తొలి వన్డేలో భారత్ చిత్తు | South Africa thrash India by 141 runs in the First ODI | Sakshi
Sakshi News home page

తొలి వన్డేలో భారత్ చిత్తు

Published Fri, Dec 6 2013 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

తొలి వన్డేలో భారత్ చిత్తు

తొలి వన్డేలో భారత్ చిత్తు

జొహన్నెస్‌బర్గ్‌లో గురువారం తుపాన్‌కు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అసలు తుపాన్ అయితే రాలేదు కానీ... దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ పరుగుల సునామీ సృష్టించారు. డి కాక్, ఆమ్లా పునాది వేస్తే... దానిపై డివిలియర్స్, డుమిని పరుగుల పండుగ చేసుకున్నారు. బేలగా మారిన భారత బౌలర్లను సఫారీలు ఆటాడుకున్నారు.
 
 భారత బ్యాటింగ్ సరికొత్త హీరో రోహిత్ శర్మ బంతిని బ్యాట్‌తో తాకించడానికి 16 బంతులు తీసుకుంటే... ఇన్నింగ్స్ తొలి బౌన్సర్‌కే ధావన్ వెనుదిరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది... దక్షిణాఫ్రికాలో తమకు లభించిన ఈ తరహా స్వాగతానికి భారత బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తిపోయారు. ఐదుగురు పేసర్లు వేస్తున్న బంతులు బుల్లెట్ల తరహాలో దూసుకొస్తుంటే ఈసారి ఇంతే అనుకుంటూ కాడి పడేశారు.
 
 జొహన్నెస్‌బర్గ్: వరుసగా ఆరు వన్డే టోర్నీ విజయాలతో అద్భుత ఫామ్‌తో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన భారత కుర్రాళ్లు  వాస్తవంలోకి వచ్చేశారు. మొదటినుంచి భయపడ్డట్లుగానే అక్కడి బౌన్స్, స్వింగ్ జట్టు జోరుకు బంధనాలు వేశాయి. ఫలితంగా ఇక్కడి వాండరర్స్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. అన్ని విభాగాల్లో రాణించిన దక్షిణాఫ్రికా 141 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.
 
 ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారత్ 41 ఓవర్లలో 217 పరుగులకే ఆలౌటైంది. క్వాంటన్ డి కాక్ (121 బంతుల్లో 135; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు), హాషిమ్ ఆమ్లా (88 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 152 పరుగులు జోడించగా... చివర్లో డివిలియర్స్ (47 బంతుల్లో 77; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), డుమిని (29 బంతుల్లో 59 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోయారు. భారత ఆటగాళ్లలో కెప్టెన్ ధోని (71 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. తాజా ఫలితంతో మూడు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో నిలిచింది.  ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం డర్బన్‌లో జరుగుతుంది.
 
 భారీ భాగస్వామ్యం...
 టాస్ గెలిచిన భారత కెప్టెన్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే పెద్దగా అనుభవం లేని భారత స్వింగ్ బౌలర్లు మోహిత్ శర్మ, భువనేశ్వర్ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయారు. దాంతో దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా, డి కాక్ తమ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. భారత ఆటగాళ్ల పేలవ ఫీల్డింగ్‌తో వీరిద్దరు అవుట్ కాకుండా తప్పించుకోగలిగారు. అతి దగ్గరినుంచి ధావన్ రనౌట్ చేయలేకపోగా...క్యాచ్ పట్టడంలో రోహిత్ నిర్లక్ష్యం ప్రదర్శించాడు. ఓపెనర్లలో ఆమ్లా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి ప్రాధాన్యతనిస్తే... 20 ఏళ్ల కుర్రాడు డి కాక్ దూకుడుగా ఆడాడు. జోడిని విడదీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. ఈ క్రమంలో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా కూడా ప్రభావం చూపలేకపోయారు. చివరకు భారీ భాగస్వామ్యం తర్వాత 30వ ఓవర్లో ఆమ్లాను అవుట్ చేసి షమీ జట్టుకు తొలి వికెట్ అందించాడు. ఆ వెంటనే కలిస్ (10) కూడా వెనుదిరిగాడు.
 
 సిక్సర్ల మోత...
 మరోవైపు ధాటిగా ఆడిన డి కాక్ 101 బంతుల్లో కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి రెండో ఎండ్‌లో డివిలియర్స్ కూడా జోరు పెంచాడు. చివరకు పార్ట్ టైమర్ కోహ్లి, డి కాక్‌ను పెవిలియన్ పంపించాడు. అయితే భారత్ ఆనందం అక్కడే ఆవిరైంది. 44 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా స్కోరు 258/3. ఆఖరి 6 ఓవర్లు టీమిండియాపై సఫారీలు సవారీ చేశారు. డివిలియర్స్, డుమిని కలిసి సిక్సర్ల మోత మోగించారు. ఫలితంగా చివరి ఆరు ఓవర్లలో వరుసగా 16, 16, 20, 12, 23, 13 (మొత్తం 100 పరుగులు) వచ్చాయి. ఇందులో డుమిని 5 భారీ సిక్సర్లు, 2 ఫోర్లు బాదగా... తనకే సాధ్యమైన వైవిధ్యమైన షాట్లతో డివిలియర్స్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు కలిసి 46 బంతుల్లోనే 105 పరుగులు జోడించడం విశేషం.
 
 మెరుపు బౌలింగ్...
 వరుసగా శుభారంభాలు ఇస్తూ వచ్చిన రోహిత్ శర్మ (43 బంతుల్లో 18; 2 ఫోర్లు), ధావన్ (12) జోడి ఈ మ్యాచ్‌లో తడబడింది. రోహిత్ అయితే ప్రతీ బంతికి తడబడ్డాడు. స్టెయిన్ వేసిన తొలి రెండు ఓవర్లను మెయిడిన్‌గా ఆడిన రోహిత్ ఎట్టకేలకు 17వ బంతికి మొదటి పరుగు తీశాడు. ధావన్‌ను మోర్కెల్ అవుట్ చేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వద్ద డి కాక్ క్యాచ్ వదిలేయడంతో బయటపడ్డ కోహ్లి (35 బంతుల్లో 31; 5 ఫోర్లు) కొన్ని చక్కని షాట్లతో అలరించాడు. అయితే కోహ్లితో పాటు యువరాజ్ (0)ను ఒకే ఓవర్లో అవుట్ చేసి మెక్లారెన్ దెబ్బ తీశాడు. తర్వాతి ఓవర్లోనే రోహిత్... కొద్ది సేపటికి రైనా (14) రనౌటయ్యారు. ఈ దశలో ధోని, జడేజా (30 బంతుల్లో 29; 6 ఫోర్లు)  కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా భారత్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.
 
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (బి) షమీ 65; డి కాక్ (సి) అండ్ (బి) కోహ్లి 135; కలిస్ (సి) జడేజా (బి) షమీ 10; డివిలియర్స్ (బి) షమీ 77; డుమిని (నాటౌట్) 59; మిల్లర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 358
 వికెట్ల పతనం: 1-152; 2-172; 3-247; 4-352.
 
 బౌలింగ్: మోహిత్ శర్మ 10-0-82-0; భువనేశ్వర్ 9-0-68-0; షమీ 10-1-68-3; అశ్విన్ 10-0-58-0; జడేజా 8-0-58-0; రైనా 1-0-7-0; కోహ్లి 2-0-15-1.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (రనౌట్) 18; ధావన్ (సి) డి కాక్ (బి) మోర్కెల్ 12; కోహ్లి (సి) కలిస్ (బి) మెక్లారెన్ 31; యువరాజ్ (బి) మెక్లారెన్ 0; రైనా (రనౌట్) 14; ధోని (బి) స్టెయిన్ 65; జడేజా (బి) కలిస్ 29; అశ్విన్ (సి) డి కాక్ (బి) మెక్లారెన్ 19; భువనేశ్వర్ (సి) కలిస్ (బి) స్టెయిన్ 0; మోహిత్ (నాటౌట్) 0; షమీ (సి) అండ్ (బి) స్టెయిన్ 0; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (41 ఓవర్లలో ఆలౌట్) 217
 
 వికెట్ల పతనం: 1-14; 2-60; 3-60; 4-65; 5-108; 6-158; 7-183; 8-190; 9-217; 10-217.  
 
 బౌలింగ్: స్టెయిన్ 8-3-25-3; సోట్సోబ్ 9-0-52-0; మోర్కెల్ 8-1-29-1; మెక్లారెన్ 8-0-49-3; పార్నెల్ 5-0-37-0; కలిస్ 3-0-20-1.
 
వాండరర్స్ గులాబీమయం
తొలి వన్డే జరిగిన వాండరర్స్ మైదానమంతా గులాబీ రంగుతో నిండిపోయింది. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడంలో భాగంగా నిర్వాహకులు ఈ గురువారాన్ని ‘పింక్ డే’గా నిర్వహించారు. దక్షిణాఫ్రికా జట్టు మొత్తం పింక్ డ్రెస్ వేసుకోవడంతో పాటు హెల్మెట్, బ్యాట్‌లపై గ్రిప్‌ను కూడా పింక్‌తో నింపేశారు. భారత ఆటగాళ్లు తమ భుజాలకు గులాబీ రంగు రిబ్బన్ ధరించారు. స్పాన్సర్ హోర్డింగ్‌లను కూడా అదే రంగుతో ముంచెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement