johnsburg
-
బోల్ట్‌కంటే ధోనికే ఎక్కువ!
‘ఫోర్బ్స్’ విలువైన ఆటగాళ్ల జాబితా జొహన్నెస్‌బర్గ్: భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ‘ఆర్థికంగా విలువైన ఆటగాళ్ల’ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్’ ప్రకటించిన వివరాల ప్రకారం 2013లో ధోని 21 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 126 కోట్లు) ఆర్జించాడు. ఈ జాబితాలో ప్రపంచంలో ఫాస్టెస్ట్ అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌ను కూడా ధోని స్వల్ప తేడాతో వెనక్కి నెట్టడం విశేషం. బోల్ట్ సంపాదన 20 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 120 కోట్లు)గా ఉంది. ‘ఫోర్బ్స్’ లిస్ట్‌లో టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్, గోల్ఫ్ ఆటగాడు టైగర్‌వుడ్స్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. వీరు ఒక్కొక్కరు 46 మిలియన్ డాలర్లు (రూ. 276 కోట్లు) ఆర్జిస్తున్నారు. బాస్కెట్‌బాల్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ రెండో స్థానంలో ఉండగా... ఫిల్ మికెల్సన్ (గోల్ఫ్), షరపోవా (టెన్నిస్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. -
ఐసీసీ సమావేశం శనివారం
లండన్: ఐసీసీలో మార్పుల కోసం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కలిసి చేసిన కొత్త ప్రతిపాదనలపై చర్చించేందుకు సింగపూర్‌లో శనివారం సమావేశం జరగనుంది. అందరూ ఒప్పుకోకపోతే ఈ సమావేశంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ చెప్పారు. నిజానికి ఈ ప్రతిపాదనల వల్ల అన్ని దేశాలకూ ఆర్థికంగా బాగా మేలు జరుగుతుందని, ఒప్పుకుంటే వారికే మంచిదని పరోక్షంగా దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌లను ఉద్దేశించి క్లార్క్ వ్యాఖ్యానించారు. బీసీసీఐతో ఎలాంటి ఒప్పందం లేదు: సీఎస్ఏ జొహన్నెస్‌బర్గ్: ఐసీసీ వివాదాస్పద పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనల విషయంలో బీసీసీఐతో ఒప్పందం చేసుకున్నామనే ఆరోపణలను క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ)ఖండించింది. తమ సీఈవో హరూన్ లోర్గాట్కు పూర్తిగా అధికారాలు ఇస్తామనే హామీతో సీఎస్ఏ మెత్తబడిందనే ఆరోపణలు వినిపించాయి. ‘ప్రపంచ క్రికెట్‌కు ఇది కష్టకాలం. ఇతరులను అయోమయపరచడం, తప్పుదోవ పట్టించడం సరికాదు. బీసీసీఐతో సీఎస్ఏ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. ప్రస్తుత ప్రతిపాదనల విషయాన్ని ఇతర సభ్య దేశాలతో చర్చించి మంచి పాలన, ఇతరులకు నష్టం కలిగించకుండా ఉండే విధంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం’ అని సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెంజానీ చెప్పారు. భారత్, ఆసీస్, ఇంగ్లండ్ బోర్డులకు అధికారాన్ని కట్టబెట్టేలా ఉన్న తాజా చర్యలపై తాము ఇదివరకే అసంతృప్తి తెలిపామని గుర్తుచేశారు. -
విజయం ఊరిస్తోంది
మరో ఎనిమిది వికెట్లు...భారత్‌ను బెంబేలెత్తించేందుకు దక్షిణాఫ్రికా తయారు చేసిన ‘పిచ్’లో వారినే పడగొట్టేందుకు... భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ యువ ఆటగాళ్ల చేతుల ద్వారా విజయం అందుకునేందుకు... అవును... జొహన్నెస్‌బర్గ్ టెస్టు ఇప్పుడు దాదాపుగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది. రికార్డుల ప్రకారం చరిత్రలో ఏ జట్టూ ఛేదించని లక్ష్యాన్ని ముందుంచుకొని దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పరువు కాపాడుకునేందుకు పోరాడుతోంది. నాలుగు రోజులుగా ఆటపై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చివరి రోజు అదే పట్టుదలతో శ్రమిస్తే చిరస్మరణీయ విజయం చేజిక్కుతుంది. జొహన్నెస్‌బర్గ్: తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టును విజయం ఊరిస్తోంది. 458 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అల్విరో పీటర్సన్ (148 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు) తోపాటు డుప్లెసిస్ (10 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. పీటర్సన్, స్మిత్ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం చేసినా....వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. విజయానికి సఫారీలు మరో 320 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టు విజయావకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే చెలరేగుతున్న భారత పేసర్లను ఎదుర్కొని దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 421 పరుగులకు ఆలౌటైంది. నాలుగోరోజు భారత్ మరో 137 పరుగులు జత చేసింది. పుజారా (270 బంతుల్లో 153; 21 ఫోర్లు), కోహ్లి (193 బంతుల్లో 96; 9 ఫోర్లు) మూడో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ సెంచరీ కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, కలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. కోహ్లి సెంచరీ మిస్ 284/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో భారత ద్వయం పుజారా, కోహ్లి నాలుగో రోజు ఆటను కొనసాగించారు. కొద్దిసేపటికే స్టెయిన్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసి పుజారా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు కలిస్ 222 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కలిస్ బౌలింగ్‌లో కట్ చేయబోయి పుజారా కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ (6)ను క్లీన్‌బౌల్డ్ చేసి కలిస్ మళ్లీ దెబ్బ తీశాడు. అయితే తర్వాతి ఓవర్లో భారత్‌కు మరో షాక్ తగిలింది. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరదామనుకున్న కోహ్లి ఆశ నెరవేరలేదు. డుమిని బౌలింగ్‌లో లేట్ కట్ ఆడబోయిన కోహ్లి, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. రహానే (15)ను కూడా డుమిని అవుట్ చేయడంతో భారత్ 358/6 స్కోరుతో తొలి సెషన్ ముగించింది. జహీర్ మెరుపులు లంచ్ విరామం తర్వాత కెప్టెన్ ధోని (44 బంతుల్లో 29; 3 ఫోర్లు) సాధ్యమైనంత వేగంగా ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. భారత్ ఓవరాల్ ఆధిక్యం 400 పరుగులు దాటగానే అశ్విన్ (7) అవుట్ కాగా...ధాటిగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్‌కు యత్నించి ధోని డీప్ పాయింట్లో క్యాచ్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా జహీర్ ఖాన్ (31 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. తాహిర్, స్టెయిన్ల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాది ప్రేక్షకులను అలరించాడు. మరో వైపు ఇషాంత్ (4), షమీ (4)లను వరుస ఓవర్లలో తాహిర్ అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు టీ విరామం వరకు 11 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. జహీర్ వేసిన రెండో ఓవర్లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను అందుకోవడంలో కోహ్లి విఫలం కావడంతో స్మిత్ బతికిపోయాడు. శతక భాగస్వామ్యం టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా చక్కటి ఆటతీరు కనబర్చింది. పీటర్సన్ ధాటిగా ఆడగా, స్మిత్ (73 బంతుల్లో 44; 6 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో 84 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అయితే ఆ వెంటనే స్మిత్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే దూసుకొచ్చిన రహానే నేరుగా వికెట్లపైకి బంతిని విసరడంతో భారత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే ఆమ్లా (4) కూడా వెనుదిరగడం భారత్ శిబిరంలో ఆనందం నింపింది. షమీ వేసిన బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై తొలి ఇన్నింగ్స్‌లాగే షాట్‌కు ప్రయత్నించకుండా ఆమ్లా వెనుదిరగడం విశేషం. ఆ తర్వాత పీటర్సన్, డుప్లెసిస్ కలిసి మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ముగించారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా (సి) డివిలియర్స్ (బి) కలిస్ 153; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) డుమిని 96; రోహిత్ (బి) కలిస్ 6; రహానే (సి) స్మిత్ (బి) డుమిని 15; ధోని (సి) (సబ్) ఎల్గర్ (బి) ఫిలాండర్ 29; అశ్విన్ (సి) డుప్లెసిస్ (బి) ఫిలాండర్ 7; జహీర్ (నాటౌట్) 29; ఇషాంత్ (ఎల్బీ) (బి) తాహిర్ 4; షమీ (బి) తాహిర్ 4; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (120.4 ఓవర్లలో ఆలౌట్) 421. వికెట్ల పతనం: 1-23; 2-93; 3-315; 4-325; 5-327; 6-358; 7-369; 8-384; 9-405; 10-421. బౌలింగ్: స్టెయిన్ 30-5-104-0; ఫిలాండర్ 28-10-68-3; మోర్కెల్ 2-1-4-0; కలిస్ 20-5-68-3; తాహిర్ 15.4-1-69-2; డివిలియర్స్ 1-0-5-0; డుమిని 24-0-87-2. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బ్యాటింగ్) 76; స్మిత్ (రనౌట్) 44; ఆమ్లా (బి) షమీ 4; డుప్లెసిస్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 138. వికెట్ల పతనం: 1-108; 2-118. బౌలింగ్: జహీర్ 9-0-29-0; ఇషాంత్ 9-2-28-0; షమీ 8-1-30-1; అశ్విన్ 16-2-42-0; విజయ్ 1-0-3-0; ధోని 2-0-4-0. తొలి గంటే కీలకం! రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు కొంత పోరాటపటిమ కనబర్చింది. భారత బౌలర్ల వైఫల్యమో, అలసటో గానీ చివర్లో కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా పతనం 2 వికెట్లకే పరిమితమైంది. ఇక మిగిలింది చివరి రోజు ఆట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే పూర్తిగా మొగ్గు భారత్ వైపే ఉంది. మన బౌలర్ల తొలి ఇన్నింగ్స్ ప్రదర్శనను గమనిస్తే ఒక రోజు అందుబాటులో ఉండే కనీస 90 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీయడం సాధ్యమే. పైగా మోర్నీ మోర్కెల్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం తక్కువగా ఉండటంతో ఇక ఏడు వికెట్లే అని చెప్పవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే రికార్డు స్థాయిలో మరో 320 పరుగులు చేయాలి. దానికంటే కూడా ఆ జట్టు డ్రా గురించే ఎక్కువగా ఆలోచించవచ్చు. గత నాలుగు రోజుల ఆటను పరిశీలిస్తే...ప్రతీ రోజు తొలి గంట కీలకంగా మారింది. ఆ సమయంలో పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండటంతో పరిస్థితిని బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి రోజు భారత్ 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు గంటలోపే భారత్ 5 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు పది ఓవర్ల లోపే దక్షిణాఫ్రికా 4 వికెట్లు నష్టపోగా...నాలుగో రోజు పుజారా, కోహ్లి పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ గంట గడిస్తే చాలనే స్థితి ఇప్పుడూ ఉంది. ఆ సమయంలో వరుసగా వికెట్లు తీస్తే మ్యాచ్ భారత్‌దే. దక్షిణాఫ్రికా ఆ సమయంలో నిలదొక్కుకోగలిగితే మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌ను సఫారీ జట్టు డ్రా చేసుకున్నా అది అద్భుతమే అనుకోవాలి. మీరలా చేస్తే... మేమిలా చేస్తాం నాలుగో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల ఆధిక్యంతో సీరియస్‌గా సాగుతున్న సమయాన దక్షిణాఫ్రికా కెప్టెన్ స్మిత్, డివిలియర్స్‌కు బంతి అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడేళ్ల తర్వాత డివిలియర్స్ తొలిసారి బౌలింగ్ చేయడానికి దిగితే ఆమ్లా వికెట్ కీపర్ పాత్ర పోషించాడు. భారత్ జోరును అడ్డుకునే వ్యూహాలకు కొదవ కావడంతో అలా చేశాడని స్మిత్‌పై విమర్శలూ వచ్చాయి. అయితే శనివారం ఆటలో భారత కెప్టెన్ ధోని మరో ఆసక్తికర ప్రయత్నం చేశాడు. తన టెస్టు, వన్డే కెరీర్లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయని మురళీ విజయ్‌తో ఒక ఓవర్ బౌలింగ్ చేయించాడు. అంతటితో ఆగిపోలేదు...తాను కీపింగ్ ప్యాడ్స్ విప్పేసి బౌలింగ్ చేసేందుకు సిద్ధమైపోయాడు. కీపింగ్ గ్లవ్స్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్లాయి. ఇది ఆమ్లాకు కాపీనేమో! తొలి ఓవర్ తర్వాత ధోని తన కీపింగ్ ప్యాడ్లు కూడా ఓజాకిచ్చి పంపించేశాడు. బౌలింగ్ చేయని తర్వాతి రెండు ఓవర్లు ప్యాడ్లు లేకుండానే ధోని కీపింగ్ చేశాడు. ఇరు జట్లు ఇన్నింగ్స్‌లు సీరియస్‌గా సాగుతున్న వేళ, ప్రత్యర్థిని కట్టడి చేయాల్సిన, వికెట్లు తీయాల్సిన సమయంలో ఇది జరగడం ఆశ్చర్యం కలిగించేదే! అన్నట్లు ఇరు జట్ల వికెట్ కీపర్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. ‘టెస్టు మ్యాచ్ గెలిచేందుకు కావాల్సినంత స్కోరు మా వద్ద ఉంది. రెండు వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఆఖరి రోజు పరిస్థితి మరింత కఠినంగా ఉండవచ్చు. అయితే తొలి సెషన్లో చకచకా వికెట్లు తీయడం ముఖ్యం. వికెట్‌పై బౌన్స్‌లో తేడా, పగుళ్లు కనిపిస్తున్నాయి. బంతి బాగా తిరుగుతుందని ఆశిస్తున్నాం’ - చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్ ‘ప్రస్తుతం మేము ‘డ్రా’ కోసమే ఆడుతున్నాం. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టే సమయానికి పూర్తిగా 135 ఓవర్లు ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. టీ విరామం వరకు వికెట్ కోల్పోకుండా ఆడాలని అనుకున్నాం. రెండు వికెట్లు కోల్పోయినా మంచి స్థితిలో ఉన్నాం. ఆదివారం ఆటలో లంచ్ వరకు వికెట్ కోల్పోకపోతే విజయం గురించి ఆలోచిస్తాం’ - బిరెల్, దక్షిణాఫ్రికా అసిస్టెంట్ కోచ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో సెయింట్ జాన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో 418/7 స్కోరు చేసి విజయాన్నందుకుంది. 2008లో ఆస్ట్రేలియాపై (పెర్త్) 414/4 పరుగులు చేసి విజయం సాధించడం ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా అత్యధిక లక్ష్య ఛేదన. జొహన్నెస్‌బర్గ్‌లో అత్యధిక ఛేదన ఆస్ట్రేలియా (2011లో దక్షిణాఫ్రికాపై-310/8) పేరిట ఉండగా...ఈ మైదానంలో 396 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో (ఇంగ్లండ్‌పై) దక్షిణాఫ్రికా 304 పరుగులు చేసి (1914లో) ఓటమిపాలైంది. -
‘యువ’ శాసనం
ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం... దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పరుగుల ప్రవాహం సృష్టించారు. భారత అభిమానులే నమ్మలేకపోయినా ఇది నిజం... సఫారీలను వాళ్ల సొంతగడ్డపై ధోనిసేన శాసించే స్థితిలో ఉంది. మహామహుల్లాంటి భారత క్రికెట్ దిగ్గజాలు తడబడ్డ చోట... యువకులు కొత్త చరిత్ర లిఖిస్తున్నారు. భారత భవిష్యత్‌కు పరీక్షలా భావించిన సిరీస్‌లో దుమ్మురేపుతున్నారు. సంచలన ఆటతీరుతో దక్షిణాఫ్రికాపై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇక ఏదైనా అద్భుతం జరిగితే తప్ప తొలి టెస్టులో భారత్ విజయం సాధించడం లాంఛనమే అనుకోవాలి. జొహన్నెస్‌బర్గ్: తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 36 పరుగుల ఆధిక్యం... రెండో ఇన్నింగ్స్‌లో ధోనిసేన స్కోరు ఇప్పటికే 284/2... మూడో రోజు ముగిసేసరికే మొత్తం 320 పరుగుల ఆధిక్యం... ఈ అంకెలు చాలు సఫారీ గడ్డపై యువ భారత్ ఎంత అద్భుతంగా ఆడిందో చెప్పడానికి. దక్షిణాఫ్రికాతో వాండరర్స్ మైదానంలో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ శాసించే స్థితికి చేరింది. మూడో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 78 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (221 బంతుల్లో 135 బ్యాటింగ్; 18 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అజేయ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి (132 బంతుల్లో 77 బ్యాటింగ్; 8 ఫోర్లు) మరో శతకం దిశగా సాగుతున్నాడు. పుజారా, కోహ్లి జోడి మూడో వికెట్‌కు అజేయంగా 191 పరుగులు జోడించింది. అంతకుముందు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 75.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటయింది. దీంతో ధోనిసేనకు తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగుల ఆధిక్యం లభించింది. ‘కమ్‌బ్యాక్ హీరో’ జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ నాలుగేసి వికెట్లతో చెలరేగి భారత జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. చుట్టేసిన జహీర్: 213/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సఫారీ జట్టును జహీర్ వణికించాడు. పిచ్‌పై ఉండే తేమను తనకు అనుకూలంగా మల్చుకుంటూ రౌండ్ ద వికెట్ బౌలింగ్‌తో చెలరేగాడు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ (77 బంతుల్లో 20; 1 ఫోర్) నెమ్మదిగా ఆడేందుకు ప్రాధాన్యమిస్తే... ఫిలాండర్ (86 బంతుల్లో 59; 7 ఫోర్లు) దూకుడును ప్రదర్శించినా... జహీర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య ఏడో వికెట్‌కు నెలకొన్న 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రెండో ఎండ్‌లో ఇషాంత్ కూడా మెరుగ్గా బౌలింగ్ చేయడంతో సఫారీ వికెట్ల పతనం వేగంగా కొనసాగింది. కేవలం గంటలోపే దక్షిణాఫ్రికా ఓవర్‌నైట్ స్కోరుకు మరో 31 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లను చేజార్చుకుంది. మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. వికెట్ కోల్పోయినా...: తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో లంచ్‌కు కొద్ది ముందు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌ను ఆరంభంలోనే ప్రొటీస్ పేసర్లు దెబ్బతీశారు. ధావన్ (21 బంతుల్లో 15; 1 ఫోర్) ఫిలాండర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో విజయ్ (94 బంతుల్లో 39; 5 ఫోర్లు)తో జతకలిసిన పుజారా ఆరంభంలో కాస్త ఇబ్బంది పడినా కుదురుగానే ఆడాడు. ఈ ఇద్దరూ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాక కలిస్ బౌలింగ్‌లో విజయ్ అవుటయ్యాడు. పుజారాతో జత కట్టిన కోహ్లి టీ విరామానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. ద్వయం దంచేసింది: టీ విరామం తర్వాత భారత జోడి పుజారా, కోహ్లి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించింది. 127 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన పుజారా... ఆ తర్వాత మరింత వేగంగా ఆడి 168 బంతుల్లో సెంచరీ చేశాడు. అంటే రెండో 50 పరుగులు పుజారా కేవలం 41 బంతుల్లోనే చేశాడు. మరో ఎండ్‌లో కోహ్లి తొలి ఇన్నింగ్స్ ఫామ్‌ను కొనసాగించాడు. 74 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. పుజారా, కోహ్లిలకు ఒక్కో లైఫ్ లభించింది. ఈ ఒక్క పొరపాటు మినహా భారత జోడి ఆటలో వంక పెట్టడానికి కూడా వీలు లేదు. అంత చక్కగా ఆడారు. చివరి సెషన్లో ఈ జోడీ దూకుడుతో భారత్ ఏకంగా 175 పరుగులు చేసింది. పుజారా ఒక్కడే చివరి సెషన్లో 96 పరుగులు చేశాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 280; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) జహీర్ 68; పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 21; ఆమ్లా (బి) ఇషాంత్ 36; కలిస్ ఎల్బీడబ్ల్యు (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 13; డుమిని (సి) విజయ్ (బి) షమీ 2; డు ప్లెసిస్ (సి) ధోని (బి) జహీర్ 20; ఫిలాండర్ (సి) అశ్విన్ (బి) జహీర్ 59; స్టెయిన్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 10; మోర్నీ మోర్కెల్ (బి) జహీర్ 7; తాహిర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (75.3 ఓవర్లలో ఆలౌట్) 244. వికెట్ల పతనం: 1-37; 2-130; 3-130; 4-130; 5-145; 6-146; 7-226; 8-237; 9-239; 10-244. బౌలింగ్: జహీర్ 26.3-6-88-4; షమీ 18-3-48-2; ఇషాంత్ 25-5-79-4; అశ్విన్ 6-0-25-0 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా బ్యాటింగ్ 135; కోహ్లి బ్యాటింగ్ 77; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (78 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి) 284 వికెట్ల పతనం: 1-23; 2-93. బౌలింగ్: స్టెయిన్ 21-4-64-0; ఫిలాండర్ 18-5-53-1; మోర్నీ మోర్కెల్ 2-1-4-0; కలిస్ 14-4-51-1; తాహిర్ 11-0-55-0; డివిలియర్స్ 1-0-5-0; డుమిని 11-0-42-0. మోర్కెల్‌కు గాయం దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ భారత రెండో ఇన్నింగ్స్‌లో కేవలం రెండు ఓవర్లే బౌలింగ్ చేశాడు. లంచ్‌కు ముందు ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కుడి చీలమండ బెణికింది. దీంతో ఆటగాళ్లు బయటకు మోసుకెళ్లారు. ఇక ఈ ఇన్నింగ్స్‌లో తను బౌలింగ్ చేయలేడు. రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని జట్టు వర్గాలు తెలిపాయి. ఫిలాండర్ రికార్డు దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌల ర్గా ఫిలాండర్ రికార్డు సాధిం చాడు. 19వ టెస్టులో తను ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లలో జాబితా లో సంయుక్తంగా ఆరో స్థానంలో ఉన్నాడు. సువర్ణావకాశం దక్షిణాఫ్రికాలో టెస్టు గెలవడానికి భారత్‌కు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో... చేతిలో ఎనిమిది వికెట్లు, 320 పరుగుల ఆధిక్యం ఉన్నాయి. వరుసగా రెండు, మూడు రోజుల ఆట గమనిస్తే... తొలి గంట ఆట కీలకం కానుంది. ఉదయం సెషన్లోనే వికెట్లు టపటపా పడుతున్నాయి. కాకపోతే రెండు రోజుల్లోనూ టెయిలెండర్ల వికెట్లు ఎక్కువగా పడ్డాయి. ఇక నాలుగో రోజు ఉదయం సెషన్ ఆట చాలా కీలకం. భారత ఆటగాళ్లు ఈ సెషన్లో జాగ్రత్తగా ఆడితే... రెండో సెషన్లో ఒక గంటసేపు బ్యాటింగ్ చేసినా... ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాకు 450 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. ఇంత లక్ష్యాన్ని ఛేదించడం ఏ జట్టుకైనా కష్టమే కాబట్టి... భారత్ సురక్షితంగా ఉంటుంది. తొలి ఇన్నింగ్స్ తరహాలో మన బౌలర్లు చెలరేగితే ఈ మ్యాచ్‌లో ఘన విజయం సాధించొచ్చు. అటు మోర్కెల్ లేకపోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద సమస్య అయితే... పిచ్ క్రమంగా నెమ్మదిస్తుండటం భారత బౌలర్లను ఊరిస్తోంది. జహీర్, షమీ రివర్స్ స్వింగ్ రాబట్టడంలో నిపుణులు. ఇక పిచ్ నెమ్మదిస్తే అశ్విన్ ఉండనే ఉన్నాడు. కాబట్టి భారత్‌కు ఇది సువర్ణావకాశం. ఈ మ్యాచ్ గెలిస్తే... 1-0 ఆధిక్యంతో రెండో టెస్టుకు డర్బన్ వెళ్లొచ్చు. ఆ మ్యాచ్‌ను జాగ్రత్తగా ఆడి డ్రా చేసుకున్నా సరిపోతుంది. ఈ సువర్ణావకాశాన్ని ధోనిసేన జారవిడుచుకోకూడదు. 299 జహీర్‌ఖాన్ టెస్టుల్లో 299 వికెట్లు తీశాడు. మరొక్క వికెట్ తీస్తే 300 మైలురాయిని చేరుకున్న నాలుగో భారత బౌలర్ అవుతాడు. 6 టెస్టుల్లో పుజారాకు ఇది ఆరో సెంచరీ. దక్షిణాఫ్రికాపై మొదటిది సెషన్-1 ఓవర్లు: 9.3; పరుగులు: 31; వికెట్లు: 4 (దక్షిణాఫ్రికా) ఓవర్లు: 14; పరుగులు: 31; వికెట్లు: 1 (భారత్) సెషన్-2 ఓవర్లు: 26; పరుగులు 78; వికెట్లు: 1 సెషన్-3 ఓవర్లు: 38; పరుగులు: 175; వికెట్లు: 0 -
మావాళ్లకంటే అమ్మాయిలే నయం!
జొహన్నెస్‌బర్గ్: ‘పార్టీకి సిద్ధమయ్యేందుకు అమ్మాయిలు ఎక్కువ సమయం తీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ మా టీమ్‌లో కొందరు ఆటగాళ్లకంటే ఆడపిల్లలే నయం. మేకప్ కోసం వాళ్లు ఎంతో సమయం తీసుకుంటారు. కొందరు హెయిర్ జెల్ లేకుండా బయటికి రాకుంటే మరి కొందరేమో సన్‌స్క్రీన్, షవర్ జెల్ లేకుండా అడుగు పెట్టరు’...ఈ వ్యాఖ్య చేసిందెవరో కాదు భారత క్రికెట్ కెప్టెన్ ధోని. టీమిండియా సభ్యులకు భారత హైకమిషనర్ వీరేంద్ర గుప్తా ఇచ్చిన విందుకు జట్టు హాజరైన సందర్భంగా మహి ఈ మాటలు అన్నాడు. డిన్నర్ చేస్తూ కూడా ‘మేం భారతీయులమైనా తక్కువ తినే రకం కాదు. మాలో చాలా మందికి మూడు, నాలుగు సార్లు వడ్డించాల్సిందే’ అని అక్కడి సర్వర్లతో నవ్వుతూ అన్నాడు. టెస్టు మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి ఎలాంటి టెన్షన్ లేకుండా ధోని బృందం కొంత మంది భారత అభిమానులతో సరదాగా గడిపింది. మన ఉత్తమ బౌలర్ షమీ: గంగూలీ కోల్‌కతా: దక్షిణాఫ్రికాలో ఆడుతున్న భారత బౌలర్లలో షమీ అత్యుత్తమమని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రశంసించాడు. ‘జహీర్, శ్రీశాంత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నప్పుడు వారిని చూశాను. కానీ ప్రస్తుతం మాత్రం షమీ బాగా మెరుగ్గా కనిపిస్తున్నాడు’ అని దాదా అన్నాడు -
యువ సత్తాకు పరీక్ష
టెన్ క్రికెట్లో మధ్యాహ్నం గం. 2.00 నుంచి ప్రత్యక్ష ప్రసారం దాదాపు ఏడాది కాలంగా భారత జట్టు యువ నామస్మరణతో హోరెత్తింది. కొత్త కుర్రాళ్లు వచ్చారు, అద్భుతంగా ఆడుతున్నారు...ఇక దిగ్గజాలు తప్పుకున్నా తిరుగు లేదనే ధోరణి చాలా సందర్భాల్లో కనిపించింది. అయితే దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లో పరాజయ పర్వంతో వారి సామర్థ్యంపై కొంత సందేహాలు తలెత్తాయి. ఇలాంటి స్థితిలో ఇప్పుడు మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఆటగాళ్ల అసలు సత్తాకు పరీక్షగా నిలిచే టెస్టు క్రికెట్‌కు మన ఆటగాళ్లు సిద్ధమయ్యారు. పేస్, బౌన్స్‌తో బుల్లెట్లలా దూసుకొచ్చే ప్రత్యర్థి బౌలర్ల బంతులకు ఏ మేరకు ఎదురొడ్డి నిలవగలరన్నదే ఆసక్తికరం. జొహన్నెస్‌బర్గ్: సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడి వాండరర్స్ మైదానంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేటినుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఓడిన భారత్ టెస్టుల్లోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలని భావిస్తుండగా...సొంత గడ్డపై టెస్టుల్లో తమ అద్భుత రికార్డును నిలబెట్టుకోవాలని స్మిత్ సేన పట్టుదలగా ఉంది. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా భారత్‌కు ప్రతికూలాంశం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుందా, ఏకపక్షంగా ముగుస్తుందా చూడాలి. కోహ్లిపై భారం... మూడేళ్ల క్రితం నంబర్‌వన్‌గా దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను డ్రాగా ముగించింది. అయితే ఆ తర్వాత విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టుల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్ టీమిండియాకు అంత సులువు కాబోదు. ఇక్కడి పరిస్థితులు, పిచ్‌లు భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వేగం, విపరీతమైన బౌన్స్ కలగలిపి దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం జట్టుకు పెద్ద సవాల్. ముఖ్యంగా ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్‌వంటి దిగ్గజాల రిటైర్మెంట్తో జట్టు ముఖచిత్రమే మారిపోయింది. ఇప్పుడు జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. టాప్-6 బ్యాట్స్మెన్లలో ధోని ఒక్కడికే 20కి పైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. వన్డేల్లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు టెస్టుల్లోనూ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే సచిన్ ఆడిన నాలుగో స్థానంలో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. మాస్టర్ స్థాయిలో కాకపోయినా కోహ్లి తన సహజ ప్రతిభతో కీలక బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది. వన్డేల్లో విఫలమైనా ఆ ప్రభావం తనపై పడకుండా స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోగలగాలి. మూడో స్థానంలో పుజారా భారీ స్కోరు చేయడం ఎంతో ముఖ్యం. ఇక ధావన్, రోహిత్‌లపై కూడా జట్టు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో జహీర్‌ఖాన్ ముందుండి నడిపిస్తుండగా...యువ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఎంత వరకు కట్టడి చేయగలరన్నదే కీలకం. భువనేశ్వర్‌కంటే ఎక్కువ పేస్‌తో బంతులు వేసే ఇషాంత్‌కే తుది జట్టులో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రహానేను ఆరో స్థానంలో ఆడిస్తూ టీమిండియా తుది జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లు, అశ్విన్ జట్టులో ఉంటారు. పదునెక్కిన పేస్... మరో వైపు సొంత గడ్డపై ఆడుతుండటమే దక్షిణాఫ్రికాకు పెద్ద బలం. రెండేళ్ల క్రితం శ్రీలంక చేతిలో తమ దేశంలో ఓడిన తర్వాత సఫారీలు వరుసగా ఆరు టెస్టుల్లో నెగ్గారు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలింగ్ అటాక్‌గా ఆ జట్టుకు గుర్తింపు ఉంది. తమ బౌలింగ్ సత్తా ఏమిటో వారు భారత్‌కు వన్డేల్లోనూ రుచి చూపారు. నంబర్‌వన్ బౌలర్ స్టెయిన్‌తో పాటు మోర్కెల్, ఫిలాండర్ ఎలాంటి లైనప్‌నైనా కుప్పకూల్చగల సమర్థులు. నాలుగో పేసర్‌గా కలిస్ కూడా ఉపయుక్త బౌలర్. తొలి టెస్టుకు ముందు రోజే దక్షిణాఫ్రికా తమ తుది జట్టును ప్రకటించింది. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు చోటు కల్పించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, అల్విరో పీటర్సన్లు ఇటీవల మెరుగైన జోడీగా నిలదొక్కుకున్నారు. ఆమ్లా ఫామ్‌లో ఉండగా...కలిస్, డివిలియర్స్, డుప్లెసిస్, డుమినిలతో చక్కటి బ్యాటింగ్ లైనప్ సఫారీల సొంతం. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రోహిత్, రహానే, అశ్విన్, జహీర్, ఇషాంత్, షమీ. దక్షిణాఫ్రికా: స్మిత్ (కెప్టెన్), పీటర్సన్, ఆమ్లా, కలిస్, డివిలియర్స్, డుప్లెసిస్, డుమిని, ఫిలాండర్, స్టెయిన్, మోర్కెల్, తాహిర్. సచిన్ లేకుండా... 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు తొలి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. వాస్తవానికి ఇరు బోర్డుల మధ్య వివాదం చెలరేగక ముందు సచిన్ ఈ టూర్తోనే కెరీర్‌ను ముగిస్తాడనే అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వెస్టిండీస్ సిరీస్ తెరపైకి వచ్చింది. గత సఫారీ పర్యటనలో కేప్‌టౌన్‌లో సచిన్ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను రక్షించిన ఇన్నింగ్స్ చిరస్మరణీయం. ‘సచిన్ ఇక ఆడడనే నిజాన్ని మనం అంగీకరించాలి. దీన్ని కుర్రాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం చేయగలమో చూడాలి. పాత వైఫల్యాల భారాన్ని వెంట తెచ్చుకోకుండా ప్రతీ సిరీస్‌ను కొత్తగా ప్రారంభించాలి. పరిస్థితులకు తొందరగా అలవాటు పడటం ముఖ్యం. ఈ స్థాయిలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు చాలా నేర్చుకోగలుగుతారు. ఆటగాళ్లకు దెబ్బలు తగలకుండా ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కావడమే మంచిదైంది. టెస్టుల్లో బౌలింగే కీలకం. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీస్తే ఒత్తిడి పెంచవచ్చు. అయితే గత రెండు దశాబ్దాలుగా మన బలం బ్యాటింగే అని విషయం మరచిపోవద్దు. సీనియర్లు ఉన్నప్పుడు వారికున్న అనుభవం వల్ల కొత్తగా సిద్ధం కావాల్సిన అవసరం లేకపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మన బలాలు, బలహీనతల గురించి తెలిసుండాలి. ఎవరూ 5-6 రోజుల్లో టెక్నిక్ మార్చుకోలేరు. ఇక నాలుగో స్థానంలో ఎవరూ ఆడతారో చెప్పను, వేచి చూడండి’ - ధోని, భారత కెప్టెన్. ‘భారత జట్టులో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇలాంటి పర్యటనల్లో రాణించడం వారికి పెద్ద సవాల్. నంబర్‌వన్‌గా మా హోదాకు తగిన విధంగా చెలరేగి టెస్టు గెలవాలని కోరుకుంటున్నాను. వాండరర్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కాబట్టి ఇక్కడ గెలవాలంటే 500కు పైగా పరుగులే చేయనవసరం లేదు. కీలక సమయంలో ఒక మంచి భాగస్వామ్యం చాలు. చిన్న సిరీస్‌లో తొలి టెస్టులోనే పట్టు సాధించడం ఎంతో కీలకం’. - గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్ వాతావరణం ఎప్పటిలాగే వాండరర్స్ పిచ్‌పై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉందని క్యురేటర్ పెథాల్ బుథెలిజి చెప్పాడు. అయితే ఒక్కసారి నిలదొక్కుకుంటే ఇది బ్యాటింగ్‌కూ అనుకూలిస్తుంది కాబట్టి టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలని అతను సూచించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చక్కటి స్కోరని క్యురేటర్ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందు రోజు వికెట్‌పై తేమతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయి. పిచ్ గత వారం వరుసగా ఇక్కడ వర్షం కురిసినా ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. అయితే ప్రతీ రోజు కాస్త జల్లులు కురిసే అవకాశం మాత్రం ఉంది. మ్యాచ్ తొలి రోజు గురువారం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండవచ్చు. వాండరర్స్ మైదానంలో ఆడిన మూడు టెస్టుల్లో భారత్ ఒక్కటీ ఓడిపోలేదు. 1 గెలిచి, 2 డ్రా చేసుకుంది. డిసెంబర్ 2000 తర్వాత ఈ మైదానంలో జరిగిన 12 టెస్టుల్లోనూ ఫలితం రావడం విశేషం. మరో 5 వికెట్లు తీస్తే... జహీర్‌ఖాన్ టెస్టుల్లో 300 వికెట్లు, ఫిలాండర్ 100 వికెట్ల మైలురాళ్లను అందుకుంటారు. భారత కెప్టెన్‌గా ధోనికి 50వ టెస్టు మ్యాచ్. -
తొలి వన్డేలో భారత్ చిత్తు
జొహన్నెస్‌బర్గ్‌లో గురువారం తుపాన్‌కు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు తుపాన్ అయితే రాలేదు కానీ... దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించారు. డి కాక్, ఆమ్లా పునాది వేస్తే... దానిపై డివిలియర్స్, డుమిని పరుగుల పండుగ చేసుకున్నారు. బేలగా మారిన భారత బౌలర్లను సఫారీలు ఆటాడుకున్నారు. భారత బ్యాటింగ్ సరికొత్త హీరో రోహిత్ శర్మ బంతిని బ్యాట్‌తో తాకించడానికి 16 బంతులు తీసుకుంటే... ఇన్నింగ్స్ తొలి బౌన్సర్కే ధావన్ వెనుదిరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది... దక్షిణాఫ్రికాలో తమకు లభించిన ఈ తరహా స్వాగతానికి భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఐదుగురు పేసర్లు వేస్తున్న బంతులు బుల్లెట్ల తరహాలో దూసుకొస్తుంటే ఈసారి ఇంతే అనుకుంటూ కాడి పడేశారు. జొహన్నెస్‌బర్గ్: వరుసగా ఆరు వన్డే టోర్నీ విజయాలతో అద్భుత ఫామ్‌తో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన భారత కుర్రాళ్లు వాస్తవంలోకి వచ్చేశారు. మొదటినుంచి భయపడ్డట్లుగానే అక్కడి బౌన్స్, స్వింగ్ జట్టు జోరుకు బంధనాలు వేశాయి. ఫలితంగా ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా 141 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత్ 41 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. క్వాంటన్ డి కాక్ (121 బంతుల్లో 135; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాషిమ్ ఆమ్లా (88 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించగా... చివర్లో డివిలియర్స్ (47 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోయారు. భారత ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (71 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం డర్బన్‌లో జరుగుతుంది. భారీ భాగస్వామ్యం... టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే పెద్దగా అనుభవం లేని భారత స్వింగ్ బౌలర్లు మోహిత్ శర్మ, భువనేశ్వర్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా, డి కాక్ తమ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్‌తో వీరిద్దరు అవుట్ కాకుండా తప్పించుకోగలిగారు. అతి దగ్గరినుంచి ధావన్ రనౌట్ చేయలేకపోగా...క్యాచ్ పట్టడంలో రోహిత్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఓపెనర్లలో ఆమ్లా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తే... 20 ఏళ్ల కుర్రాడు డి కాక్ దూకుడుగా ఆడాడు. జోడిని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ప్రభావం చూపలేకపోయారు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత 30వ ఓవర్లో ఆమ్లాను అవుట్ చేసి షమీ జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే కలిస్ (10) కూడా వెనుదిరిగాడు. సిక్సర్ల మోత... మరోవైపు ధాటిగా ఆడిన డి కాక్ 101 బంతుల్లో కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి రెండో ఎండ్‌లో డివిలియర్స్ కూడా జోరు పెంచాడు. చివరకు పార్ట్ టైమర్ కోహ్లి, డి కాక్‌ను పెవిలియన్ పంపించాడు. అయితే భారత్ ఆనందం అక్కడే ఆవిరైంది. 44 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 258/3. ఆఖరి 6 ఓవర్లు టీమిండియాపై సఫారీలు సవారీ చేశారు. డివిలియర్స్, డుమిని కలిసి సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో వరుసగా 16, 16, 20, 12, 23, 13 (మొత్తం 100 పరుగులు) వచ్చాయి. ఇందులో డుమిని 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదగా... తనకే సాధ్యమైన వైవిధ్యమైన షాట్లతో డివిలియర్స్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు కలిసి 46 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం. మెరుపు బౌలింగ్... వరుసగా శుభారంభాలు ఇస్తూ వచ్చిన రోహిత్ శర్మ (43 బంతుల్లో 18; 2 ఫోర్లు), ధావన్ (12) జోడి ఈ మ్యాచ్‌లో తడబడింది. రోహిత్ అయితే ప్రతీ బంతికి తడబడ్డాడు. స్టెయిన్ వేసిన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా ఆడిన రోహిత్ ఎట్టకేలకు 17వ బంతికి మొదటి పరుగు తీశాడు. ధావన్‌ను మోర్కెల్ అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద డి కాక్ క్యాచ్ వదిలేయడంతో బయటపడ్డ కోహ్లి (35 బంతుల్లో 31; 5 ఫోర్లు) కొన్ని చక్కని షాట్లతో అలరించాడు. అయితే కోహ్లితో పాటు యువరాజ్ (0)ను ఒకే ఓవర్లో అవుట్ చేసి మెక్లారెన్ దెబ్బ తీశాడు. తర్వాతి ఓవర్లోనే రోహిత్... కొద్ది సేపటికి రైనా (14) రనౌటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా (30 బంతుల్లో 29; 6 ఫోర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా భారత్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (బి) షమీ 65; డి కాక్ (సి) అండ్ (బి) కోహ్లి 135; కలిస్ (సి) జడేజా (బి) షమీ 10; డివిలియర్స్ (బి) షమీ 77; డుమిని (నాటౌట్) 59; మిల్లర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 358 వికెట్ల పతనం: 1-152; 2-172; 3-247; 4-352. బౌలింగ్: మోహిత్ శర్మ 10-0-82-0; భువనేశ్వర్ 9-0-68-0; షమీ 10-1-68-3; అశ్విన్ 10-0-58-0; జడేజా 8-0-58-0; రైనా 1-0-7-0; కోహ్లి 2-0-15-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 18; ధావన్ (సి) డి కాక్ (బి) మోర్కెల్ 12; కోహ్లి (సి) కలిస్ (బి) మెక్లారెన్ 31; యువరాజ్ (బి) మెక్లారెన్ 0; రైనా (రనౌట్) 14; ధోని (బి) స్టెయిన్ 65; జడేజా (బి) కలిస్ 29; అశ్విన్ (సి) డి కాక్ (బి) మెక్లారెన్ 19; భువనేశ్వర్ (సి) కలిస్ (బి) స్టెయిన్ 0; మోహిత్ (నాటౌట్) 0; షమీ (సి) అండ్ (బి) స్టెయిన్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 217 వికెట్ల పతనం: 1-14; 2-60; 3-60; 4-65; 5-108; 6-158; 7-183; 8-190; 9-217; 10-217. బౌలింగ్: స్టెయిన్ 8-3-25-3; సోట్సోబ్ 9-0-52-0; మోర్కెల్ 8-1-29-1; మెక్లారెన్ 8-0-49-3; పార్నెల్ 5-0-37-0; కలిస్ 3-0-20-1. వాండరర్స్ గులాబీమయం తొలి వన్డే జరిగిన వాండరర్స్ మైదానమంతా గులాబీ రంగుతో నిండిపోయింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా నిర్వాహకులు ఈ గురువారాన్ని ‘పింక్ డే’గా నిర్వహించారు. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం పింక్ డ్రెస్ వేసుకోవడంతో పాటు హెల్మెట్, బ్యాట్లపై గ్రిప్‌ను కూడా పింక్‌తో నింపేశారు. భారత ఆటగాళ్లు తమ భుజాలకు గులాబీ రంగు రిబ్బన్ ధరించారు. స్పాన్సర్ హోర్డింగ్‌లను కూడా అదే రంగుతో ముంచెత్తారు. -
కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని ప్రాక్టీస్ భిన్నంగా సాగుతోంది. మంగళవారం జరిగిన నెట్ సెషన్లో మహీ... ఎర్రటి కూకబురా బంతులతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. మామూలుగా వన్డే మ్యాచ్‌లకు ఉపయోగించే తెల్ల బంతులతోనే ఎవరైనా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తారు. కానీ మహీ దీనికి భిన్నంగా చేశాడు. రెండో ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని... కొద్దిసేపు స్పిన్నర్లు, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ వేసిన బంతులను ఎదుర్కొని సాధన చేశాడు. ఇక సెషన్ ముగిసిందనుకున్న దశలో మళ్లీ ప్యాడ్లు కట్టుకొని నెట్లోకి వచ్చాడు. నెట్ వెనకాల కోచ్ ఫ్లెచర్, జట్టు విశ్లేషకుడు ధనంజయ్‌లు కూర్చొని ఉండగా కూకబురా బంతులతో అరగంట పాటు ప్రాక్టీస్ చేశాడు. ప్రాక్టీస్ కొనసాగినంతసేపు ఫ్లెచర్.. మహీకి సూచనలు చేస్తూనే ఉన్నాడు. కవర్స్‌లో వేగంగా కదలడంపై ఎక్కువగా దృష్టిసారించినట్లు కనిపించింది. -
పాక్‌తో తొలి టి20 దక్షిణాఫ్రికా గెలుపు
జొహన్నెస్‌బర్గ్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. డీకాక్ (33 బంతుల్లో 43; 8 ఫోర్లు), ఆమ్లా (20 బంతుల్లో 31; 6 ఫోర్లు), డు ప్లెసిస్ (22 బంతుల్లో 22; 1 ఫోర్), మిల్లర్ (11 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. జునైద్, హఫీజ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ 9.1 ఓవర్లలో 2 వికెట్లకు 60 పరుగులు చేసిన దశలో భారీ వర్షం పడింది. తర్వాత మ్యాచ్ సాధ్యపడలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం... పార్ స్కోరుకు పాక్ 4 పరుగులు వెనుకబడిపోయింది.