విజయం ఊరిస్తోంది | india team in Winning position in first test match series | Sakshi
Sakshi News home page

విజయం ఊరిస్తోంది

Published Sun, Dec 22 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

కోహ్లి

కోహ్లి

మరో ఎనిమిది వికెట్లు...భారత్‌ను బెంబేలెత్తించేందుకు దక్షిణాఫ్రికా తయారు చేసిన ‘పిచ్’లో వారినే పడగొట్టేందుకు... భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ యువ ఆటగాళ్ల చేతుల ద్వారా విజయం అందుకునేందుకు... అవును... జొహన్నెస్‌బర్గ్ టెస్టు ఇప్పుడు దాదాపుగా భారత్ ఆధీనంలోకి వచ్చేసింది.
 
  రికార్డుల ప్రకారం చరిత్రలో ఏ జట్టూ ఛేదించని లక్ష్యాన్ని ముందుంచుకొని దక్షిణాఫ్రికా తడబడుతోంది. ఇప్పటికే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయిన ఆ జట్టు పరువు కాపాడుకునేందుకు పోరాడుతోంది. నాలుగు రోజులుగా ఆటపై ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చివరి రోజు అదే పట్టుదలతో శ్రమిస్తే చిరస్మరణీయ విజయం చేజిక్కుతుంది.
 
 జొహన్నెస్‌బర్గ్:  తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టును విజయం ఊరిస్తోంది. 458 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అల్విరో పీటర్సన్ (148 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు) తోపాటు డుప్లెసిస్ (10 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. పీటర్సన్, స్మిత్ తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి శుభారంభం చేసినా....వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. విజయానికి సఫారీలు మరో 320 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన నేపథ్యంలో ఆ జట్టు విజయావకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.
 
 
  అయితే చెలరేగుతున్న భారత పేసర్లను ఎదుర్కొని దక్షిణాఫ్రికా మ్యాచ్‌ను డ్రా చేసుకోగలదా అనేది ఆసక్తికరం. అంతకుముందు భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 421 పరుగులకు ఆలౌటైంది.  నాలుగోరోజు భారత్ మరో 137 పరుగులు జత చేసింది. పుజారా (270 బంతుల్లో 153; 21 ఫోర్లు), కోహ్లి (193 బంతుల్లో 96; 9 ఫోర్లు) మూడో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ సెంచరీ కోల్పోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, కలిస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
 
 కోహ్లి సెంచరీ మిస్
 284/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో భారత ద్వయం పుజారా, కోహ్లి నాలుగో రోజు ఆటను కొనసాగించారు. కొద్దిసేపటికే స్టెయిన్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసి పుజారా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు కలిస్ 222 పరుగుల సుదీర్ఘ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
 
 కలిస్ బౌలింగ్‌లో కట్ చేయబోయి పుజారా కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ (6)ను క్లీన్‌బౌల్డ్ చేసి కలిస్ మళ్లీ దెబ్బ తీశాడు. అయితే తర్వాతి ఓవర్లో భారత్‌కు మరో షాక్ తగిలింది. టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీ సాధించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరదామనుకున్న కోహ్లి ఆశ నెరవేరలేదు. డుమిని బౌలింగ్‌లో లేట్ కట్ ఆడబోయిన కోహ్లి, కీపర్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశగా వెనుదిరిగాడు. రహానే (15)ను కూడా డుమిని అవుట్ చేయడంతో భారత్ 358/6 స్కోరుతో తొలి సెషన్ ముగించింది.
 
 
 జహీర్ మెరుపులు
 లంచ్ విరామం తర్వాత కెప్టెన్ ధోని (44 బంతుల్లో 29; 3 ఫోర్లు) సాధ్యమైనంత వేగంగా ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాడు. భారత్ ఓవరాల్ ఆధిక్యం 400 పరుగులు దాటగానే అశ్విన్ (7) అవుట్ కాగా...ధాటిగా ఆడే ప్రయత్నంలో భారీ షాట్‌కు యత్నించి ధోని డీప్ పాయింట్‌లో క్యాచ్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా జహీర్ ఖాన్ (31 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగిపోయాడు. తాహిర్, స్టెయిన్‌ల బౌలింగ్‌లో ఒక్కో సిక్సర్ బాది ప్రేక్షకులను అలరించాడు. మరో వైపు ఇషాంత్ (4), షమీ (4)లను వరుస ఓవర్లలో తాహిర్ అవుట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు టీ విరామం వరకు 11 ఓవర్లు జాగ్రత్తగా ఆడారు. జహీర్ వేసిన రెండో ఓవర్లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను అందుకోవడంలో కోహ్లి విఫలం కావడంతో స్మిత్ బతికిపోయాడు.
 
 శతక భాగస్వామ్యం
 టీ విరామం తర్వాత దక్షిణాఫ్రికా చక్కటి ఆటతీరు కనబర్చింది. పీటర్సన్ ధాటిగా ఆడగా, స్మిత్ (73 బంతుల్లో 44; 6 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ క్రీజ్‌లో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో 84 బంతుల్లో పీటర్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అయితే ఆ వెంటనే స్మిత్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. అశ్విన్ బౌలింగ్‌లో మిడాన్ వైపు కొట్టి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే దూసుకొచ్చిన రహానే నేరుగా వికెట్లపైకి బంతిని విసరడంతో భారత్‌కు బ్రేక్ లభించింది. ఆ వెంటనే ఆమ్లా (4) కూడా వెనుదిరగడం భారత్ శిబిరంలో ఆనందం నింపింది. షమీ వేసిన బంతి బౌన్స్‌ను అంచనా వేయడంలో విఫలమై తొలి ఇన్నింగ్స్‌లాగే షాట్‌కు ప్రయత్నించకుండా ఆమ్లా వెనుదిరగడం విశేషం. ఆ తర్వాత పీటర్సన్, డుప్లెసిస్ కలిసి మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ముగించారు.
 
 స్కోరు వివరాలు
 భారత్ తొలి ఇన్నింగ్స్: 280
 దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 244
 భారత్ రెండో ఇన్నింగ్స్: ధావన్ (సి) కలిస్ (బి) ఫిలాండర్ 15; విజయ్ (సి) డివిలియర్స్ (బి) కలిస్ 39; పుజారా (సి) డివిలియర్స్ (బి) కలిస్ 153; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) డుమిని 96; రోహిత్ (బి) కలిస్ 6; రహానే (సి) స్మిత్ (బి) డుమిని 15; ధోని (సి) (సబ్) ఎల్గర్ (బి) ఫిలాండర్ 29; అశ్విన్ (సి) డుప్లెసిస్ (బి) ఫిలాండర్ 7; జహీర్ (నాటౌట్) 29; ఇషాంత్ (ఎల్బీ) (బి) తాహిర్ 4; షమీ (బి) తాహిర్ 4; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (120.4 ఓవర్లలో ఆలౌట్) 421.
 
 వికెట్ల పతనం: 1-23; 2-93; 3-315; 4-325; 5-327; 6-358; 7-369; 8-384; 9-405; 10-421.
 
 బౌలింగ్: స్టెయిన్ 30-5-104-0; ఫిలాండర్ 28-10-68-3; మోర్కెల్ 2-1-4-0; కలిస్ 20-5-68-3; తాహిర్ 15.4-1-69-2; డివిలియర్స్ 1-0-5-0; డుమిని 24-0-87-2.
 దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: పీటర్సన్ (బ్యాటింగ్) 76; స్మిత్ (రనౌట్) 44; ఆమ్లా (బి) షమీ 4; డుప్లెసిస్ (బ్యాటింగ్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (45 ఓవర్లలో 2 వికెట్లకు) 138.
 వికెట్ల పతనం: 1-108; 2-118.
 
 బౌలింగ్: జహీర్ 9-0-29-0; ఇషాంత్ 9-2-28-0; షమీ 8-1-30-1; అశ్విన్ 16-2-42-0; విజయ్ 1-0-3-0; ధోని 2-0-4-0.
 
 తొలి గంటే కీలకం!
 రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టు కొంత పోరాటపటిమ కనబర్చింది. భారత బౌలర్ల వైఫల్యమో, అలసటో గానీ చివర్లో కాస్త ఉదాసీనత ప్రదర్శించడంతో దక్షిణాఫ్రికా పతనం 2 వికెట్లకే పరిమితమైంది. ఇక మిగిలింది చివరి రోజు ఆట. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చూస్తే పూర్తిగా మొగ్గు భారత్ వైపే ఉంది. మన బౌలర్ల తొలి ఇన్నింగ్స్ ప్రదర్శనను గమనిస్తే ఒక రోజు అందుబాటులో ఉండే కనీస 90 ఓవర్లలో ఎనిమిది వికెట్లు తీయడం సాధ్యమే.
 
  పైగా మోర్నీ మోర్కెల్ బ్యాటింగ్‌కు దిగే అవకాశం తక్కువగా ఉండటంతో ఇక ఏడు వికెట్లే అని చెప్పవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్ గెలవాలంటే రికార్డు స్థాయిలో మరో 320 పరుగులు చేయాలి. దానికంటే కూడా ఆ జట్టు డ్రా గురించే ఎక్కువగా ఆలోచించవచ్చు. గత నాలుగు రోజుల ఆటను పరిశీలిస్తే...ప్రతీ రోజు తొలి గంట కీలకంగా మారింది. ఆ సమయంలో పిచ్‌పై తేమ ఎక్కువగా ఉంటుండటంతో పరిస్థితిని బౌలర్లు చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి రోజు భారత్ 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయింది.
 
 రెండో రోజు గంటలోపే భారత్ 5 వికెట్లు నేలకూలాయి. మూడో రోజు పది ఓవర్ల లోపే దక్షిణాఫ్రికా 4 వికెట్లు నష్టపోగా...నాలుగో రోజు పుజారా, కోహ్లి పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ గంట గడిస్తే చాలనే స్థితి ఇప్పుడూ ఉంది. ఆ సమయంలో వరుసగా వికెట్లు తీస్తే మ్యాచ్ భారత్‌దే. దక్షిణాఫ్రికా ఆ సమయంలో నిలదొక్కుకోగలిగితే మ్యాచ్‌ను డ్రా వైపు నడిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్‌ను సఫారీ జట్టు డ్రా చేసుకున్నా అది అద్భుతమే అనుకోవాలి.
 
 మీరలా చేస్తే... మేమిలా చేస్తాం
 నాలుగో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల ఆధిక్యంతో సీరియస్‌గా సాగుతున్న సమయాన దక్షిణాఫ్రికా కెప్టెన్ స్మిత్, డివిలియర్స్‌కు బంతి అందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడేళ్ల తర్వాత డివిలియర్స్ తొలిసారి బౌలింగ్ చేయడానికి దిగితే ఆమ్లా వికెట్ కీపర్ పాత్ర పోషించాడు. భారత్ జోరును అడ్డుకునే వ్యూహాలకు కొదవ కావడంతో అలా చేశాడని స్మిత్‌పై విమర్శలూ వచ్చాయి. అయితే శనివారం ఆటలో భారత కెప్టెన్ ధోని మరో ఆసక్తికర ప్రయత్నం చేశాడు. తన టెస్టు, వన్డే కెరీర్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయని మురళీ విజయ్‌తో ఒక ఓవర్ బౌలింగ్ చేయించాడు. అంతటితో ఆగిపోలేదు...తాను కీపింగ్ ప్యాడ్స్ విప్పేసి బౌలింగ్ చేసేందుకు సిద్ధమైపోయాడు. కీపింగ్ గ్లవ్స్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్లాయి. ఇది ఆమ్లాకు కాపీనేమో! తొలి ఓవర్ తర్వాత ధోని తన కీపింగ్ ప్యాడ్లు కూడా ఓజాకిచ్చి పంపించేశాడు. బౌలింగ్ చేయని తర్వాతి రెండు ఓవర్లు ప్యాడ్లు లేకుండానే ధోని కీపింగ్ చేశాడు. ఇరు జట్లు ఇన్నింగ్స్‌లు  సీరియస్‌గా సాగుతున్న వేళ, ప్రత్యర్థిని  కట్టడి చేయాల్సిన, వికెట్లు తీయాల్సిన సమయంలో ఇది జరగడం ఆశ్చర్యం కలిగించేదే! అన్నట్లు ఇరు జట్ల వికెట్ కీపర్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో బౌలింగ్ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.
 
 ‘టెస్టు మ్యాచ్ గెలిచేందుకు కావాల్సినంత స్కోరు మా వద్ద ఉంది. రెండు వికెట్లు పడగొట్టడం సంతోషంగా ఉంది. ఆఖరి రోజు పరిస్థితి మరింత కఠినంగా ఉండవచ్చు. అయితే తొలి సెషన్‌లో చకచకా వికెట్లు తీయడం ముఖ్యం. వికెట్‌పై బౌన్స్‌లో తేడా, పగుళ్లు కనిపిస్తున్నాయి. బంతి బాగా తిరుగుతుందని ఆశిస్తున్నాం’
 - చతేశ్వర్ పుజారా, భారత బ్యాట్స్‌మన్
 
 ‘ప్రస్తుతం మేము ‘డ్రా’ కోసమే ఆడుతున్నాం. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టే సమయానికి పూర్తిగా 135 ఓవర్లు ఆడాలనే లక్ష్యంతో బరిలోకి దిగలేదు. టీ విరామం వరకు వికెట్ కోల్పోకుండా ఆడాలని అనుకున్నాం. రెండు వికెట్లు కోల్పోయినా మంచి స్థితిలో ఉన్నాం. ఆదివారం ఆటలో లంచ్ వరకు వికెట్ కోల్పోకపోతే విజయం గురించి ఆలోచిస్తాం’
 - బిరెల్, దక్షిణాఫ్రికా అసిస్టెంట్ కోచ్
 
 టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2003లో సెయింట్ జాన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగో ఇన్నింగ్స్‌లో 418/7 స్కోరు చేసి విజయాన్నందుకుంది.
 
 2008లో ఆస్ట్రేలియాపై (పెర్త్) 414/4 పరుగులు చేసి విజయం సాధించడం ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా అత్యధిక లక్ష్య ఛేదన.
 
 జొహన్నెస్‌బర్గ్‌లో అత్యధిక ఛేదన ఆస్ట్రేలియా (2011లో దక్షిణాఫ్రికాపై-310/8) పేరిట ఉండగా...ఈ మైదానంలో 396 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో (ఇంగ్లండ్‌పై) దక్షిణాఫ్రికా 304 పరుగులు చేసి (1914లో)  ఓటమిపాలైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement