టీమిండియాతో మూడో టెస్టు డ్రాగా ముగియడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. వర్షం అడ్డుపడకపోయి ఉంటే తాము తప్పక గెలిచేవాళ్లమని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఫలితం తేలకపోయినా.. తమ జట్టు సమిష్టిగా రాణించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు గెలుపు కోసం తమ వంతు కృషి చేయడం ఎంతో బాగుందని సహచర ఆటగాళ్లను కొనియాడాడు.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా సొంతగడ్డపై ఆసీస్.. భారత్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ మ్యాచ్‌లో భారత్ గెలుపొందగా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జయభేరి మోగించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది.
పదే పదే అడ్డుపడ్డ వరుణుడు
అయితే, సిరీస్‌లో ఎంతో కీలకమైన మూడో టెస్టు మాత్రం డ్రాగా ముగిసిపోయింది. బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మొదలైన ఈ టెస్టుకు తొలి రోజు నుంచే వర్షం ఆటంకం కలిగించింది. మరోవైపు.. వెలుతురులేమి వల్ల కూడా మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
ఆది నుంచి పటిష్ట స్థితిలోనే ఆసీస్
ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఐదో రోజు ఆటలో కూడా ఇలాంటి అవాంతరాలు ఎదురుకావడంతో.. అంపైర్ల సూచన మేరకు ఆసీస్- భారత కెప్టెన్లు కమిన్స్, రోహిత్ శర్మ డ్రాకు అంగీకరించారు. నిజానికి గబ్బా టెస్టులో ఆది నుంచి ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలోనే ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ట్రవిస్ హెడ్(152), స్టీవ్ స్మిత్(101) శతకాల కారణంగా పైచేయి సాధించింది.
భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది
భారత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగి 445 పరుగులు మేర భారీ స్కోరు సాధించింది. అయితే, ఆసీస్ బ్యాటర్లు చెలరేగిన చోట.. టీమిండియా మాత్రం తడబడింది. కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77)తో పాటు ఆఖర్లో జస్‌ప్రీత్ బుమ్రా(10*), ఆకాశ్ దీప్(31) విలువైన ఇన్నింగ్స్ కారణంగా ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో 260 పరుగులతో మెరుగైన స్కోరు సాధించింది.
ఐదోరోజూ ఆటంకాలు
ఈ క్రమంలో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఆసీస్.. 89/7 వద్ద స్కోరును డిక్లేర్ చేసింది. తద్వారా భారత్ ముందు 275 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, పదే పదే వర్షం రావడంతో పాటు.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు ఆటను నిలిపివేసి.. ఇరుజట్ల కెప్టెన్లను సంప్రదించారు. భారత్ స్కోరు 8/0 వద్ద ఉండగా.. ఇరువురూ డ్రాకు అంగీకరించారు. నిజానికి ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడపకపోయి ఉంటే ఫలితం వచ్చేదే.
2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘వర్షం పదే పదే అడుడ్డుపడింది. లేదంటే 2-1తో మేము ఆధిక్యంలో నిలిచేవాళ్లం. అయినా, మన చేతుల్లో లేని విషయం గురించి ఆలోచించడం అనవసరం. ఏదేమైనా ఈ టెస్టులో మా జట్టు ప్రదర్శన సంతృప్తినిచ్చింది.
మేము భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశాం. స్టార్క్, నేను బాగానే రాణించాం. కానీ దురదృష్టవశాత్తూ మేము జోష్ హాజిల్‌వుడ్ సేవలు కోల్పోయాం. ఇక ఐదో రోజు ఆటలో కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఆ ఇద్దరు అద్భుతం
కొత్త బంతిని ఎదుర్కోవడం సవాలుగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో హెడ్, స్మిత్ అద్భుతంగా ఆడారు. అలెక్స్ క్యారీ మెరుగ్గా బ్యాటింగ్ చేశాడు. నాథన్ లియోన్ కూడా తన వంతు పాత్ర పోషించాడు. స్టార్క్ వికెట్లు తీశాడు. ఇలా ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు.
బాక్సింగ్ డే టెస్టుకు ముందు మాకు ఇలా ఎన్నో సానుకూలాంశాలు ఉండటం సంతోషం’’ అని పేర్కొన్నాడు. పూర్తి ఆత్మవిశ్వాసంతో తదుపరి టెస్టు బరిలో దిగుతామని కమిన్స్ ఈ సందర్భంగా తెలిపాడు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో నాలుగో టెస్టు మొదలుకానుంది.
చదవండి: Kohli- Gambhir: వారికి మ్యాచ్ గెలిచినంత సంబరం.. రోహిత్ మాత్రం అలా.. వీడియో
Comments
Please login to add a commentAdd a comment