సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్ లో 421 పరుగుల స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం 36 పరుగులతో కలిపి 457 పరుగుల ఆధిక్యం టీమిండియాకు దక్కింది. ఇక ఆట ఒకటిన్నర రోజు కూడా పూర్తిగా లేకపోవడంతో సౌతాఫ్రికా పని పట్టడమే మిగిలింది. మొదటి ఇన్నింగ్స్ హీరోలు జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ మరోసారి జూలు విదిలించి, వారికి షమీ లాంటి వాళ్లు కూడా తోడైతే ఇక భారత్ విజయం నల్లేరు మీద బండి నడకే అని చెప్పుకోవచ్చు.
తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులకే ఆలౌటయిన భారత బ్యాట్స్మన్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సౌతాఫ్రికన్ బౌలర్లకు వాళ్ల సొంత గడ్డ మీదే చుక్కలు చూపించారు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ కొద్దిలో శతకం మిస్సయ్యాడు. శిఖర్ ధావన్ 15 పరుగులు మాత్రమే చేసి ఫిలాండర్ బౌలింగ్లో కలిస్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మురళీ విజయ్ 39 పరుగులు చేసి డి విలియర్స్ క్యాచ్తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో వచ్చిన ఛటేశ్వర్ పుజారా సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 270 బంతులు ఎదుర్కొన్న పుజారా సుదీర్ఘ కాలం పాటు క్రీజ్కు అతుక్కుపోయాడు. 21 ఫోర్లతో 153 పరుగులు చేసి, చివరకు కలిస్ బౌలింగ్లోనే డి విలియర్స్ క్యాచ్తో ఔటయ్యాడు.
విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించినా, 96 పరుగుల వద్ద ఔటవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు. 193 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లతో భారీ స్కోరు అందించిన కోహ్లీ బ్యాటు నుంచి శతకం జాలువారుతుందని, సౌతాఫ్రికాకు దీంతో గట్టిగా బుద్ధి వస్తుందని అభిమానులు ఆశించారు. అయితే, డుమినీ బౌలింగ్లో మళ్లీ డి విలియర్స్ క్యాచ్ పట్టి కోహ్లీని పెవిలియన్కు పంపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్లో ముగ్గురు బ్యాట్స్మన్ కేవలం డి విలియర్స్ క్యాచ్ల వల్లే ఔటవ్వడం గమనార్హం. ఆ తర్వాత వచ్చిన రోహిత్ శర్మ ఆరు పరుగులకే వెనుదిరగగా, తొలి ఇన్నింగ్స్లో 47 పరుగులతో ఆశలు రేకెత్తించిన అజింక్య రహానే 15 పరుగులకే ఔటయ్యాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా 7 పరుగులే చేసి ఫిలాండర్ బౌలింగ్లో ప్లెసిస్కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత కెప్టెన్ ధోనీ కూడా వెనుదిరిగాడు. ధోనీ 44 బంతుల్లో మూడు ఫోర్లతో 29 పరుగులు మాత్రమే చేశాడు. భోజన విరామ సమయానికి భారత్ ఆరు వికెట్లు నష్టపోయి 358 పరుగులు చేసింది. తిరిగి వచ్చిన తర్వాత ఆట నెమ్మదిగా మొదలైంది. ఆ తర్వాతే అశ్విన్ వికెట్ పడింది.
ఆ తరుణంలో వచ్చిన జహీర్ ఖాన్ స్కోరుబోర్డును వేగంగా కదిలించాడు. రెండో ఎండ్ నుంచి పెద్దగా మద్దతు లభించకపోయినా ఒంటి చేత్తో పోరాటం సాగించాడు. 31 బంతుల్లోనే 29 పరుగులు చేసి తనలోని ఆల్ రౌండ్ నైపుణ్యాన్ని చూపించాడు. ఇందులో మూడు ఫోర్లు, రెండు సిక్సులు కూడా ఉన్నాయి. అయితే, మరోవైపు బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ కూడా నాలుగేసి పరుగులకే ఔటవ్వడంతో భారత ఇన్నింగ్స్ 421 పరుగుల వద్ద ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కొద్దిగానే ఉన్నా, రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మన్ విజృంభణ టీమిండియాకు బాగా ఉపయోగపడింది.