సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మీడియాపై మండిపడ్డాడు. బుధవారం ప్రోటీస్‌తో రెండో టెస్ట్ ఓటమి తర్వాత కోహ్లి ప్రెస్ మీట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా కొందరు పాత్రికేయులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నిగ్రహం కోల్పోయిన అతను ఘాటుగా బదులిచ్చాడు.
బెస్ట్-11ను ఎంచుకోవటంలో సెలక్షన్ కమిటీ, కోహ్లి విఫలమవుతున్నారన్న ఓ ప్రశ్నతో కోహ్లికి కాలిపోయింది. ‘‘ఒకవేళ మేం గెలిచి ఉంటే బెస్ట్ 11 అన్న ప్రస్తావన వచ్చేదా?. ఊరికే కూర్చుని మాట్లాడటం కాదు. మైదానంలో దిగితే తెలుస్తుంది. ఇకపై జట్టును మీరే సెలక్ట్ చేయండి. మేం ఆడతాం’’ అంటూ చెప్పాడు. రహానే, భువనేశ్వర్‌లను పక్కనపెట్టడం పై స్పందిస్తూ... ఆయా నిర్ణయాలు ఊరికే తీసుకోలేదని.. వాటిపై అనవసరంగా రాద్ధాంతం చెయ్యకండని మీడియాకు కోహ్లి హితవు పలికాడు.
భారీ మార్పుల మూలంగానే జట్టు ఓటమి పాలవుతుందా? అన్న మరో ప్రశ్నకు కూడా దాదాపు అదే రీతిలోనే బదులిచ్చాడు. ‘‘మేం ఇప్పటిదాకా 34 టెస్టులు ఆడాం. అందులో గెలిచినవి 21 మ్యాచ్‌లు(నిజానికి 20 మాత్రమే గెలిచింది). రెండే రెండు ఓడిపోయాం. మిగతావి డ్రాగా ముగిశాయి. గెలుపు కోసం మా శక్తి మేర ప్రయత్నిస్తాం. జట్టు మార్పులు విజయాలపై ప్రభావం చూపవు. అయినా నేను ఇక్కడికి సమాధానాలు చెప్పటానికి మాత్రమే వచ్చాను. మీతో గొడవ పడటానికి కాదు’’ అంటూ కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు.
సెంచూరియన్ టెస్టులో 135 పరుగుల తేడాతో భారత్ ఓటమిపాలు కాగా.. ఫుల్ టైం కెప్టెన్‌గా కోహ్లికి ఇదే తొలి సిరీస్ ఓటమి. స్వదేశీ గడ్డపై వరుస విక్టరీలతో టెస్ట్ ర్యాకింగ్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్న భారత్.. విదేశీ గడ్డలపై విజయాల విషయంలో మాత్రం తడబడుతూనే వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment