసారి భారత్ విజయదుందుబి మోగించినా.. ఈ ట్రోఫీలో మాత్రం వారిదే పైచేయి.ఇప్పటివరకూ మూడుసార్లు భారత్-పాక్ తలపడగా రెండు మ్యాచ్ లు పాక్ నెగ్గగా, చివరగా జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు తొలి విజయం సాధించింది.
ఇప్పటివరకూ వన్డే ప్రపంచ కప్ లలో 6-0తో, ట్వంటీ 20 వరల్డ్ కప్ లో 5-0తో పాక్ పై భారత్ తమ సంపూర్ణ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ ట్రోఫీలో మాత్రం 2-1తో పాక్ కు మెరుగైన రికార్డు ఉంది. అందులోనూ ఈసారి కోహ్లీ సేన తమ తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాక్ తో తలపడనుంది. జూన్ 4న జరిగే మ్యాచ్ లో పాక్ పై నెగ్గి ధోనీ బాటలోనే కోహ్లీ భారత్ కు విజయాన్ని అందిస్తాడా అనేది చర్చనీయాంశంగా మారింది.
2004లో తొలి ఓటమి
నాలుగు గ్రూప్‌ల ఫార్మాట్ లో కెన్యాపై గెలిచినా, పాకిస్తాన్ చేతిలో ఓడటంతో భారత్ సెమీస్ చేరలేకపోయింది. ఎడ్జ్ బాస్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కేవలం రాహుల్ ద్రావిడ్(67) ఒక్కడే రాణించడంతో 50 ఓవర్లలో 200 పరుగులు చేసింది. షోయబ్ అక్తర్, నవీద్ ఉల్ హసన్ చెరో 4 వికెట్లతో భారత్ ను దెబ్బతీయగా, బ్యాటింగ్ లో మహ్మద్ యూసఫ్ చెలరేగడంతో పాక్ 3 వికెట్ల తేడాతో ఐసీసీ నిర్వహించే ఓ టోర్నీలో భారత్ పై నెగ్గింది.
2009లోనూ అదే ఫలితం
2008లోనే పాకిస్తాన్‌లో ఈ టోర్నీ జరగాల్సి ఉన్నా... అక్కడి పరిస్థితుల కారణంగా సాధ్యం కాకపోవడంతో ఏడాది ఆలస్యంగా వేదికను దక్షిణాఫ్రికాకు మార్చినా అదే ఫలితం ఎదురైంది. పాకిస్తాన్ చేతిలో ఓడటం, ఆపై వర్షంతో ఆసీస్ మ్యాచ్ రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు కోల్పోయింది. షోయబ్ మాలిక్ సెంచరీ(128), మహ్మద్ యూసఫ్ హాఫ్ సెంచరీ (87)లతో భారత బౌలర్లపై పైచేయి సాధించడంతో పాక్ 302 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 248 పరుగులకే ఆలౌట్ అయి దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ లోనూ రాహుల్ ద్రావిడ్ హాఫ్ సెంచరీ (76) రాణించాడు.
పాక్ ఆధిపత్యానికి ధోనీ సేన చెక్
ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు అద్భుత ప్రదర్శనతో మూడో ప్రయత్నంలో పాక్ పై నెగ్గింది. గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్‌లను జట్టు వరుసగా ఓడించింది. పాక్ పై తొలిసారి మ్యాచ్ ఓడిన ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో 165 పరుగులకే పరిమితమైంది. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 19.1 ఓవర్లలో 102 పరుగులు చేసిన భారత్ మరో 17 బంతులుండగానే 8 వికెట్లతో విజయం సాధించింది. వర్షం కారణంగా 20–20 ఓవర్ల ఆట మాత్రమే జరిగిన ఫైనల్లో ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌పై 5 పరుగులతో నెగ్గి రెండోసారి ఛాంపియన్ ట్రోపీలో విజేతగా నిలిచింది.
2017- ఇప్పుడు ఏం జరగనుందో..!
దాయాదులు భారత్-పాక్ లు నాలుగో పర్యాయం ఈ ట్రోఫీలో తలపడనున్నాయి. 1-2తో పాకిస్తాన్ పై ఉన్న గెలుపోటముల రికార్డును మెరుగు పరుచుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది. ట్రోఫీలో పాల్గొనేందుకు నేడు టీమిండియా, ఇంగ్లండ్ కు పయనం కానుంది. జూన్ 4న భారత్ తమ తొలి మ్యాచ్ లోనే పాక్ ను తలపడనున్నందున ఈ మ్యాచ్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.