డబ్లిన్: ఇక నుంచి బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయించింది. ఈ తప్పిదానికి పాల్పడే వారు కనిష్టంగా ఆరు టెస్టులు లేదా 12 వన్డేల నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే 12 సస్పెన్షన్ పాయింట్లనూ విధిస్తారు. గతంలో ఈ తప్పిదం చేసిన వారిపై ఒక టెస్ట్, రెండు వన్డేల నిషేధం విధించేవారు. అంతేకాదు కొత్త ప్రవర్తనా నిబంధనావళిలో ఈ తప్పిదాన్ని లెవెల్-3కి పెంచారు.
ఈమేరకు డబ్లిన్‌లో సోమవారం ముగిసిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విధానాలతో క్రికెట్‌లో మరింత పారదర్శకత వస్తుందని ఆశిస్తున్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్‌సన్ తెలిపారు. కొన్ని నెలల క్రితం ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి సుదీర్ఘ కాలం నిషేధానికి గురి కాగా, ఇటీవల శ్రీలంక క్రికెటర్ చండిమాల్ బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలతో ఒక టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment