యువ సత్తాకు పరీక్ష | India's young stars face tough pace test in South Africa | Sakshi
Sakshi News home page

యువ సత్తాకు పరీక్ష

Published Wed, Dec 18 2013 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

యువ సత్తాకు పరీక్ష

యువ సత్తాకు పరీక్ష

టెన్ క్రికెట్‌లో మధ్యాహ్నం
 గం. 2.00 నుంచి ప్రత్యక్ష ప్రసారం
 
 దాదాపు ఏడాది కాలంగా భారత జట్టు యువ నామస్మరణతో హోరెత్తింది. కొత్త కుర్రాళ్లు వచ్చారు, అద్భుతంగా ఆడుతున్నారు...ఇక దిగ్గజాలు తప్పుకున్నా తిరుగు లేదనే ధోరణి చాలా సందర్భాల్లో కనిపించింది. అయితే దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లో పరాజయ పర్వంతో వారి సామర్థ్యంపై కొంత సందేహాలు తలెత్తాయి. ఇలాంటి స్థితిలో ఇప్పుడు మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ఆటగాళ్ల అసలు సత్తాకు పరీక్షగా నిలిచే టెస్టు క్రికెట్‌కు మన ఆటగాళ్లు సిద్ధమయ్యారు. పేస్, బౌన్స్‌తో బుల్లెట్లలా దూసుకొచ్చే ప్రత్యర్థి బౌలర్ల బంతులకు ఏ మేరకు ఎదురొడ్డి నిలవగలరన్నదే ఆసక్తికరం.
 
 
 జొహన్నెస్‌బర్గ్: సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు పోరుకు రంగం సిద్ధమైంది. ఇక్కడి వాండరర్స్ మైదానంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేటినుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌లో ఓడిన భారత్ టెస్టుల్లోనైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాలని భావిస్తుండగా...సొంత గడ్డపై టెస్టుల్లో తమ అద్భుత రికార్డును నిలబెట్టుకోవాలని స్మిత్ సేన పట్టుదలగా ఉంది. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా భారత్‌కు ప్రతికూలాంశం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతుందా, ఏకపక్షంగా ముగుస్తుందా చూడాలి.
 
 కోహ్లిపై భారం...
 మూడేళ్ల క్రితం నంబర్‌వన్‌గా దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి సిరీస్‌ను డ్రాగా ముగించింది. అయితే ఆ తర్వాత విదేశీ గడ్డపై వరుసగా ఎనిమిది టెస్టుల్లో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో తాజా సిరీస్ టీమిండియాకు అంత సులువు కాబోదు. ఇక్కడి పరిస్థితులు, పిచ్‌లు భారత్‌ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వేగం, విపరీతమైన బౌన్స్ కలగలిపి దూసుకొచ్చే బంతులను ఎదుర్కోవడం జట్టుకు పెద్ద సవాల్. ముఖ్యంగా ద్రవిడ్, లక్ష్మణ్, సచిన్‌వంటి దిగ్గజాల రిటైర్మెంట్‌తో జట్టు ముఖచిత్రమే మారిపోయింది.
 
 
 ఇప్పుడు జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారు. టాప్-6 బ్యాట్స్‌మెన్‌లలో ధోని ఒక్కడికే 20కి పైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. వన్డేల్లో స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లి ఇప్పుడు టెస్టుల్లోనూ కీలక బాధ్యతలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జట్టు కూర్పును బట్టి చూస్తే సచిన్ ఆడిన నాలుగో స్థానంలో అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. మాస్టర్ స్థాయిలో కాకపోయినా కోహ్లి తన సహజ ప్రతిభతో కీలక బాధ్యత నిర్వర్తించాల్సి ఉంది. వన్డేల్లో విఫలమైనా ఆ ప్రభావం తనపై పడకుండా స్టెయిన్, మోర్కెల్, ఫిలాండర్‌ల బౌలింగ్‌ను చక్కగా ఎదుర్కోగలగాలి. మూడో స్థానంలో పుజారా భారీ స్కోరు చేయడం ఎంతో ముఖ్యం. ఇక ధావన్, రోహిత్‌లపై కూడా జట్టు జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో జహీర్‌ఖాన్ ముందుండి నడిపిస్తుండగా...యువ బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఎంత వరకు కట్టడి చేయగలరన్నదే కీలకం. భువనేశ్వర్‌కంటే ఎక్కువ పేస్‌తో బంతులు వేసే ఇషాంత్‌కే తుది జట్టులో ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రహానేను ఆరో స్థానంలో ఆడిస్తూ టీమిండియా తుది జట్టులో ఏడుగురు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ముగ్గురు పేసర్లు, అశ్విన్ జట్టులో ఉంటారు.  
 
 పదునెక్కిన పేస్...
 మరో వైపు సొంత గడ్డపై ఆడుతుండటమే దక్షిణాఫ్రికాకు పెద్ద బలం. రెండేళ్ల క్రితం శ్రీలంక చేతిలో తమ దేశంలో ఓడిన తర్వాత సఫారీలు వరుసగా ఆరు టెస్టుల్లో నెగ్గారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రస్తుతం అత్యుత్తమ బౌలింగ్ అటాక్‌గా ఆ జట్టుకు గుర్తింపు ఉంది. తమ బౌలింగ్ సత్తా ఏమిటో వారు భారత్‌కు వన్డేల్లోనూ రుచి చూపారు. నంబర్‌వన్ బౌలర్ స్టెయిన్‌తో పాటు మోర్కెల్, ఫిలాండర్ ఎలాంటి లైనప్‌నైనా కుప్పకూల్చగల సమర్థులు.
 
 నాలుగో పేసర్‌గా కలిస్ కూడా ఉపయుక్త బౌలర్. తొలి టెస్టుకు ముందు రోజే దక్షిణాఫ్రికా తమ తుది జట్టును ప్రకటించింది. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు చోటు కల్పించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, అల్విరో పీటర్సన్‌లు ఇటీవల మెరుగైన జోడీగా నిలదొక్కుకున్నారు. ఆమ్లా ఫామ్‌లో ఉండగా...కలిస్, డివిలియర్స్, డుప్లెసిస్, డుమినిలతో చక్కటి బ్యాటింగ్ లైనప్ సఫారీల సొంతం.
 
 జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), విజయ్, ధావన్, పుజారా, కోహ్లి, రోహిత్, రహానే, అశ్విన్, జహీర్, ఇషాంత్, షమీ.
 
 దక్షిణాఫ్రికా: స్మిత్ (కెప్టెన్),  పీటర్సన్, ఆమ్లా, కలిస్, డివిలియర్స్, డుప్లెసిస్, డుమిని, ఫిలాండర్, స్టెయిన్, మోర్కెల్, తాహిర్.
 
 సచిన్ లేకుండా...
 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు తొలి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగనుంది. వాస్తవానికి ఇరు బోర్డుల మధ్య వివాదం చెలరేగక ముందు సచిన్ ఈ టూర్‌తోనే కెరీర్‌ను ముగిస్తాడనే అందరూ భావించారు. అయితే అనూహ్యంగా వెస్టిండీస్ సిరీస్ తెరపైకి వచ్చింది. గత సఫారీ పర్యటనలో కేప్‌టౌన్‌లో సచిన్ అద్భుత సెంచరీతో మ్యాచ్‌ను రక్షించిన ఇన్నింగ్స్ చిరస్మరణీయం.
 
 ‘సచిన్ ఇక ఆడడనే నిజాన్ని మనం అంగీకరించాలి. దీన్ని కుర్రాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించకుండా ఇప్పుడు ఏం చేయగలమో చూడాలి. పాత వైఫల్యాల భారాన్ని వెంట తెచ్చుకోకుండా ప్రతీ సిరీస్‌ను కొత్తగా ప్రారంభించాలి. పరిస్థితులకు తొందరగా అలవాటు పడటం ముఖ్యం.
 
 ఈ స్థాయిలో ఆడటం ద్వారా యువ ఆటగాళ్లు చాలా నేర్చుకోగలుగుతారు. ఆటగాళ్లకు దెబ్బలు తగలకుండా ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు కావడమే మంచిదైంది. టెస్టుల్లో బౌలింగే కీలకం. ఆరంభ ఓవర్లలో వికెట్లు తీస్తే ఒత్తిడి పెంచవచ్చు. అయితే గత రెండు దశాబ్దాలుగా మన బలం బ్యాటింగే అని విషయం మరచిపోవద్దు. సీనియర్లు ఉన్నప్పుడు వారికున్న అనుభవం వల్ల కొత్తగా సిద్ధం కావాల్సిన అవసరం లేకపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మన బలాలు, బలహీనతల గురించి తెలిసుండాలి. ఎవరూ 5-6 రోజుల్లో టెక్నిక్ మార్చుకోలేరు. ఇక నాలుగో స్థానంలో ఎవరూ ఆడతారో చెప్పను, వేచి చూడండి’
 - ధోని, భారత కెప్టెన్.
 
 ‘భారత జట్టులో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇలాంటి పర్యటనల్లో రాణించడం వారికి పెద్ద సవాల్. నంబర్‌వన్‌గా మా హోదాకు తగిన విధంగా చెలరేగి టెస్టు గెలవాలని కోరుకుంటున్నాను. వాండరర్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. కాబట్టి ఇక్కడ గెలవాలంటే 500కు పైగా పరుగులే చేయనవసరం లేదు. కీలక సమయంలో ఒక మంచి భాగస్వామ్యం చాలు. చిన్న సిరీస్‌లో తొలి టెస్టులోనే పట్టు సాధించడం ఎంతో కీలకం’.     
 - గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్
 
 వాతావరణం
 ఎప్పటిలాగే వాండరర్స్ పిచ్‌పై పేస్, బౌన్స్ ఎక్కువగా ఉందని క్యురేటర్ పెథాల్ బుథెలిజి చెప్పాడు. అయితే ఒక్కసారి నిలదొక్కుకుంటే ఇది బ్యాటింగ్‌కూ అనుకూలిస్తుంది కాబట్టి టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేయాలని అతను సూచించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులు చక్కటి స్కోరని క్యురేటర్ వెల్లడించాడు. మ్యాచ్‌కు ముందు రోజు వికెట్‌పై తేమతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయి.
 
 పిచ్
 గత వారం వరుసగా ఇక్కడ వర్షం కురిసినా ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది. అయితే ప్రతీ రోజు కాస్త జల్లులు కురిసే అవకాశం మాత్రం ఉంది. మ్యాచ్ తొలి రోజు గురువారం వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండవచ్చు.
 
 వాండరర్స్ మైదానంలో ఆడిన మూడు టెస్టుల్లో భారత్ ఒక్కటీ ఓడిపోలేదు. 1 గెలిచి, 2 డ్రా చేసుకుంది.
 
 డిసెంబర్ 2000 తర్వాత ఈ మైదానంలో జరిగిన 12 టెస్టుల్లోనూ ఫలితం రావడం విశేషం.
 మరో 5 వికెట్లు తీస్తే... జహీర్‌ఖాన్ టెస్టుల్లో 300 వికెట్లు, ఫిలాండర్ 100 వికెట్ల మైలురాళ్లను అందుకుంటారు. భారత కెప్టెన్‌గా ధోనికి 50వ టెస్టు మ్యాచ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement