తొలి రోజే 'తమాషా' | Strategy spin in Mohali | Sakshi
Sakshi News home page

తొలి రోజే 'తమాషా'

Published Fri, Nov 6 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

తొలి రోజే 'తమాషా'

తొలి రోజే 'తమాషా'

మొహాలీలో స్పిన్ తంత్రం 
ఒకే రోజు 12 వికెట్లు
భారత్ 201 ఆలౌట్ 
దక్షిణాఫ్రికా 28/2

 
 ఓ టెస్టు మ్యాచ్ తొలి రోజే 12 వికెట్లు... కొత్త బంతితో స్పిన్నర్ మొదటి ఓవర్ బౌలింగ్ చేయడం... బంతి ఎటు పడి ఎటు తిరుగుతుందో...
 ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో బ్యాట్స్‌మెన్... అంతా తమాషా..! టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 201 పరుగులకే ఆలౌట్... ఇప్పటివరకూ 17 టెస్టులాడినా పది వికెట్లు తీయలేకపోయిన ఓ పార్ట్‌టైమ్ స్పిన్నర్‌కు నాలుగు వికెట్లు... క్రీజులో ఉన్న సహచరుడు ఏ క్షణంలోనైనా రావచ్చని బయట మరో ఇద్దరు ప్యాడ్లతో సిద్ధంగా ఉండటం...
 
అంతా తమాషా..!

 అవును... మొహాలీ పిచ్‌పై స్పిన్నర్ల హవాను ఊహించినా... మరీ ఈ స్థాయిలో తొలి రోజే పిచ్ ఇలా స్పందిస్తుందనేది ఎవరి ఊహకూ అందని విషయం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ మ్యాచ్ నాలుగోరోజుకు చేరితేనే గొప్ప. మొత్తానికి ‘ఫ్రీడమ్ సిరీస్’లోతొలి రోజే పలు మలుపులు.
 
మొహాలి: ఆటగాళ్ల ప్రదర్శనకంటే పిచ్ గురించి ఎక్కువగా చర్చ సాగిన తొలి టెస్టులో పిచ్ తన పని తాను పూర్తి చేసింది. గింగిరాలు తిరిగే స్పిన్‌తో ఇక్కడి పీసీఏ స్టేడియంలో తొలి రోజే 12 వికెట్లు నేలకూలగా, అందులో 9 స్పిన్నర్లే తీశారు. గురువారం దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టు మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులకే కుప్పకూలింది. ఒంటరి పోరాటం చేసిన మురళీ విజయ్ (136 బంతుల్లో 75; 12 ఫోర్లు)కు తోడు చివర్లో జడేజా (92 బంతుల్లో 38; 4 ఫోర్లు) కాస్త ప్రతిఘటించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‌తో డీన్ ఎల్గర్ (4/22) సంచలన ప్రదర్శన చేయగా, తాహిర్, ఫిలాండర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా కూడా భారత స్పిన్ ముందు తీవ్రంగా ఇబ్బంది పడింది. 20 ఓవర్ల పాటు ఆడిన ఆ జట్టు కేవలం 28 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఎల్గర్ (13 బ్యాటింగ్), ఆమ్లా (9 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
 
 తొలి సెషన్  కీలక భాగస్వామ్యం

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగడంతో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అటు దక్షిణాఫ్రికా తరఫున వన్డేల్లో చెలరేగిన రబడకు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ఫిలాండర్ తన తొలి ఓవర్లోనే చక్కటి బంతితో ధావన్ (0)ను అవుట్ చేసి సఫారీలకు శుభారంభం అందించాడు. ఈ దశలో విజయ్, పుజారా (66 బంతుల్లో 31; 6 ఫోర్లు) మంచి సమన్వయంతో ఆడారు. వీరిద్దరు చక్కటి షాట్లతో ఆకట్టుకున్నారు. అయితే పార్ట్ టైమర్ ఎల్గర్‌కు ఆమ్లా బంతినివ్వడం ఆ జట్టుకు కలిసొచ్చింది. తన నాలుగో బంతికే అతను పుజారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 63 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించగా... మరో నాలుగు బంతులకే బర్త్‌డే బాయ్ కోహ్లి (1)ని అవుట్ చేసి రబడ కెరీర్‌లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
 ఓవర్లు: 27, పరుగులు: 82, వికెట్లు: 3
 
రెండో సెషన్:  ఎల్గర్ మ్యాజిక్
లంచ్ తర్వాత భారత్ కోలుకున్నట్లే కనిపించింది. పిచ్ ఎలా ఉన్నా ఇబ్బంది పడకుండా ఓపిగ్గా ఆడిన విజయ్ 115 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఎల్గర్ భారత్‌ను మళ్లీ దెబ్బ కొట్టాడు. అతని వరుస బంతుల్లో రహానే (15), సాహా (0) స్లిప్‌లో ఆమ్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో కష్టాలు పెరిగాయి. విజయ్, జడేజా కొద్ది సేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసి 45 బంతుల్లో 38 పరుగులు జత చేశారు. అయితే హార్మర్ బౌలింగ్‌లో స్వీప్‌కు ప్రయత్నించి విజయ్ అవుట్ కాగా... ఆ వెంటనే మిశ్రా (6)ను కూడా ఎల్గర్ పెవిలియన్ చేర్చాడు. ఓవర్లు: 28, పరుగులు: 86, వికెట్లు: 4
  
మూడో సెషన్:  ఉత్కంఠ
బ్రేక్ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగలేదు. సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలిచిన జడేజాను ఫిలాండర్ ఎల్బీగా వెనక్కి పంపాడు. ఒక ఎండ్‌లో అశ్విన్ (20 నాటౌట్) కొన్ని పరుగులు జోడించినా... తాహిర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్ ముగించాడు.

స్పిన్ బలం చూసిన కోహ్లి మరో ఆలోచన లేకుండా అశ్విన్‌తోనే మొదటి ఓవర్ వేయించాడు. ఆ నమ్మకం నిలబెడుతూ అశ్విన్...తన నాలుగో ఓవర్లో వాన్‌జిల్ (5)ను అవుట్ చేశాడు. జడేజా తన రెండో బంతికే డు ప్లెసిస్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ శిబిరంలో ఆనందం నెలకొంది. అనూహ్యంగా తిరుగుతున్న బంతిని అతి కష్టమ్మీద ఎదుర్కొంటూ ఎల్గర్, ఆమ్లా రోజును ముగించారు. వీరిద్దరు కలిసి 70 బంతులు ఆడి 19 పరుగులు మాత్రం జోడించగలిగారు. కోహ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా మూడో వికెట్ దక్కలేదు.
 ఓవర్లు: 13, పరుగులు: 33, వికెట్లు: 3 (భారత్).  ఓవర్లు: 20, పరుగులు: 28, వికెట్లు: 2 (దక్షిణాఫ్రికా)
 
టాస్ గెలవడంతో వచ్చిన అవకాశం వృథా చేసుకున్న మాట కొంత వరకు వాస్తవం. అయితే 20 ఓవర్ల తర్వాత ప్రత్యర్థి స్కోరు చూస్తే ఇలాంటి పిచ్‌పై మా 201 చాలా పెద్ద స్కోరు. ఇప్పటికే 2 వికెట్లు తీశాం కాబట్టి మ్యాచ్ సమాన స్థితిలోనే ఉంది. బంతి నెమ్మదిగా వస్తున్న ఈ వికెట్‌పై పరుగులు చేయడం అంత సులువు కాదు. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకు కూడా ఇది సవాల్‌లాంటిదే. ఓపిగ్గా ఆడితే ఫలితం వస్తుందని విజయ్ రుజువు చేశాడు. అయితే దక్షిణాఫ్రికా చాలా చక్కటి ప్రణాళికతో బౌలింగ్ చేసింది. మా బ్యాట్స్‌మెన్ ఇప్పుడు చేసిన పొరపాట్లు తర్వాతి ఇన్నింగ్స్‌లో పునరావృతం చేయరని నమ్ముతున్నా.
 - సంజయ్ బంగర్, భారత బ్యాటింగ్ కోచ్

మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉన్నా నా దృష్టిలో ఇదో చెత్త వికెట్. ఇక ముందు కూడా భారత్‌లో మా కోసం ఇలాంటి పిచ్‌లే సిద్ధం చేస్తారని అనిపిస్తోంది (వ్యంగ్యంగా). ఇప్పుడున్న స్థితిని బట్టి మ్యాచ్ ఎవరి వైపు అయినా మొగ్గవచ్చు. నాకు దక్కిన నాలుగు వికెట్ల పట్ల నేనే ఆశ్చర్యంగా ఉన్నా. అయితే భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడం సంతోషం. రెండో రోజు మాకు బ్యాటింగ్ కష్టం కావడం ఖాయం. నా కెరీర్‌లో ఇది కఠినమైన టెస్టు మ్యాచ్. అయితే సొంతగడ్డపై ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టే భారత్ వ్యూహం ఈ సారి విఫలం కావాలని ఆశిస్తున్నా.
 - డీన్ ఎల్గర్, దక్షిణాఫ్రికా ఆటగాడు
 
2008లో దక్షిణాఫ్రికా చేతిలో 76కు ఆలౌట్ అయిన తర్వాత భారత్ సొంతగడ్డపై  తొలి రోజే ఆలౌట్ కావడం ఇదే మొదటి సారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement