
కేప్‌టౌన్:దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. సఫారీలు విసిరిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ సేన 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంకా 126 పరుగుల వెనుకబడి ఉన్న టీమిండియా చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇంకా మంగళవారం కూడా ఆట మిగిలి ఉండటంతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయమైంది. ఏమైనా అద్బుతం జరిగితే తప్ప భారత జట్టు ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టం. టీమిండియా కోల్పోయిన ఏడు వికెట్లలో ఫిలిండర్ మూడు వికెట్లు సాధించగా, మోర్కెల్, రబడాలు తలో రెండు వికెట్లు తీశారు. భారత ఆటగాళ్లలో మురళీ విజయ్(13),శిఖర్ ధావన్(16), చతేశ్వర పుజారా(4), విరాట్ కోహ్లి(28), రోహిత్ శర్మ(10), సాహా(8),హార్దిక్ పాండ్యా(1)లు నిరాశపరిచి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 130 పరుగుల స్వల్ప స్కోరు పరిమితమైంది. 65/2 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీలు.. మరో 65 పరుగులు జత చేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయారు. దాంతో సఫారీలకు 207 పరుగుల ఆధిక్యం లభించింది. దీన్ని కాపాడుకునే క్రమంలో సఫారీలు విజృంభించి బౌలింగ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment