సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు చెమటోడ్చుతున్నారు. ఈ రోజు( శనివారం) ఆరంభమైన మ్యాచ్‌లో టాస్ ఓడి బౌలింగ్ చేపట్టిన టీమిండియా.. లంచ్ సమయానికి వికెట్‌ను కూడా సాధించలేకపోయింది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మర్‌క్రామ్(51 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(26 బ్యాటింగ్)లు నిలకడగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తద్వారా లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 27.0 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా ఏడు ఓవర్లు వేసి 25 పరుగులివ్వగా, మొహ్మద్ షమీ నాలుగు ఓవర్లలో 23 పరుగులిచ్చాడు. ఇక ఇషాంత్ శర్మ ఏడు ఓవర్లు బౌలింగ్ వేసి 12 పరుగులు, హార్దిక్ పాండ్యా ఐదు ఓవర్లలో 15 పరుగులు, అశ్విన్ నాలుగు ఓవర్లలో 2 పరుగులిచ్చాడు.
రెండో టెస్టు తుది జట్టులో టీమిండియా మూడు మార్పులు చేసి బరిలోకి దిగింది. గాయపడ్డ వికెట్ కీపర్ సాహా స్థానంలో పార్థీవ్ పటేల్‌కు అవకాశం కల్పించారు. ఇక శిఖర్ ధావన్ స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి రాగా, భువనేశ్వర్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకున్నారు. కాగా దక్షిణాఫ్రికా ప‍్రధాన పేసర్ స్టెయిన్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్ట్‌లో టీమిండియా ఓటమిపాలు కావడంతో సఫారీలు 1-0 తో ఆధిక్యంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment