‘తేడా’ చూపించాల్సిందే! | Revenge of the last of the series to focus | Sakshi
Sakshi News home page

‘తేడా’ చూపించాల్సిందే!

Published Sun, Sep 27 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

‘తేడా’ చూపించాల్సిందే!

‘తేడా’ చూపించాల్సిందే!

గత సిరీస్‌కు ప్రతీకారంపై దృష్టి
 కొత్త జోష్‌లో భారత జట్టు
రెండేళ్లలో పెరిగిన అనుభవం
సఫారీ టీమ్‌లోనూ కొన్ని మార్పులు

 
దాదాపు రెండేళ్ల క్రితం ధోని నాయకత్వంలో భారత జట్టు... దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు ‘అనుభవం లేని లైనప్’ అంటూ చర్చోపచర్చలు సాగాయి. అయితే అలాంటి జట్టు కూడా తొలి టెస్టులో ప్రత్యర్థిని ఓడించినంత పని చేసినా విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు జట్టు ఆటతో పాటు ఆలోచనా ధోరణి కూడా మారింది. ఒక రకంగా ఊతపదంగా మారిపోయిన ‘దూకుడు’ అన్ని చోట్లా కనిపిస్తోంది. నాటి జట్టుతో పోలిస్తే ఎక్కువగా మార్పులు లేకపోయినా... యువ క్రికెటర్లంతా ఎంతో మెరుగై కావాల్సినంతగా రాటుదేలారు. పైగా సొంతగడ్డపైనే సిరీస్ జరుగుతోంది. 2013-14 పర్యటనలో నామ్‌కే వాస్తేగా కూడా ఒక్క విజయమూ లేకుండా ఖాళీ చేతులతో తిరిగొచ్చిన టీమిండియా ఆటగాళ్లు టెస్టులు, వన్డేలు రెండింట్లోనూ ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు.
 
సాక్షి క్రీడా విభాగం గత సిరీస్‌లో ప్రపంచంలోని ఫాస్టెస్ట్ పిచ్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన డర్బన్‌లో రెండో టెస్టు జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడినా... రహానే రెండు అద్భుత ఇన్నింగ్స్‌లతో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 51 పరుగులుతో అజేయంగా నిలిచిన అతను, రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి స్ట్రోక్‌లతో 96 పరుగులు చేశాడు. అది రహానే కెరీర్‌లో మూడో టెస్టు మాత్రమే. అంతకుముందు జొహన్నెస్‌బర్గ్ మ్యాచ్‌లో కూడా రహానే ఫీల్డింగ్‌లో తనదైన ముద్ర చూపించాడు. ఆ తర్వాత రహానే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు వేదికల్లో మరో 15 టెస్టులు ఆడాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాణించగల బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. అప్పుడే అంత పరిపక్వత చూపించిన బ్యాట్స్‌మన్ ఇప్పుడు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. నాటి ఓటమిని మరిపించే విధంగా ఆడతానని రహానే కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.
 కెప్టెన్‌గా కొత్తగా: విరాట్ కోహ్లి కూడా గత సిరీస్‌ను మరచిపోలేడు.

తొలి టెస్టులో 119, 96 పరుగుల స్కోర్లతో భారత్‌ను విజయం కోసం అతను సన్నద్ధం చేశాడు. అయితే అనుభవలేమి జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. అది ఇప్పటికీ కోహ్లిని బాధిస్తోంది. అతను ఇంటర్వ్యూలలో తరచుగా జొహన్నెస్‌బర్గ్ టెస్టు ప్రస్తావిస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు కోహ్లి ఆటగాడిగానే కాకుండా టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎంతో ఎదిగాడు. శ్రీలంకతో సిరీస్ విజయం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. పైగా దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై కోహ్లి తొలిసారి ఆడబోతున్నాడు. కాబట్టి ఈ సిరీస్ అతనికి మంచి అవకాశం కల్పిస్తోంది. టెస్టు స్పెషలిస్ట్ పుజారా అప్పుడు 2 టెస్టుల్లో కలిపి 280 పరుగులతో సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మళ్లీ జట్టులోకి వచ్చి కొలంబో టెస్టులో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన అతను, మళ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు.

లెక్క సరి చేస్తారా: టెస్టుల కోసం ఇంకా భారత జట్టును ప్రకటించకపోయినా... ఎవరైనా ఒక ఆటగాడు అదనంగా చేరడం తప్పితే శ్రీలంకతో సిరీస్ ఆడిన టీమ్ మార్పుల్లేకుండానే ఉండవచ్చు. రెగ్యులర్ సభ్యులలో విజయ్, ధావన్, రోహిత్ నాటి దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమయ్యారు. అప్పుడు ఒకే టెస్టు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అశ్విన్ ఇప్పుడు స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఇక భారత్‌లోనైతే అతనికి ఘనమైన రికార్డు ఉంది. వీరంతా లెక్క సరి చేయాల్సి ఉంది. ఆ సిరీస్‌లో మెరుగైన బౌలింగ్ చేసిన ముగ్గురు ఆటగాళ్లు జహీర్, జడేజా, షమీ ఇప్పుడు జట్టులో లేరు. ప్రస్తుత టీమ్‌లో కేఎల్ రాహుల్ ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు.
 
 రోహిత్ ఎలా ఆడతాడో...
 కొన్నాళ్ల క్రితమే వన్డేల్లో డబుల్ సెంచరీతో వచ్చిన స్టార్ హోదాతో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన రోహిత్ శర్మ ఒక్కసారిగా బేలగా మారిపోయాడు. తొలి వన్డేలోనైతే స్టెయిన్ అతడిని ఆడుకున్నాడు. తొలి 15 బంతుల పాటు రోహిత్ కనీసం బ్యాట్‌ను కూడా తాకించలేకపోయాడు. తర్వాతి మ్యాచ్‌లో కూడా అదే వైఫల్యం. కానీ ఆ తర్వాత రోహిత్ మళ్లీ చెలరేగాడు. సొంతగడ్డపైనే రెండో రికార్డు డబుల్ సెంచరీ చేశాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అంటే అతనికి నాటి స్టెయిన్ స్పెల్ కచ్చితంగా గుర్తుకు వస్తుంది. ప్రపంచకప్‌లోనూ సఫారీలతో డకౌట్ అయిన అతను భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఆ సిరీస్‌లో మూడో వన్డే రద్దు కాగా... రెండు వన్డేలు కలిపి భారత్ నుంచి ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదైంది అంటే మనోళ్ల వైఫల్యం ఏమిటో అర్థమవుతుంది. కోహ్లి, రైనా, రహానేలు తమ సత్తా చూపించాల్సి ఉంది. అప్పుడు ఆడిన జడేజా, షమీ, ఇషాంత్, యువరాజ్ ప్రస్తుతం జట్టులో లేరు. స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్, గుర్‌కీరత్ పూర్తిగా కొత్త ముఖాలు.
 
 సఫారీ జోరు కొనసాగేనా...
 నాటి దక్షిణాఫ్రికా టెస్టుతో తాజా జట్టును పోలిస్తే... స్మిత్, కలిస్, అల్విరో పీటర్సన్ రిటైర్ కాగా... ఎనిమిది మంది మరోసారి భారత్‌తో పోటీకి సిద్ధమయ్యారు. అయితే దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఐదుగురికి మాత్రమే గతంలో ఇక్కడ టెస్టు ఆడిన అనుభవం ఉంది. ఇక వన్డేల్లో అప్పుడు వరుసగా మూడు సెంచరీలతో మన బెండు తీసిన క్వాంటన్ డి కాక్ మళ్లీ వస్తున్నాడు. మొత్తంగా ఎనిమిది మందికి గత సిరీస్‌లో భారత్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. మైదానంలో బరిలోకి దిగినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లలోనూ గత సిరీస్ జ్ఞాపకాలు మదిలో ఉండటం ఖాయం. ఈసారి మనోళ్లు తగిన రీతిలో బదులిస్తారా లేక దక్షిణాఫ్రికా ఇక్కడా తమ జోరు కొనసాగిస్తుందా చూడాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement