పదేళ్ల తర్వాత టెస్టు సమరం | India Womens only Test against South Africa from today | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత టెస్టు సమరం

Published Fri, Jun 28 2024 4:10 AM | Last Updated on Fri, Jun 28 2024 4:10 AM

India Womens only Test against South Africa from today

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత మహిళల ఏకైక టెస్టు 

ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం  

చెన్నై: దశాబ్ద కాలం తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్‌ జట్లు టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి. నేటి నుంచి జరిగే ఏకైక టెస్టులో సఫారీ టీమ్‌ను సొంతగడ్డపై భారత్‌ ఎదుర్కోనుంది. దక్షిణాఫ్రికాపై 3–0తో వన్డే సిరీస్‌ గెలిచిన భారత్‌ జోరు మీదుంది. ఈ మ్యాచ్‌ ద్వారా భారత్‌ నుంచి కనీసం ఐదుగురు కొత్త ప్లేయర్లు టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఉమా చెత్రి, ప్రియా పూనియా, సైకా ఇషాక్, అరుంధతి రెడ్డి, షబ్నమ్‌ షకీల్‌ తమ తొలి టెస్టు బరిలోకి దిగవచ్చని అంచనా.

వన్డేలు, టి20లతో పోలిస్తే భారత మహిళల జట్టు చాలా తక్కువ సంఖ్యలో టెస్టులు ఆడుతోంది. రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాది డిసెంబర్‌లో భారత్‌ టెస్టు ఆడింది. వరుసగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలతో పోటీ పడిన మన టీమ్‌ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది. అయితే ఆ తర్వాత జట్టు మళ్లీ బరిలోకి దిగలేదు. దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా 2014లో మైసూరు టెస్టులో తలపడిన జట్టు 34 పరుగులతో గెలుపొందింది. 

కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో పాటు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు. బౌలింగ్‌కు సంబంధించి పూజ వస్త్రకర్, దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా ప్రభావం చూపించగలరు. చెపాక్‌ మైదానంలో సాధారణంగా స్పిన్‌ను బాగా అనుకూలిస్తుంది కాబట్టి భారత్‌ కోణంలో ఇది సానుకూలాంశం. 

మరోవైపు గత రెండేళ్లలో దక్షిణాఫ్రికా కూడా ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ ఆడింది. కెపె్టన్‌ లారా వాల్‌వార్ట్, స్యూన్‌ లూస్, డెల్మీ టకర్, తజ్‌మీన్‌ బ్రిట్స్, అనెక్‌ బాష్‌లపై జట్టు ఆధారపడుతోంది. పిచ్‌ అనుకూలిస్తే స్పిన్నర్‌ ఎంలాబా భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement