ఐసీసీ సమావేశం శనివారం
లండన్: ఐసీసీలో మార్పుల కోసం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కలిసి చేసిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు సింగపూర్‌లో శనివారం సమావేశం జరగనుంది. అందరూ ఒప్పుకోకపోతే ఈ సమావేశంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ చెప్పారు. నిజానికి ఈ ప్రతిపాదనల వల్ల అన్ని దేశాలకూ ఆర్థికంగా బాగా మేలు జరుగుతుందని, ఒప్పుకుంటే వారికే మంచిదని పరోక్షంగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లను ఉద్దేశించి క్లార్క్ వ్యాఖ్యానించారు.
బీసీసీఐతో ఎలాంటి ఒప్పందం లేదు: సీఎస్‌ఏ
జొహన్నెస్‌బర్గ్: ఐసీసీ వివాదాస్పద పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనల విషయంలో బీసీసీఐతో ఒప్పందం చేసుకున్నామనే ఆరోపణలను క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ)ఖండించింది. తమ సీఈవో హరూన్ లోర్గాట్‌కు పూర్తిగా అధికారాలు ఇస్తామనే హామీతో సీఎస్‌ఏ మెత్తబడిందనే ఆరోపణలు వినిపించాయి.
‘ప్రపంచ క్రికెట్‌కు ఇది కష్టకాలం. ఇతరులను అయోమయపరచడం, తప్పుదోవ పట్టించడం సరికాదు. బీసీసీఐతో సీఎస్‌ఏ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ప్రస్తుత ప్రతిపాదనల విషయాన్ని ఇతర సభ్య దేశాలతో చర్చించి మంచి పాలన, ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండే విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం’ అని సీఎస్‌ఏ అధ్యక్షుడు క్రిస్ నెంజానీ చెప్పారు. భారత్, ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులకు అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్న తాజా చర్యలపై తాము ఇదివరకే అసంతృప్తి తెలిపామని గుర్తుచేశారు.