ముగిసిన నాలుగోరోజు ఆట: సౌతాఫ్రికా 138/2
జోహన్స్బర్గ్: భారత్ -దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. 457 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సఫారీలు నిలకడగా ఆడుతున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు 138 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. దీంతో దక్షిణాఫ్రికా విజయం సాధించడానికి 320 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు పీటర్సన్(76) పరుగులతో అజేయంగా ఉండగా, స్మిత్ (44) పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన హషీమ్ ఆమ్లా(4) పరుగులకే పరిమితమైయ్యాడు. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో భారత్ బౌలర్లకు అసలు పరీక్ష ఎదురుకానుంది.
తొలి ఇన్నింగ్స్లో 280 పరుగులకే ఆలౌటయిన భారత బ్యాట్స్మన్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం సౌతాఫ్రికన్ బౌలర్లకు వాళ్ల సొంత గడ్డ మీదే చుక్కలు చూపించారు. పుజారా సెంచరీ చేయగా, కోహ్లీ కొద్దిలో శతకం మిస్సయ్యాడు. శిఖర్ ధావన్ 15 పరుగులు మాత్రమే చేసి ఫిలాండర్ బౌలింగ్లో కలిస్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మురళీ విజయ్ 39 పరుగులు చేసి డి విలియర్స్ క్యాచ్తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో వచ్చిన ఛటేశ్వర్ పుజారా సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. 270 బంతులు ఎదుర్కొన్న పుజారా సుదీర్ఘ కాలం పాటు క్రీజ్కు అతుక్కుపోయాడు. 21 ఫోర్లతో 153 పరుగులు చేసి, చివరకు కలిస్ బౌలింగ్లోనే డి విలియర్స్ క్యాచ్తో ఔటయ్యాడు.