ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో ప్రదర్శనను చూసి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. జూన్ లో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కంగుతినడం ప్రత్యర్ధి జట్ల వంతు అవుతుందన్నాడు. అలా చేస్తే ఎవరి గోతిని వారే తీసుకున్నట్లేనని హితవు పలికాడు.
'కోహ్లీ ఎప్పటికీ కళాత్మక ఆటగాడు. ఐపీఎల్ లో అతడు విఫలమైన మాట వాస్తవమే. కానీ అది ఆ టోర్నీకి మాత్రమే పరిమితమని గుర్తుంచుకోవాలి. కోహ్లీ లాంటి బ్యాట్స్ మెన్ ను ఎక్కువ రోజులు కట్టడి చేయడం ఏ బౌలర్ కు సాధ్యపడదని గుర్తుంచుకోవాలి. ఐపీఎల్ వైఫల్యంతో ఉన్న కోహ్లీ చాంపియన్స్ ట్రోఫీలో అద్బుతాలు సృష్టిస్తాడు. కానీ ఇంగ్లండ్ లో ఆడాలంటే నిలకడ కొనసాగించాలి. అప్పుడే పరుగులు రాబట్టడం సులువు. ఐపీఎల్ లో ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఫామ్ కొనసాగించడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఈ ట్రోఫీని ఆసీస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, ఫైనల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తలపడతాయని' వెటరన్ క్రికెటర్ మైక్ హస్సీ అభిప్రాయపడ్డాడు.