ప్రపంచ క్రికెట్‌లో ఫామ్‌తో సంబంధం లేకుండా క్రికెటేతర విషయాలైన రూపం, వర్ణం, ఆహార్యం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా అంటే అది దక్షిణాఫ్రికా వన్డే జట్టు సారధి టెంబా బవుమానే అని చెప్పాలి. ఈ సఫారీ స్టార్ గతంలో అనేక సందర్భాల్లో క్రికెటేతర కారణాల చేత అవమానాలు ఎదుర్కొన్నాడు. సొంత జట్టు సభ్యులతో సహా తన చుట్టూ ఉన్నవారంతా తన ఆహార్యాన్ని గేలి చేసినప్పటికీ ఎంతమాత్రం చలించని ఈ సఫారీ బ్యాటింగ్ యోధుడు, తనకు అవమానం ఎదురైన ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం బవుమా అదే పనిలోనే ఉన్నాడు. వ్యక్తిగత విషయాలతో పాటు తన ఆటను కించపరిచే వారికి సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ సమాధానం చెబుతున్నాడు. పొట్టి ఫార్మాట్ మినహాయించి మిగతా రెండు ఫార్మాట్లలో ఈ ఏడాది బవుమా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే అతను టెస్ట్‌ల్లో (1), వన్డేల్లో (3) నాలుగు సెంచరీలు బాదాడు. ముఖ్యంగా వన్డేల్లో అతని ఫామ్ అసామాన్యమైనదిగా ఉంది. ఈ ఏడాది అతనాడిన 9 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు సహా 637 పరుగులు చేశాడు.
తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో తన జట్టు నామమాత్రపు ప్రదర్శన చేస్తున్నప్పటికీ, అతనొక్కడు అద్భుతంగా రాణిస్తూ, తన జట్టు ఘోర పరాజయాలను ఎదుర్కోకుండా కాపాడుతున్నాడు. ఆసీస్‌తో ఇవాళ (సెప్టెంబర్ 12) జరుగుతున్న మూడో వన్డేలో బవుమా 62 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి అత్యంత కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఫలితంగా సఫారీ టీమ్ 39 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. బవుమాతో పాటు డికాక్ (82), రీజా హెండ్రిక్స్ (39), మార్క్రమ్ (43 నాటౌట్) రాణించారు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇంకా 11 ఓవర్లు ఆడాల్సి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు నెగ్గిన ఆసీస్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సైతం ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment