గబ్బా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగినప్పటికీ.. సఫారీలతో పోలిస్తే ఆస్ట్రేలియా కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించగలిగింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్ (96 బంతుల్లో 92; 13 ఫోర్లు, సిక్స్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఆసీస్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఆట తొలి రోజు 15 వికెట్లు నేలకూలిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి. దీంతో ఈ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఓవర్‌నైట్ స్కోర్ 145/5 వద్ద రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మరో 73 పరుగులు జోడించి 218 పరుగుల వద్ద ఆలౌటైంది. ట్రవిస్ హెడ్ 8 పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సఫారీ బౌలర్లలో రబాడ 4 వికెట్లు పడగొట్టగా.. జన్సెన్ 3, నోర్జే 2, ఎంగిడి ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. పాట్ కమిన్స్ (5/42), మిచెల్ స్టార్క్ (2/26), స్కాట్ బోలాండ్ (2/14), నాథన్ లయోన్ (1/17) ధాటికి 99 పరుగులకే కుప్పకూలింది. 34 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ను సఫారీ ఏస్ పేసర్ రబాడ వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఉస్మాన్ ఖ్వాజా (2), డేవిడ్ వార్నర్ (3), స్టీవ్ స్మిత్ (6), ట్రవిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమైప్పటికీ 19 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో రావడంతో ఆసీస్ గెలుపొందింది. అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.
Comments
Please login to add a commentAdd a comment