నా రూటే సెపరేటు.. | Virat Kohli gears up for 'special day' | Sakshi
Sakshi News home page

నా రూటే సెపరేటు..

Published Thu, Nov 5 2015 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

నా రూటే సెపరేటు..

నా రూటే సెపరేటు..

సచిన్ నుంచి సెహ్వాగ్ వరకు దిగ్గజాలు ఎవరూ లేకుండా 1988 తర్వాత భారత జట్టు తొలి సారి సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ప్రస్తుతం జట్టులోని సభ్యులలో సగం మంది నాడు పుట్టలేదు కూడా. ఈ కుర్రాళ్లందరూ ఇప్పుడు స్వదేశంలో భారత్ అద్భుతమైన రికార్డును కొనసాగించేందుకు బ్యాటన్ అందుకున్నారు.
 
కానీ ఈ సారి ప్రత్యర్థి చూస్తే తిరుగు లేని ఆటతో దూసుకుపోతున్న నంబర్‌వన్ జట్టు. ఇప్పటికే టి20, వన్డే సిరీస్‌లు గెలిచిన ఉత్సాహంలో ఉంది. ఇలాంటి జట్టును ఓడిస్తే మన యువ జట్టుకు వచ్చే కిక్కే వేరు. ఈ సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో విజయం సాధిస్తే అది కుర్రాళ్ల ఘన భవిష్యత్తుకు పునాది అవుతుందనడంలో సందేహం లేదు. మరి టీమిండియాకు సఫారీ కొండను ఢీకొట్టే సత్తా ఉందా.  
 
రెండేళ్ల తర్వాత భారత జట్టు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతోంది. కెప్టెన్‌గా స్వదేశంలో కోహ్లికి ఇదే మొదటి టెస్టు కూడా. వీటితో పాటు గురువారం 27వ పుట్టినరోజు జరుపుకుంటున్న కోహ్లి బర్త్‌డే కానుకగా శుభారంభం లభిస్తుందా.
 
ఈ పోలిక ఎవరికి నచ్చినా నచ్చకపోయినా... భారత క్రికెట్‌లో ఇప్పుడు విరాట్ కోహ్లిది సచిన్ టెండూల్కర్ స్థాయి. ఆట పరంగా, మార్కెట్‌లో ఆదాయం పరంగా కోహ్లి ఇప్పుడు సూపర్ స్టార్. అయితే ఆ దిగ్గజానికి సరితూగాలంటే కోహ్లి కొంత మారాలి.
 
ప్రస్తుతం భారత క్రికెట్‌లో ‘పోస్టర్ బాయ్’ విరాట్ కోహ్లి. భారత జట్టులో రెగ్యులర్ సభ్యుడైన తర్వాత కేవలం నాలుగేళ్లకే కోహ్లి కెప్టెన్ అవుతాడనేది అప్పట్లో ఎవరూ ఊహించని విషయం. కానీ శ్రమతో, పట్టుదలతో ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత శక్తిమంతుడిగా ఎదిగాడు. ఇవాళ విరాట్ కోహ్లి పుట్టిన రోజు. నేటితో 27 ఏళ్లు పూర్తయ్యాయి. సాధారణంగా ఈ వయసుకు బాగా పరిణతి రావాలి.

ఇప్పటికే ఎంతో అనుభవం ఉన్న విరాట్... ఇంకా కొన్ని విషయాల్లో మాత్రం చిన్నపిల్లల తరహాలోనే వ్యవహరిస్తున్నాడు. అందుకే వివాదాలు అతని వెన్నంటే వస్తున్నాయి. కోపాన్ని కాస్త తగ్గించుకోగలిగితే భారత క్రికె ట్ చరిత్రలో చిరకాలం నిలిచే పేరు విరాట్ కోహ్లి.
 
డేరింగ్ బ్యాట్స్‌మన్:  ప్రస్తుత క్రికెట్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేయడంలో డివిలియర్స్ తర్వాతి స్థానం కోహ్లిదే. ప్రపంచంలో అతి గొప్ప బౌలర్లపై అతను చేసే దాడి... రెండో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌లోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఏ బంతికి బాదాలో, ఏ బంతిని గౌరవించాలో... ఏ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో తెలిసిన క్రికెటర్. ఒకసారి కుదురుకుంటే అంతే. 19 ఏళ్ల వయసులోనే సచిన్, ద్రవిడ్ లాంటి దిగ్గజాలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం రావడం కోహ్లికి చాలా మేలు చేసింది. వాళ్ల దగ్గరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. మైదానంలో తన దూకుడు కారణంగా లక్ష్యఛేదనలో భారత్ తరఫున అత్యుత్తమ క్రికెటర్‌గా అవతరించాడు. అతను గెలిపించిన మ్యాచ్‌లతో కోట్లాది మంది అభిమానులతో పాటు స్పాన్సర్లను సంపాదించుకున్నాడు.
 
ఏకాగ్రత, ఫిట్‌నెస్ ఎక్కువ: బ్యాటింగ్ చేసే సమయంలో కోహ్లికి ఏకాగ్రత చాలా ఎక్కువ. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్థి ఎవరైనా వణకిపోవాల్సిందే. ఒక్కో ఓవర్ గడిచేకొద్దీ అతను మరింత ప్రమాదకరంగా తయారవుతాడు. చిన్న వయసు నుంచే ఇది అలవాటు కావడంతో పాటు తన ఫుట్‌వర్క్ నైపుణ్యం కారణంగా కోహ్లి ఆడే షాట్స్ చాలా అందంగా ఉంటాయి. తన వయసు క్రికెటర్లందరిలోకి అత్యంత ఫిట్‌గా ఉండే క్రికెటర్. అందుకే గాయాల బారిన పడడు. ఎలాంటి వాతావరణంలో అయినా సుదీర్ఘంగా మైదానంలో గడపగల లక్షణం అతణ్ని ప్రత్యేక క్రికెటర్‌ని చేసింది. ఆటపరంగా ఈ తరం క్రికెటర్లకు సరైన ఉదాహరణ కోహ్లి.
 
వివాదాల నిలయం: కెరీర్ ఆరంభం నుంచి కూడా విరాట్ కోహ్లిని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 19 ఏళ్ల వయసులోనే వచ్చిన స్టార్ హోదాతో అప్పట్లో అతను ఎవరినీ లెక్కచేసేవాడు కాదు. పబ్‌లలో స్నేహితులతో కలిసి గొడవలు... మైదానంలో ప్రేక్షకులపై బూతు పురాణం... ఇలా అనేక చెడు లక్షణాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే చాలా తొందరగానే తన తప్పులు తెలుసుకున్నాడు. సహజంగానే నైపుణ్యం ఉన్న ఆటగాడు కావడంతో జట్టులోకి రాగలిగాడు. అయినా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రతి చిన్న విషయానికీ కోప్పడటం అనే లక్షణం ఇప్పటికీ పోలేదు. వయసుతో పాటు పరిణతి పెరిగి దీనిని నియంత్రించుకోకపోతే కష్టం.
 
వ్యక్తిగత వ్యవహారం: బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ ప్రేమ నిజానికి తన వ్యక్తిగత వ్యవహారం. అయితే పదే పదే ఆమె స్టేడియానికి రావడం, సెంచరీ చేశాక ఆమెకు ‘కిస్‌లు’ విసరడం లాంటి చేష్టలు లేనిపోని వివాదాలకు తావిస్తున్నాయి. ఆ సమయంలో అవి సరదాగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ అనుష్క స్టేడియానికి వచ్చిన సమయంలో విరాట్ విఫలమైతే వచ్చే విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కానీ వీటిని తట్టుకోలేకపోతున్నాడు. మంచి జరిగినప్పుడు ఎంజాయ్ చేస్తున్నందున... చెడు జరిగినప్పుడు దానిని కూడా అదే స్థాయిలో తీసుకోవాలి.
 
ఇది మంచా..? చెడా..?: మైదానంలో, వెలుపల కూడా దూకుడుగా ఉండే కోహ్లి... కెప్టెన్ అయ్యాక కూడా తన రూటును మార్చుకోలేదు. పైగా జట్టులోని మిగిలిన క్రికెటర్లకు కూడా దూకుడు నేర్పుతున్నాడు. దీనివల్ల జట్టుకు నష్టం జరుగుతోంది. శ్రీలంక సిరీస్‌లో ఇదే రుజువయింది.

కెప్టెన్‌గా తన ముద్ర జట్టుపై కనిపించాలనేది విరాట్ తాపత్రయం. దీర్ఘకాలంలో ఇది మంచి చేస్తుందా? లేక చెడు చేస్తుందా? అనేది ఆలోచించడం లేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ ద్వారా విరాట్ ఓ కొత్త శకానికి తెరతీస్తున్నాడు. ఇప్పటిదాకా విరాట్ రూటే సెపరేటు. కానీ అతను మరింత పరిణతి చూపాలని, తద్వారా సుదీర్ఘ కాలం భారత క్రికెట్‌కు మూలస్తంభంలా నిలవాలని ఆశిస్తూ... Happy Birthday Virat.       
                                -సాక్షి క్రీడావిభాగం
 
‘‘నా జీవితంపై అనేక మంది అనేక సార్లు ఎన్నో విమర్శలు చేశారు, చేస్తున్నారు. వాటన్నింటినీ పట్టించుకోను. నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. వయసు పెరిగేకొద్దీ కొన్ని విషయాల్లో అనుభవం వస్తుంది. గతంలో చేసిన తప్పుల నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకోవాల్సిందే. నేనూ అంతే’’
-కోహ్లి

 
పిచ్, వాతావరణం
వాంఖడే వివాదం నేపథ్యంలో మొహాలి పిచ్‌పై అందరి దృష్టి నిలిచింది. భారత్‌లో పేస్‌కు స్పందించే పిచ్‌లలో ఒకటిగా గుర్తింపు ఉన్నా... ఈ టెస్టుకు మాత్రం స్పిన్‌కు అనుకూలించే విధంగానే పిచ్‌ను రూపొందించారు. భారత జట్టు 12వ ఆటగాడిగా ఇది పని చేయవచ్చని వినిపిస్తోంది. 23 ఏళ్లుగా ఈ పిచ్‌ను ఒక్కసారి కూడా తవ్వి మార్చలేదు. మ్యాచ్ సాగిన కొద్దీ నెమ్మదిస్తుందని క్యురేటర్ స్వయంగా వెల్లడించారు. సాధారణంగా ఉత్తరాదిలో కనిపించే చల్లని వాతావరణం ఉంది. ఆటకు వర్షం వల్ల అంతరాయానికి అవకాశం లేకపోయినా... వెలుతురులేమి ఇబ్బంది పెట్టవచ్చు.
 
 
* నేటినుంచి తొలి టెస్టు మ్యాచ్
* యువ ఆటగాళ్లతో భారత్ సిద్ధం
* ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా
* కెప్టెన్‌గా కోహ్లికి సొంతగడ్డపై తొలి మ్యాచ్
మొహాలి: టెస్టు సిరీస్‌లో స్పిన్‌తో దక్షిణాఫ్రికా పని పట్టేందుకు భారత జట్టు సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం (నేటి) నుంచి ఇక్కడి పీసీఏ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు జరగనుంది.

ఇప్పటికే టి20, వన్డే సిరీస్ చేజార్చుకున్న భారత్...తమ బలం స్పిన్‌ను నమ్ముకొని టెస్టుల్లో విజయంపై కన్నేసింది. అయితే మరో వైపు దీనిని ఊహించిన సఫారీలు తమదైన శైలిలో పూర్తి స్థాయి సన్నాహకాలతో వచ్చారు. ఈ నేపథ్యంలో తొలి రోజునుంచే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది. ఫార్మాట్‌లు మారడంతో ఇరు జట్లూ కొత్త కెప్టెన్‌ల నాయకత్వంలో బరిలోకి దిగుతున్నాయి.
 
పుజారాకు చోటు దక్కేనా!
శ్రీలంకతో ఆఖరి టెస్టులో అద్భుత సెంచరీ సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచినా... ఈ టెస్టు సిరీస్‌కు వచ్చే సరికి చతేశ్వర్ పుజారాకు స్థానంపై సందేహాలే ఉన్నాయి. కెప్టెన్ కోరుకునే ‘దూకుడు’ కారణంగా భారత్ మరోసారి ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని కోహ్లి చూచాయగా చెప్పేశాడు. కాబట్టి ధావన్, విజయ్, రహానే, కోహ్లి పోగా...ఐదో బ్యాట్స్‌మన్ కోసం పుజారాకు మరో సారి రోహిత్‌శర్మ నుంచే పోటీ ఎదురవుతోంది.

పరిమిత ఓవర్లలో విఫలమైనా ధావన్, బంగ్లాతో ఆ తర్వాత లంకతోనూ టెస్టుల్లో సెంచరీలు చేశాడు. ఇక పిచ్‌ను బట్టి నలుగురు బౌలర్లతో ఆడవచ్చని డెరైక్టర్ రవిశాస్త్రి చెప్పిన మరుసటి రోజే కోహ్లి దానికి భిన్నంగా మాట్లాడాడు. ఆ అవకాశాలు లేవని చెప్పేయడంతో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో జట్టు బరిలోకి దిగుతుంది. స్టార్ స్పిన్నర్ అశ్విన్‌తో పాటు మిశ్రా, జడేజా జట్టులో ఉంటారు. నిషేధం కారణంగా ఇషాంత్ ఆడటం లేదు కాబట్టి ఉమేశ్ యాదవ్, ఆరోన్‌లకు చోటు ఖాయం. అయితే భారత్ విజయావకాశాలు స్పిన్నర్లపైనే ఆధారపడి ఉంటాయనడంలో సందేహం లేదు.
 
మోర్కెల్ ఫిట్‌నెస్‌పై సందేహం
పిచ్ ఎలాగున్నా తమ బలమైన పేస్‌నే దక్షిణాఫ్రికా నమ్ముకుంటోంది. ముగ్గురు ప్రధాన పేసర్లు స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్ ఆ జట్టుకు కీలకం కానున్నారు. అయితే వన్డే సిరీస్‌లో గాయపడిన మోర్కెల్ మ్యాచ్ రోజు ఉదయం జరిగే ఫిట్‌నెస్ టెస్టులో పాస్ అయితేనే జట్టులో ఉంటాడు. ప్రస్తుతం సఫారీలు పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ తాహిర్‌కంటే ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ వైపే మొగ్గు చూపుతున్నారు.

ఆల్‌రౌండర్ డుమిని ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఆ జట్టు అవకాశాలను దెబ్బ తీసింది.  ముగ్గురు వైవిధ్యమైన స్పిన్నర్లు ఉన్న భారత్‌ను ఆ జట్టు బ్యాట్స్‌మెన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఈ టూర్‌లో డివిలియర్స్, డు ప్లెసిస్ చక్కటి ఫామ్‌లో ఉండగా కెప్టెన్ ఆమ్లా పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. సిరీస్‌లో రాణించకపోతే అతని స్థానంపై కూడా విమర్శలు చెలరేగుతాయి.   
 
జట్ల వివరాలు (అంచనా):
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, రహానే, పుజారా/రోహిత్, సాహా, జడేజా, అశ్విన్, మిశ్రా, ఉమేశ్, ఆరోన్.
దక్షిణాఫ్రికా: ఆమ్లా (కెప్టెన్), ఎల్గర్, వాన్‌జిల్, డు ప్లెసిస్, డివిలియర్స్, బవుమా, విలాస్, ఫిలాండర్, స్టెయిన్, హార్మర్, మోర్కెల్/తాహిర్.
 
2013లో వెస్టిండీస్‌తో సచిన్ వీడ్కోలు సిరీస్ తర్వాత భారత్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. అంతకు ముందు 11 ఏళ్లలో ఇక్కడ  17 సిరీస్‌లు ఆడిన టీమిండియా... ఒక్కసారి మాత్రమే (2012లో ఇంగ్లండ్ చేతిలో) ఓడింది.
 
భారత గడ్డపై గత రెండు సిరీస్‌లు కూడా దక్షిణాఫ్రికా ‘డ్రా  చేసుకోగలిగింది.
 
పరుగులు చేసే బాధ్యత టాప్-5 బ్యాట్స్‌మెన్‌దే. కీపర్, ఆల్‌రౌండర్ చేసేవి అదనం. లక్ష్య ఛేదన సమయంలో తప్ప నా దృష్టిలో బౌలర్లే మ్యాచ్‌ను గెలిపించగలరు. కాబట్టి ఐదుగురు ప్రధాన బౌలర్లు ఉండటం అవసరం. నిస్సందేహంగా అశ్విన్‌పై మా విజయావకాశాలు ఆధార పడి ఉన్నాయి. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉండటం కలిసొస్తుంది. పరుగులు చేయడమే కాదు వేగంగా చేయడం కూడా బ్యాట్స్‌మన్‌గా నా బాధ్యత. పుట్టిన రోజున కెప్టెన్‌గా సొంతగడ్డపై తొలి టెస్టు ఆడబోవడం ఉద్వేగంగా ఉంది. నా గడ్డంలో కొన్ని తెల్ల వెంట్రుకలు చేరడం మినహా కెప్టెన్ అయ్యాక వచ్చిన మార్పు ఏమీ లేదు.                 
-విరాట్ కోహ్లి
 
స్వదేశం అయినా విదేశమైనా పేసర్లకు గెలిపించే సత్తా ఉన్నప్పుడు స్పిన్నర్లు కావాలని ఎందుకు కోరుకోవాలి. మా బలం అదే. అయితే డుమిని లేకపోవడం మా స్పిన్ విభాగాన్ని కాస్త బలహీనం చేసింది. టర్నింగ్ పిచ్ అయితే అతను కూడా ప్రభావం చూపించగలిగేవాడు. మేం అన్ని చోట్లా బాగా ఆడుతున్నాం. భారత్‌లో ఆడటం సవాల్ అని తెలుసు.    
-హషీం ఆమ్లా
 
ఉ. గం. 9.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement